Eating Disorders
-
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
అతిగా తినడం కూడా మానసిక వ్యాధే!
సుజిత బీటెక్ విద్యార్థిని. మూడో సంవత్సరానికి 10 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దాంతో మానసికంగా చాలా ఒత్తిడికి లోనైంది. దాన్నుంచి తప్పించుకోవడానికి చేతికి అందింది తినడం అలవాటు చేసుకుంది. క్రమంగా బరువు పెరిగింది. వద్దనుకున్నా తినడం ఆపుకోలేక పోతోంది. దాంతో మరింత బరువు పెరుగుతోంది. జీరోసైజ్‌లో ఉండే తాను లావుగా మారడం పట్ల గిల్టీగా ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడకుండా తన గదికే పరిమితమై బాధపడుతోంది. కూతురి సమస్యను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. సైకాలజీ కౌన్సెలర్‌ని కలిశారు. సుజిత తల్లిదండ్రులు చెప్పింది విన్నాక, సుజితతో మాట్లాడాక.. నెగటివ్ ఎమోష్స నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ తినడం చిన్నప్పటినుంచీ ఆమెకున్న అలవాటని అర్థమైంది. తిండిపై కంట్రోల్ కోల్పోయాననే విషయం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, దాన్ని తగ్గించుకునేందుకు మరింత తింటోందని ఆమె మాటల ద్వారా తెలిసింది. క్లినికల్ ఇంటర్వ్యూ, సైకలాజికల్ టెస్ట్స్, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బెడ్)తో బాధపడుతోందని నిర్ధారణైంది. అతిగాతినేఈ వ్యాధి సుజితలా చాలామంది జీవితాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్సను అందించడం అవసరం. అలా గుర్తించి సైకోథెరపీ తీసుకున్న 20 సెషన్లలో తన రుగ్మత నుంచి సుజిత బయటపడింది. లైఫ్ స్టైల్ మార్పులు, సైకోథెరపీతో చెక్ అతిగా తినే వ్యాధికి సైకోథెరపీ అవసరమైనా ఎవరికి వారు తమను తాము నియంత్రించుకోవడం, లైఫ్ స్టయిల్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిని నిలకడగా ఉంచడానికి, బింజ్ చేయాలనే కోరికను తగ్గించడానికి స్నాక్స్, భోజనం విషయంలో ఒక షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుని ఫాలో అవ్వడం. భోజన సమయంలో శ్రద్ధను మరల్చే వాటిని నివారించడం, ప్రతి బైట్నూ ఆస్వాదించడం, ఆకలి తగ్గడం, పొట్ట నిండిన సంకేతాలపై దృష్టి పెట్టడం. బింజ్ ఈటింగ్‌ను ట్రిగ్గర్ చేసే పరిస్థితులు, ఎమోష్స, ఆహారాలను గుర్తించి.. వాటిని నివారించడానికి మార్గాలను సిద్ధం చేసుకోవడం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరస్తుంది, పాజిటివ్ బాడీ ఇమేజ్ను ప్రమోట్ చేస్తుంది. సమస్యను అర్థం చేసుకుని సహాయం అందించగల స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం. స్వీయ విమర్శ స్థానంలో తనను తాను అంగీకరించుకోవడం. పైవన్నీ చేశాక కూడా ఎలాంటి ఫలితం కనిపించకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. ఆహారం, తిండికి సంబంధమున్న నెగటివ్ ఆలోచనలను, ప్రవర్తనలను గుర్తించడంలో, మార్చడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఇంటర్ పర్సనల్ రిలేష్సను మెరుగుపరచడం, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడంలో ఇంటర్ పర్సనల్ థెరపీ సహాయపడుతుంది. అతిగా తినే వ్యాధితో ఎదురయ్యే యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి రుగ్మతలను తగ్గించడానికి మందులు కూడా అవసరం కావచ్చు. · వ్యక్తి అవసరాలను, అభిరుచులను గుర్తించి ఆరోగ్యకరమైన తిండి అలవాట్లను తయారుచేయడంలో న్యూట్రిషనిస్ట్ సహాయపడతారు. రసాయన, మానసిక, సామాజిక కారకాలు... ఈ వ్యాధికి కచ్చితమైన కారణమేమిటో ఇంకా తెలియకపోయినప్పటికీ దాని అభివృద్ధికి దోహదపడే ఆనువంశిక, రసాయన, మానసిక, సామాజిక కారకాలున్నాయి. అతిగా తినే వ్యాధి రావడంలో కుటుంబ చరిత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.మెదడులో ఆకలి, రివార్డ్‌ను నియంత్రించే రసాయనాల అసమతుల్యత కూడా ఈ వ్యాధికి దారితీయవచ్చు. నిరాశ, ఆందోళన, లో సెల్ఫ్ ఎస్టీమ్, ట్రామా లాంటి మానసిక సమస్యలు కూడా కారణమవుతాయి. తీవ్ర డైటింగ్ లేదా ఆహారంపై నియంత్రణకు తిరుగుబాటుగా కూడా బింజ్ ఈటింగ్‌కు దారితీయవచ్చు. జీరోసైజ్ ఉంటేనే అందమనే సోషల్ ప్రెజర్, ప్రాసెస్డ్ ఫుడ్ అందుబాటులో ఉండటం కూడా అతిగా తినే ప్రమాదాన్ని పెంచుతుంది. గుర్తించడం సులభమే... అతిగా తినే వ్యాధిని ఎవరికి వారు గుర్తించలేకపోయినా కుటుంబ సభ్యులు సులువుగా గుర్తించవచ్చు. ఈ రుగ్మత లక్షణాలు... తక్కువ వ్యవధిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తినడాన్ని నియంత్రించుకో లేకపోవడం. భారీగా తినడానికి సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా దాచుకుని తినడం. కడుపు నిండిందని తెలిసినా తినడం ఆపలేకపోవడం. తినే పదార్థాన్ని ఆస్వాదించకుండా అసాధారణవేగంతో తినడం. అతిగా తింటున్న విషయం గుర్తించి తనను తానే అసహ్యించుకోవడం. ఆహారం, తిండిపైనే మనసు నిలపడం వల్ల పనిలో ఏకాగ్రత కోల్పోవడం, మానవ సంబంధాలు నిర్వహించడంలో ఇబ్బంది పడటం. -
అతిగా తింటే ఈ రోగాలు తప్పవు!
టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా ఈటింగ్ డిజార్డర్స్ కనిపిస్తాయి. కొందరు పిల్లలు అతిగా తినడం, కొందరేమో అసలేమీ తినకుండా ఎండుకుపోతుంటారు. టీనేజ్‌లో అడుగుపెట్టే సరికి అందం, శరీర ఆకృతిపై శ్రద్ధ పెరగడం సహజమే! కానీ ఇందుకోసం అతిగా తినడం లేదా పూర్తిగా మానుకోవడం పలు రకాల శారీరక ఇక్కట్లను తీసుకువస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్ ఉందని గుర్తించడానికి కొన్ని లక్షణాలుంటాయి. ఉన్నట్టుండి బరువు పెరగడంలేదా తగ్గడం, తమ శరీర ఆకృతి, బరువుపై ఎక్కువగా దృష్టిపెట్టడం, ఎక్కువ సార్లు అద్దంలో చూసుకోవడం, కొద్దిగా ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా తినడం మానేయడం, ఒంటరిగా కూర్చోని తినడానికి ఇష్టపడడం, ఆహారం తీసుకునేటప్పుడు సాధారణం కంటే అతిగా నమలడం, అతిగా వ్యాయామం చేయడం, భోజనం తరువాత విరేచనం సాఫీగా అయ్యే మాత్రలు తీసుకోవడం, బరువు పెరగకుండా ఉండేందుకు తిన్న తర్వాత వాంతి చేసుకోవడానికి ప్రయత్నించడం, వారికి వారే అతిగా డైటింగ్ చేయడం. ఇందులో భాగంగా పంచదార, కార్బొహైడ్రేట్స్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం, ఎక్కువగా మూడ్ స్వింగ్స్ కలిగి ఉండడం, శరీరంలో శక్తిలేక త్వరగా అలిసిపోవడం, ఎప్పుడూ డిమ్‌గా లేదా డల్‌గా ఉండడంవంటివి కనిపిస్తే ఈటింగ్ డిజార్డర్‌గా అనుమానించవచ్చు. ఈ లక్షణాల వల్ల క్రమంగా కడుపులో మంట, అజీర్తి, కడపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు,పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి. బలవంతంగా వాంతులను ప్రేరేపించడం ద్వారా వేళ్ల జాయింట్ కీళ్లపై క్యాలస్ ఏర్పడుతుంది. తరచూ వాంతులు చేసుకోవడం వల్ల దంతాల రంగు మారిపోతుంది, స్త్రీలలో ఈటింగ్ డిజార్డర్ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్ కూడా సక్రమంగా రావు. ఈ అసహజతలకు కారణాలు.. ► మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపోవడం ► బలవంతంగా ఆహరపు అలవాట్లు మార్చుకోవడం ► హార్మోన్ల అసమతుల్యత ► వంశపారంపర్యత, జన్యువులలో అసంబద్ద ఉత్పరివర్తనాలు, ► గతంలో ఎదురైన దుర్ఘటనలు ► సమాజంలో కలవలేక పోవడం ► ఉద్యోగరిత్యా ఎదురయ్యే ఒత్తిడి వలన ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. భౌతికంగా లక్షణాలు కనిపించకపోతే రక్తపరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ద్వారా ఈ సమస్యను కొంతవరకు నిరోధించవచ్చు. సాధారణంగా కనిపించే ఈటింగ్ డిజార్డర్స్ మూడు రకాలు. అవి.. అనోరెక్సియా నెర్వోసా.. ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. కేలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు. బులిమియా నెర్వోసా.. ఇది ప్రాణానికి హానీ కలిగించే రుగ్మత అనిచెప్పవచ్చు. ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్ ఏర్పడుతుంది. బింగే ఈటింగ్ డిజార్డర్.. ఈ రుగ్మత కలిగిన వారు అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తమ ఆహారపు అలవాట్లు గురించి సిగ్గుపడుతుంటారు. -
మరీ సన్నగా ఉన్నాను...!
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ మరీ సన్నగా ఉన్నాను...! నా వయసు 20 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. చాలామంది నన్ను ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. బరువు కేవలం 47 కేజీలు మాత్రమే. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. - ఎన్. సుధీర్, ఈ-మెయిల్ కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... జన్యుపరమైనవి సరిగా తినకపోవడం చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం అతి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ైెహ పర్ థైరాయిడిజమ్) మీరు తీసుకునే ఆహరంలో పోషకాల పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు : మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో మరో మూడుసార్లు తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు. మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి. ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి. వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి. అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానికి ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సిందేనా? నా వయసు 42 ఏళ్లు. ప్రస్తుతం నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వ్యాధి స్టేజ్-5లో ఉంది. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాలని డాక్టర్లు అంటున్నారు. కచ్చితంగా వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించాలా? ఒకసారి చేయించుకుంటే సరిపోదా? - దశరథ్, కరీంనగర్ మీరు సీకేడీ స్టేజ్-5 లో ఉన్నారని వివరించిన దాన్ని బట్టి మీ కిడ్నీ పనితీరు కేవలం 15% మాత్రమే ఉంటుంది. ఈ విలువను బట్టి చూస్తే కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు పరిగణిస్తారు. మీరు వారానికి ఒకసారి మాత్రమే డయాలసిస్ చేయించుకుంటే, మీలోని వ్యర్థాల దుష్ర్పభావం మీ శరీరంలోని ఇతర అవయవాల మీద పడుతుంది. పైగా గుండెపనితీరు సక్రమంగా ఉండాలంటే మీరు డాక్టర్లు పేర్కొన్న మేరకు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డయాలసిస్ క్రమం తప్పితే, మీ జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గుతుంది. కాబట్టి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవడం మంచిది. అవసరం కూడా. నా వయసు 68 ఏళ్లు. నేను ఆరేళ్ల నుంచి బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాను. నెల క్రితం నుంచి ముఖం, కాళ్లలో వాపు కనిపిస్తోంది. ఆకలి లేమి, నడిస్తే ఆయాసంతో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మీద క్రియాటినిన్, బ్లడ్‌యూరియా, 2డీ ఎకో పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ 6.2 ఎంజీ/డీల్, యూరియా 182 ఎంఎల్, గుండె పనితీరు 68.2 శాతం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇకపై డయాలసిస్ చేయించుకొమ్మని డాక్టర్లు సలహా ఇచ్చారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని కూడా సూచించారు. ఈ పరిస్థితుల్లో నాకు తగిన సలహా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. - వెంకటేశ్వర్లు, కోదాడ గుండెపనితీరు తక్కువగా ఉన్నవారిలో కాళ్లవాపు, ఆయాసం ఎక్కువగా కనిపించడం సాధారణమే. మీరు పేర్కొన్న రక్తపరీక్షల వివరాలను బట్టి చూస్తే మీ డాక్టర్ గారు చెప్పింది వాస్తవమే. మీరు డయాలసిస్ చేయించుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. డయాలసిస్ చేయించుకోవడం వల్ల మీ గుండె పనితీరు, సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. మీకు సమీపంలోని నెఫ్రాలజిస్ట్‌ను కలిసి ఇంట్లోనే చేయించుకోగల డయాలసిస్ వివరాలను తెలుసుకోండి. యూరాలజీ కౌన్సెలింగ్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు సర్జరీ తప్పదా? నా వయసు 58 ఏళ్లు. నేను రెండేళ్లుగా ప్రోస్టేట్ గ్రంథి పెరగడం (ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్తో) బాధపడుతున్నాను. చాలాకాలంగా మందులు వాడుతున్నా ప్రయోజనం లేదు. డాక్టర్ శస్త్రచికిత్స చేయించుకొమ్మంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడం తప్పదా? - శ్రీనివాసరావు, రాజంపేట మనదేశంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు 50 ఏళ్లు పైబడిన వారిలో 50 శాతం మందిలో, 70 ఏళ్లు పైబడిన వారిలో 80 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ గ్రంథి వాపు వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ధార సన్నగా, బలహీనంగా రావడం, రాత్రుళ్లు తరచూ మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం, ఒక్కోసారి మూత్రంలో రక్తం పడటం, మూత్రం బ్లాడర్‌లో మిగిలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలతో పాటు, మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తున్నా మూత్రవిసర్జన చేయలేకపోవడం, చలిజ్వరం, మూత్రంలో రక్తం, పొత్తికడుపులో లేదా మూత్రమార్గంలో నొప్పితో పురుషులు తప్పక వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఈ వ్యాధి బయటపడుతుంది. దీనికి సరైన చికిత్స చేయించకపోతే తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) రావడం, మూత్రాశయం (బ్లాడర్)లో రాళ్లు, కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్‌కు దారితీయడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. కేవలం చాలా త్వరగా బయటపడ్డ (అర్లీ) ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు మాత్రమే మందులతో చికిత్స చేయవచ్చు. అయితే ఇక మందులతో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు. వాపు వచ్చిన ప్రోస్టేట్ భాగాన్ని తొలగించేందుకు డాక్టర్లు ‘ట్రాన్స్యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’ (టీయూఆర్‌పీ) లేదా లేజర్‌తో చేసే ప్రోస్టేట్ సర్జరీ (హోలెప్) వంటి ప్రక్రియలను అనుసరిస్తారు. ఈ శస్త్రచికిత్సల్లో సాధారణమైన మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా ఆ ప్రాంతానికే పరిమితమయ్యేలా పాక్షికమైన మత్తు (రీజియనల్ మత్తు) ఇవ్వాల్సి వస్తుంది. రోగి రెండు లేదా మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే చాలు. టీయూఆర్‌పీ అనేది చాలా సురక్షితమైనదని నిరూపితమైన (గోల్డెన్ స్టాండర్డ్) ప్రక్రియ. ఇక లేజర్ శస్త్రచికిత్సలో రక్తస్రావం అయ్యే అవకాశాలు టీయూఆర్‌పీ కంటే తక్కువ. మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి సురక్షితంగా చేయగలిగిన ఈ సాధారణ శస్త్రచికిత్సను చేయించుకోవడం అవసరం. -
ఈటింగ్ డిజార్డర్స్ తిండి తిప్పలు!
తినడం కూడా కొన్ని వ్యాధుల లక్షణమే అంటే అది విచిత్రంగా ఉండవచ్చు. కానీ అది వాస్తవం. తీవ్రమైన భావోద్వేగాలు, కోపం, ప్రవర్తనలో మార్పులు, వ్యాకులత, యాంగ్జైటీ వంటి అనేక సమస్యల వల్ల మనం తినే తీరులో మార్పులు వచ్చి... సదరు వ్యాధికి ఒక లక్షణంగా ప్రకటితమవుతాయి. కొన్నిసార్లు అవి భౌతికంగా మార్పులు మాత్రమే కాదు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మహిళలూ, పురుషులూ... ప్రత్యేకంగా కౌమార వయసులోకి వచ్చే టీనేజీ పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ భోజనరుగ్మతలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈటింగ్ డిజార్డర్స్కు కారణాలు ఆహార రుగ్మతలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రవర్తనపూర్వకమైనవి, జీవసంబంధమైనవి, ఉద్వేగాలకు, సంబంధించినవి, మానసికమైనవి, వ్యక్తిగతబంధాలకు సంబంధించినవి, సామాజిక అంశాలు... ఇలా రకరకాల కారణాలు ఆహారసంబంధ రుగ్మతలకు దారితీస్తాయి. ఇందులో చాలావరకు మానసికమైనవి. అవి క్రమంగా శారీరక ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతూ న్యూనతను కలిగిస్తాయి. 1. అనొరెక్సియా నర్వోజా సాధారణంగా పిల్లలు టీనేజీలోకి వస్తుండగానే తమ అందంపైనా, లుక్స్పైనా దృష్టి ఎక్కువగా ఉంటుంది. తాము లావెక్కి అసహ్యంగా కనిపిస్తున్నామేమో అన్న సందేహం వారిని పట్టి పీడిస్తుంటుంది. ఏమాత్రం ఎక్కువగా తిన్నా బరువు పెరిగి అందం దెబ్బతింటుందేమో అన్న సంశయంతో వారు కావాలనే తినడం మానేస్తుంటారు. దాంతో ఉండాల్సిన దాని కంటే మరీ ఎక్కువగా బరువు తగ్గి ఎముకలపోగులా మిగిలిపోతారు. కావాలన్నా తినలేని ఈ రుగ్మత పేరే ‘అనొరెక్సియా నర్వోజా’ బాల్యం నుంచి కౌమార దశలోకి ప్రవేశించేవారిలో ముఖ్యంగా అమ్మాయిల్లో కనిపించే ఈ జాడ్యం 5 శాతం నుంచి 20 శాతం మందిలో ప్రాణాంతకంగా మారుతుంది. ఇటీవల టీవీల్లో, సినిమాల్లో, ర్యాంప్షోలలో, ఇతర ప్రసారమాధ్యాలలో కనిపించే మోడల్స్‌ను అనుసరిస్తూ అలా సన్నగా ఉండటమే అందం అనే భావనలో జీరోసైజ్ అంటూ ఈ వ్యాధికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే దీన్ని ‘ఫ్యాషన్ డిజార్డర్’ అని కూడా వ్యవహరిస్తుంటారు. లక్షణాలు ♦ వారి శరీర పోషణకూ, జీవక్రియలకూ అవసరమైనదాని కంటే చాలా తక్కువగా తినడం ♦ తినే సందర్భం వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడం ♦ తమ శరీరంపై ఎక్కువ స్పృహ కలిగి ఆత్మన్యూనతతో వ్యవహరించడం ♦ తమ పరిస్థితి తమకు తెలుస్తున్నా దాన్ని గుర్తించేందుకు సంసిద్ధంగా లేకపోవడం. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ గణనీయంగా బరువు తగ్గిపోవడం ♦ ఎప్పుడూ బరువు తగ్గడం గురించి, క్యాలరీలను తక్కువ చేసుకోవడం గురించి, కొవ్వు కరిగించుకోవడం, డైటింగ్ గురించే ప్రస్తావిస్తుండటం. ♦ చాలా రుచికరమైన ఆహారం ముందుంచినా తినడానికి తిరస్కరించడం ♦ నేనేమైనా లావుగా కనిపిస్తున్నానా అంటూ వాకబు చేస్తుండటం. ♦ తినడం తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటూ ఉండటం. ♦ తాము బరువు పెరగడం లేదని తెలిసినా, ఎక్కడ బరువు పెరుగుతామో అన్న ఆందోళనతో క్యాలరీస్‌ను దహించాలంటూ కఠినమైన వ్యాయామాలకు పాల్పడటం. ♦ స్నేహితులనుంచి క్రమంగా దూరం కావడం. అనొరెక్సియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి. దాంతో శరీరం తనలోని శక్తిని ఆదా చేసుకోవడానికి సాధారణంగా జరగాల్సిన జీవక్రియలన్నింటినీ మందకొడిగా జరిగేలా చూస్తుంది. ఈ ‘మందకొడి’ ప్రక్రియ వల్ల తీవ్రస్థాయిలో వైద్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు... ♦ గుండె స్పందనల వేగం మందగిస్తుంది. రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా గుండె కండరాల పనితీరులో కూడా మార్పు వస్తుంది. ఇది క్రమంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. ♦ ఎముకల సాంద్రత మందగిస్తుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఎముకలు పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోవచ్చు. ♦ కండరాలు బలహీనంగా మారవచ్చు. సన్నబడిపోవచ్చు. ♦ తీవ్రమైన డీ-హైడ్రేషన్‌కు దారితీయవచ్చు. దానివల్ల మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. ♦ నీరసం, నిస్సత్తువతోపాటు ఒక్కోసారి స్పృహతప్పడం జరగవచ్చు. ♦ వెంట్రుకల కింద ఉండే ‘ల్యానుగో’ అనే ఒక పొర మందంగా మారుతుంది. శరీరం తన వేడిని కోల్పోకుండా ఉండేందుకు ఈ పరిణామం సంభవిస్తుంది. 2. బులీమియా నర్వోజా బులీమియా నర్వోజా అనే వ్యాధి చాలా తీవ్రమైనది. ఈ రుగ్మతలో... బింజ్ఈటింగ్ అని పిలిచే అదేపనిగా తినే అలవాటుతో పాటూ... తింటే బరువు పెరిగిపోతామేమో అనే అనొరెక్సియా లక్షణాలూ కలగలసి ఉంటాయి. బులీమియా నర్వోజా వ్యాధి ఒక్కోసారి డిప్రెషన్ లక్షణాలతో కలగలసి ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి సైతం దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు ♦ భోజనంపై అమిత ఇష్టం వల్ల రుచికరమైన పదార్థాలపై మోజు కారణంగా మొదట ఆహారాన్ని తినేస్తారు. ఆ తర్వాత తాము తిన్న పదార్థాల వల్ల అపరిమితంగా బరువు పెరిగిపోతామేమో అన్న ఆందోళనతో ప్రయత్నపూర్వకంగా వాంతి చేసుకుంటారు. ♦ తినే విషయంలో స్వీయనియంత్రణ చేసుకోలేరు. తిన్న తర్వాత తమంతట తామే బరువు పెంచుకుంటున్నామేమో అంటూ తీవ్ర అపరాధ భావనకు లోనవుతారు. ♦ శరీరాకృతిపై అవసరమైన దాని కంటే ఎక్కువగా దృష్టిసారించి ఆత్మన్యూనతకు లోనవుతారు. ♦ బులీమియా నర్వోజా వ్యాధిని ఎంత త్వరగా నిర్ధారణ చేయగలిగితే... దీని నుంచి బయటపడే అవకాశాలు అంత ఎక్కువ. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ చాలా తక్కువ సమయంలో ఎక్కువగా తినేస్తారు. ఆతృతగా తినేస్తుంటారు. ♦ జిహ్వచాపల్యాన్ని తట్టుకోలేక తినేశామనీ... కానీ తాము తిన్నది తమకు అవసరం లేనిదన్న భావనతో దాన్ని ఎలాగైనా వదులుకోవాలనే కోరికతో తరచూ బాత్రూమ్కు వెళ్లి ఎవరూ చూడకుండా వాంతి చేసుకుంటారు. ♦ కొందరు తాము తిన్నదాన్ని వదులుకోడానికి వాంతి చేసుకోడానికి బదులు విరేచనం చేసుకోవాలనే ఉద్దేశంతో అవసరానికి మించి విరేచనకారి (లాక్సెటివ్స్), అతిగా మూత్రం వచ్చే మందులు (డై-యూరెటిక్స్) వాడతారు. ♦ క్యాలరీలను కరిగించుకోవాలంటూ కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. ♦ రోగుల్లో అసాధారణరీతిలో చెంపలు, దవడల వాపు కనిపిస్తుంది. ♦ వేళ్లను నోటిలోకి జొనిపి వాంతి చేసుకుంటుంటారు కాబట్టి వేళ్ల కణుపులు (నకుల్స్) పళ్లతో ఒరిపిడికి గురై చర్మం మందంగా మారుతుంది. ♦ తరచూ వాంతుల వల్ల పళ్లరంగు మారుతుంది. ♦ స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. బులీమియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ అదేపనిగా ఎక్కువగా తినేయడం, ఆ తర్వాత మళ్లీ వాంతి చేసుకోవడం వెంటవెంటనే జరుగుతుండటం వల్ల జీర్ణక్రియలోని క్రమబద్ధతపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ సైకిల్ దెబ్బతింటుంది. ♦ డీ-హైడ్రేషన్ వల్ల శరీరంలో పొటాషియమ్, సోడియమ్ పాళ్లు తగ్గుతాయి. ♦ గుండె స్పందనలు లయ తప్పుతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాపాయం కలిగించవచ్చు. ♦ ప్రయత్నపూర్వకంగా మాటిమాటికీ చేసుకునే వాంతుల వల్ల కడుపులో మంట వస్తుంది. ♦ కడుపులో ఉండే యాసిడ్ వాంతి వల్ల బయటకు వచ్చి, పళ్లపై ప్రభావం చూపడం వల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦ విరేచనకారి మందులను విచక్షణరహితంగా వాడటం వల్ల విసర్జన అలవాట్లలో మార్పు, దీర్ఘకాలిక మలబద్దకం వంటి అనర్థాలు వస్తాయి. 3. బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బీఈడీ) ఈ రుగ్మత ఉన్న రోగులు ఏ ఆహారాన్ని అయినా అదేపనిగా తినేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లుగా తింటూ ఉంటారు. దీన్నే ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అంటారు. ఇది డిప్రెషన్ వ్యాధితో పాటు కలగలిసి ఉంటుంది. వీరిలో జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తక్కువ. లక్షణాలు ♦ ఎప్పుడూ తినాలనిపించే తమ కోరికను నియంత్రించుకోలేరు. ♦ అలా తింటూ ఉండటమూ, దాన్ని మిగతావాళ్లు గమనిస్తూ ఉన్నారన్న విషయం వాళ్లలో అపరాధభావనను కలిగిస్తుంది. ♦ అదేపనిగా తినడం తమకే నచ్చక ఆత్మన్యూనతకు గురవుతుంటారు. బింజ్ ఈటింగ్ వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలు ♦ బింజ్ ఈటింగ్ వల్ల కనిపించే తక్షణ అనర్థం బరువు అమితంగా పెరిగిపోవడం. రోగికి స్థూలకాయం రావడం. దాంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు... ♦ రక్తపోటు విపరీతంగా పెరగడం ♦ కొలెస్ట్రాల్ పాళ్లు పెరిగిపోవడం ♦ డయాబెటిస్ గాల్‌బ్లాడర్‌కు సంబంధించిన వ్యాధులు ♦ కండరాలూ, ఎముకల రుగ్మతలు గుండెజబ్బులు 4. డయాబులీమియా ఇది సాధారణంగా టైప్-1 డయాబెటిస్తో కలిసి ఉండే తిండి సంబంధమైన రుగ్మత. డయాబులీమియా వ్యాధిగ్రస్తులు తమ బరువు తగ్గాలనే ఉద్దేశంతో కావాలనే ఇన్సులిన్ పాళ్లను తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో డయాబెటిస్, బులీమియా... ఈ రెండు వ్యాధులూ ఉంటాయి కాబట్టి ‘డ్యుయల్ డయాగ్నోసిస్ డిజార్డర్’గా పేర్కొంటారు. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉపయోగించే తీరును దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఇది ఇతర రుగ్మతలకూ దారితీసే అవకాశమూ ఉంది. 5. ఆర్థోరెక్సియా నర్వోజా ఇది సరైన ఆహారం తీసుకోవాలనే తపన నుంచి ఆవిర్భవించే రుగ్మత. ఆర్థోరెక్సియా నర్వోజాకూ... అనొరెక్సియా, బులీమియాలకూ ఓ తేడా ఉంది. అనొరెక్సియా, బులీమియాలో అందాలకూ, లుక్స్కూ ప్రాధాన్యమిస్తారు. కానీ ఆర్థోరెక్సియా నర్వోజా రోగులకు అన్నీ ఆరోగ్య సంబంధమైన సందేహాలే! తాము తిన్నది సరైన ఆహారమేనా, అది సమతులాహారమేనా అనే సందేహాలు రోగిని పట్టి పీడిస్తుంటాయి. తాము ఆరోగ్యకరమైన పరిణామంలోనే తింటున్నామా లేక ఎక్కువగానో, తక్కువగానో తింటున్నామా అనే సంశయాలు వస్తుంటాయి. దీంతో వారు తిండి విషయంలో చాలా కఠినమైన నియమాలు పెట్టుకుని ఆచరిస్తుంటారు. ప్రతిదీ తినేప్పుడు దాని ఆరోగ్యవిలువలూ, పోషకాలూ వంటి లెక్కలేసుకుని తింటుంటారు. ఫలానా పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా దానినుంచి దూరంగా ఉంటారు. తమ జిహ్వచాపల్యాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ తమను తాము శిక్షించుకుంటుంటారు. నూనెలు ఎక్కువ తీసుకుంటే కొవ్వు పేరుకుంటుందేమోననే సందేహంతో వాటిని తగ్గించి... కొవ్వుల్లో కరిగే విటమిన్ల లోపాలు తెచ్చుకుంటారు. ఉప్పు ఆరోగ్యానికి అనర్థమంటూ బాగా తగ్గించుకుని హైపోనేట్రీమియా లాంటి జబ్బులతో ఆసుపత్రుల పాలవుతుంటారు. ఇటీవల ఆరోగ్య స్పృహ మరీ ఎక్కువగా పెరగడంతో వచ్చిన అనర్థమిది. ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో మంచి నియమాలు పాటించడంలో తప్పులేదు. కానీ అదేపనిగా ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఒకరకమైన నిస్పృహకూ, న్యూనతకూ గురయి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవడం సరికాదు. కాబట్టి ఆరోగ్యస్పృహనూ మరీ పెచ్చుమీరిపోనివ్వకుండా ఉండాలి. ఆర్థోరెక్సియాను అధిగమించడానికి మార్గాలు : ♦ ఎప్పుడైనా, ఏదో ఒక సమయంలో వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తే దాని గురించి అతిగా ఆలోచించకూడదు. ఎప్పుడో ఒకసారి జరిగే ఉల్లంఘన వెంటనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలేమీ చూపదు. ♦ ఎప్పుడైనా రుచికరమైన ఆహారాన్ని జిహ్వను సంతృప్తి పరచడానికి తినడం వల్ల వెంటనే ఆరోగ్యమేమీ దెబ్బతినదు. దాని గురించి అతిగా ఆలోచించకుండా వెంటనే ఆ విషయాన్ని మరచిపోవాలి. చేసిన పొరబాటు కంటే పొరబాటును మాటిమాటికీ తలచుకోవడమే ఎక్కువ కీడు చేస్తుంది. ♦ అపరాధ భావనతో కుంగిపోతూ ఒంటరిగా ఉండకూడదు. అందరితో కలిసి ఆనందంగా ఉండాలి. చికిత్సలు... ♦ ఆహార రుగ్మతలకు చికిత్స దీర్ఘకాలం పాటు బహుముఖంగా జరగాల్సి ఉంటుంది. ఇందులో మానసిక చికిత్స, సైకలాజికల్ కౌన్సెలింగ్, కొన్ని రకాల మందులు, న్యూట్రిషన్ లోపాలు కలుగుతాయి కాబట్టి వాటిని భర్తీ చేసే విధంగా పోషకాహారాలు... ఇలా అనేక అంశాలతో ఈ చికిత్స జరగాల్సి ఉంటుంది. ఈ ఆహారరుగ్మతలకు చికిత్స నిర్దిష్టంగా ఉండక, సమస్యను బట్టి ఉంటుంది. ♦ కొన్ని సందర్భాల్లో మానసిక, వ్యక్తుల మధ్య బాంధవ్యసంబంధాల (ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్), సాంస్కృతిక అంశాల ఆధారంగా కూడా ఆహారరుగ్మతలు రావచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాటిని పరిగణనలోకి తీసుకుని చికిత్స-ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ♦ ఆహారం అన్నది మనకు ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతిని కలిగించడానికి అని గుర్తించి దాన్ని ఆస్వాదిస్తూ భుజించాలి. అంతే తప్ప కేవలం క్రమబద్ధమైన జీవితంలోని ఒక అనివార్య అంశంగా మాత్రమే భావించకూడదు. ♦ ఆహారరుగ్మతల విషయంలో సమస్యలు ఎదురైతే సరైన అర్హతలు ఉన్న సైకియాట్రిస్ట్, ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, మెడికల్ డాక్టర్, కొన్ని సందర్భాల్లో సామాజికవేత్తల వంటి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అంతేగాని చెప్పుడు మాటలు వినడం, తగిన విద్యార్హతలు లేని వారి సలహాలతో జీవితాన్ని మరింత దుర్భరం చేసుకోకూడదు. - నిర్వహణ: యాసీన్