Type of Eating Disorders, Symptoms, Signs, Causes, in Telugu - Sakshi
Sakshi News home page

అతిగా తింటే అంతే సంగతి..

Published Tue, Mar 9 2021 8:42 AM | Last Updated on Tue, Mar 9 2021 9:00 AM

Eating Disorders: Symptoms And Types - Sakshi

టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువగా ఈటింగ్‌ డిజార్డర్స్‌ కనిపిస్తాయి. కొందరు పిల్లలు అతిగా తినడం, కొందరేమో అసలేమీ తినకుండా ఎండుకుపోతుంటారు. టీనేజ్‌లో అడుగుపెట్టే సరికి అందం, శరీర ఆకృతిపై శ్రద్ధ పెరగడం సహజమే! కానీ ఇందుకోసం అతిగా తినడం లేదా పూర్తిగా మానుకోవడం పలు రకాల శారీరక ఇక్కట్లను తీసుకువస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఈటింగ్‌ డిజార్డర్‌ ఉందని గుర్తించడానికి కొన్ని లక్షణాలుంటాయి.

ఉన్నట్టుండి బరువు పెరగడంలేదా తగ్గడం, తమ శరీర ఆకృతి, బరువుపై ఎక్కువగా దృష్టిపెట్టడం, ఎక్కువ సార్లు అద్దంలో చూసుకోవడం, కొద్దిగా ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా తినడం మానేయడం, ఒంటరిగా కూర్చోని తినడానికి ఇష్టపడడం, ఆహారం తీసుకునేటప్పుడు సాధారణం కంటే అతిగా నమలడం, అతిగా వ్యాయామం చేయడం, భోజనం తరువాత విరేచనం సాఫీగా అయ్యే మాత్రలు తీసుకోవడం, బరువు పెరగకుండా ఉండేందుకు తిన్న తర్వాత వాంతి చేసుకోవడానికి ప్రయత్నించడం, వారికి వారే అతిగా డైటింగ్‌ చేయడం. ఇందులో భాగంగా పంచదార, కార్బొహైడ్రేట్స్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం, ఎక్కువగా మూడ్‌ స్వింగ్స్‌ కలిగి ఉండడం, శరీరంలో శక్తిలేక త్వరగా అలిసిపోవడం, ఎప్పుడూ డిమ్‌గా లేదా డల్‌గా ఉండడంవంటివి కనిపిస్తే ఈటింగ్‌ డిజార్డర్‌గా అనుమానించవచ్చు.

ఈ లక్షణాల వల్ల క్రమంగా కడుపులో మంట, అజీర్తి, కడపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు,పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి. బలవంతంగా వాంతులను ప్రేరేపించడం ద్వారా వేళ్ల జాయింట్‌ కీళ్లపై క్యాలస్‌ ఏర్పడుతుంది. తరచూ వాంతులు చేసుకోవడం వల్ల దంతాల రంగు మారిపోతుంది, స్త్రీలలో ఈటింగ్‌ డిజార్డర్‌ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్‌ కూడా సక్రమంగా రావు. 

ఈ అసహజతలకు కారణాలు..
మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపోవడం
బలవంతంగా ఆహరపు అలవాట్లు మార్చుకోవడం
హార్మోన్ల అసమతుల్యత
వంశపారంపర్యత, జన్యువులలో అసంబద్ద ఉత్పరివర్తనాలు,
గతంలో ఎదురైన దుర్ఘటనలు
సమాజంలో కలవలేక పోవడం
ఉద్యోగరిత్యా ఎదురయ్యే ఒత్తిడి వలన ఈటింగ్‌ డిజార్డర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.  భౌతికంగా లక్షణాలు కనిపించకపోతే రక్తపరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ద్వారా ఈ సమస్యను కొంతవరకు నిరోధించవచ్చు.

సాధారణంగా కనిపించే ఈటింగ్‌ డిజార్డర్స్‌ మూడు రకాలు. అవి..
అనోరెక్సియా నెర్వోసా..
ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. కేలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు.

బులిమియా నెర్వోసా..
ఇది ప్రాణానికి హానీ కలిగించే రుగ్మత అనిచెప్పవచ్చు. ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్‌ ఏర్పడుతుంది.

బింగే ఈటింగ్‌ డిజార్డర్‌..
ఈ రుగ్మత కలిగిన వారు అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తమ ఆహారపు అలవాట్లు గురించి సిగ్గుపడుతుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement