లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
మరీ సన్నగా ఉన్నాను...!
నా వయసు 20 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. చాలామంది నన్ను ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. బరువు కేవలం 47 కేజీలు మాత్రమే. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. - ఎన్. సుధీర్, ఈ-మెయిల్
కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... జన్యుపరమైనవి సరిగా తినకపోవడం చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం అతి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ైెహ పర్ థైరాయిడిజమ్) మీరు తీసుకునే ఆహరంలో పోషకాల పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు.
మీకు కొన్ని సూచనలు : మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో మరో మూడుసార్లు తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు. మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి. ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి. వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి. అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానికి ఉపయోగపడతాయంటూ న్యూస్‌పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు.
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సిందేనా?
నా వయసు 42 ఏళ్లు. ప్రస్తుతం నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వ్యాధి స్టేజ్-5లో ఉంది. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాలని డాక్టర్లు అంటున్నారు. కచ్చితంగా వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించాలా? ఒకసారి చేయించుకుంటే సరిపోదా? - దశరథ్, కరీంనగర్
మీరు సీకేడీ స్టేజ్-5 లో ఉన్నారని వివరించిన దాన్ని బట్టి మీ కిడ్నీ పనితీరు కేవలం 15% మాత్రమే ఉంటుంది. ఈ విలువను బట్టి చూస్తే కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు పరిగణిస్తారు. మీరు వారానికి ఒకసారి మాత్రమే డయాలసిస్ చేయించుకుంటే, మీలోని వ్యర్థాల దుష్ర్పభావం మీ శరీరంలోని ఇతర అవయవాల మీద పడుతుంది. పైగా గుండెపనితీరు సక్రమంగా ఉండాలంటే మీరు డాక్టర్లు పేర్కొన్న మేరకు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డయాలసిస్ క్రమం తప్పితే, మీ జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గుతుంది. కాబట్టి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవడం మంచిది. అవసరం కూడా.
నా వయసు 68 ఏళ్లు. నేను ఆరేళ్ల నుంచి బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాను. నెల క్రితం నుంచి ముఖం, కాళ్లలో వాపు కనిపిస్తోంది. ఆకలి లేమి, నడిస్తే ఆయాసంతో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మీద క్రియాటినిన్, బ్లడ్‌యూరియా, 2డీ ఎకో పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ 6.2 ఎంజీ/డీల్, యూరియా 182 ఎంఎల్, గుండె పనితీరు 68.2 శాతం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇకపై డయాలసిస్ చేయించుకొమ్మని డాక్టర్లు సలహా ఇచ్చారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని కూడా సూచించారు. ఈ పరిస్థితుల్లో నాకు తగిన సలహా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. - వెంకటేశ్వర్లు, కోదాడ
గుండెపనితీరు తక్కువగా ఉన్నవారిలో కాళ్లవాపు, ఆయాసం ఎక్కువగా కనిపించడం సాధారణమే. మీరు పేర్కొన్న రక్తపరీక్షల వివరాలను బట్టి చూస్తే మీ డాక్టర్ గారు చెప్పింది వాస్తవమే. మీరు డయాలసిస్ చేయించుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. డయాలసిస్ చేయించుకోవడం వల్ల మీ గుండె పనితీరు, సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. మీకు సమీపంలోని నెఫ్రాలజిస్ట్‌ను కలిసి ఇంట్లోనే చేయించుకోగల డయాలసిస్ వివరాలను తెలుసుకోండి.
యూరాలజీ కౌన్సెలింగ్
ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు సర్జరీ తప్పదా?
నా వయసు 58 ఏళ్లు. నేను రెండేళ్లుగా ప్రోస్టేట్ గ్రంథి పెరగడం (ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌తో) బాధపడుతున్నాను. చాలాకాలంగా మందులు వాడుతున్నా ప్రయోజనం లేదు. డాక్టర్ శస్త్రచికిత్స చేయించుకొమ్మంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడం తప్పదా?
- శ్రీనివాసరావు, రాజంపేట
మనదేశంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు 50 ఏళ్లు పైబడిన వారిలో 50 శాతం మందిలో, 70 ఏళ్లు పైబడిన వారిలో 80 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ గ్రంథి వాపు వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ధార సన్నగా, బలహీనంగా రావడం, రాత్రుళ్లు తరచూ మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం, ఒక్కోసారి మూత్రంలో రక్తం పడటం, మూత్రం బ్లాడర్‌లో మిగిలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలతో పాటు, మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తున్నా మూత్రవిసర్జన చేయలేకపోవడం, చలిజ్వరం, మూత్రంలో రక్తం, పొత్తికడుపులో లేదా మూత్రమార్గంలో నొప్పితో పురుషులు తప్పక వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఈ వ్యాధి బయటపడుతుంది. దీనికి సరైన చికిత్స చేయించకపోతే తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) రావడం, మూత్రాశయం (బ్లాడర్)లో రాళ్లు, కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్‌కు దారితీయడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. కేవలం చాలా త్వరగా బయటపడ్డ (అర్లీ) ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు మాత్రమే మందులతో చికిత్స చేయవచ్చు. అయితే ఇక మందులతో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు. వాపు వచ్చిన ప్రోస్టేట్ భాగాన్ని తొలగించేందుకు డాక్టర్లు ‘ట్రాన్స్‌యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’ (టీయూఆర్‌పీ) లేదా లేజర్‌తో చేసే ప్రోస్టేట్ సర్జరీ (హోలెప్) వంటి ప్రక్రియలను అనుసరిస్తారు.
ఈ శస్త్రచికిత్సల్లో సాధారణమైన మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా ఆ ప్రాంతానికే పరిమితమయ్యేలా పాక్షికమైన మత్తు (రీజియనల్ మత్తు) ఇవ్వాల్సి వస్తుంది. రోగి రెండు లేదా మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే చాలు. టీయూఆర్‌పీ అనేది చాలా సురక్షితమైనదని నిరూపితమైన (గోల్డెన్ స్టాండర్డ్) ప్రక్రియ. ఇక లేజర్ శస్త్రచికిత్సలో రక్తస్రావం అయ్యే అవకాశాలు టీయూఆర్‌పీ కంటే తక్కువ. మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి సురక్షితంగా చేయగలిగిన ఈ సాధారణ శస్త్రచికిత్సను చేయించుకోవడం అవసరం.
మరీ సన్నగా ఉన్నాను...!
Published Sun, Aug 30 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement