అర్జున్ (21) ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉండటంతోపాటు తీవ్ర నిరాశ, ఆందోళనకు లోనవుతున్నాడు. ఇంట్లో ఎవరైనా తనతో మాట్లాడితే వారిని విసుక్కోవడం, కసిరికొట్టడం చేస్తున్నాడు. ఎక్కువ సమయం ఏదొక ఓటీటీలో వెబ్ సిరీస్, సినిమాలు చూస్తూ ఉండిపోతున్నాడు. దీంతో అర్జున్‌ను అతడి తండ్రి విజయవాడలోని మానసిక వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాడు. వైద్యుడు లక్షణాలన్నీ అడిగి తెలుసుకుని రెండు, మూడు సిట్టింగ్‌ల అనంతరం అర్జున్.. ‘బింజ్ వాచింగ్ అడిక్షన్’తో బాధపడుతున్నట్టు తెలిపారు.
‘చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను.. తొందరపాటు ఎక్కువగా ఉంటోంది.. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది’.. అంటూ రమ్య అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మానసిక వైద్యుడిని సంప్రదించింది. ‘నేను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య ఉన్నవారికి ఇచ్చే మిథైల్ఫేనిడేట్ మందును నాకు ఇవ్వండి’ అని డాక్టర్‌ను అడిగింది. తన సమస్యతోపాటు ఏ మందు ఇవ్వాలో కూడా చెప్పేస్తుండటంతో సందేహం వచ్చిన మానసిక వైద్యుడు కొంత లోతుగా ఆమెను పరిశీలించారు. ఈ క్రమంలో రమ్య.. ఏడీహెచ్‌డీ కంటెంట్‌తో వచ్చిన ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావంలో పడ్డట్టు వైద్యుడు గుర్తించారు.
ఇలా అర్జున్, రమ్య తరహాలోనే ప్రస్తుతం కొందరు పిల్లలు, యువత, పెద్దలు.. బింజ్ వాచింగ్‌కు బానిసలై బాధపడుతున్నారు. ప్రస్తుత స్ట్రీమింగ్ యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క క్లిక్‌తో ఓటీటీ వేదికగా వివిధ భాషా చిత్రాలను, వెబ్ సిరీస్‌లను చూసే అవకాశం ఉంది. దీనికి తోడు చౌకగా అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుండటంతో కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో అతిగా సినిమాలు, వెబ్‌సిరీస్, షోలు చూసే బింజ్ వాచింగ్ అనేది ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇలా పగలు, రాత్రి తేడా లేకుండా ఓటీటీలకు అతుక్కుపోవడం మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
– సాక్షి, అమరావతి
భారతీయులు రోజుకు నాలుగు గంటలకు పైనే బింజ్ వాచింగ్‌కు కేటాయిస్తున్నట్టు జనవరిలో అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తమ వినియోగదారుల్లో 61 శాతం మంది ఒకే సిట్టింగ్‌లో షో, వెబ్ సిరీస్‌లోని ఆరు ఎపిసోడ్‌లను క్రమం తప్పకుండా చూస్తున్నారని గతేడాది మరో దిగ్గజ ఓటీటీ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇలా ఓటీటీల్లో దేన్నైనా చూడటం ప్రారంభిస్తే ఆపకుండా వరుసగా ఒక సినిమా నుంచి మరో సినిమా, ఒక వెబ్ సిరీస్ నుంచి మరో వెబ్ సిరీస్ చూసేస్తున్నారు. ఇది క్రమంగా అడిక్టివ్ బిహేవియర్ (వ్యసనం)గా మారుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు యాక్షన్ సీన్‌లు ఎక్కువగా ఉండే కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో వారు హింస వైపు ప్రేరేపితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బింజ్ ఈటింగ్ కూడా..
సాధారణంగా ఏదైనా సినిమా, షో చూసేటప్పుడు చిరుతిళ్లు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ క్రమంలో బింజ్ వాచింగ్ చేసేవారు బింజ్ ఈటింగ్ (ఎంత తింటున్నారో తెలియకుండా) చేసి ఊబకాయం బారినపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చిప్స్, లేస్, కుర్ కురే వంటి ప్యాక్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడంతో ఊబకాయంతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
బింజ్ వాచింగ్‌తో సమస్యలు..
► ఒంటరిగా ఉండటం పెరుగుతుంది. అతిగా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తూ లౌకిక ప్రపంచం నుంచి దూరమవుతారు.. ఇతరులతో సంబంధాలు ఉండవు. ఫలితంగా కుటుంబం, స్నేహితుల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది.
► వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూసే క్రమంలో ఒకేసారి వాటిని పూర్తి చేయాలని అర్ధరాత్రి దాటిపోయినా నిద్రపోవడం లేదు. దీంతో నిద్రలేమి, చిరాకు, విసుగు వంటివి తలెత్తుతున్నాయి.
► మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన పెరుగుతున్నాయి. అతిగా స్క్రీన్‌ను చూడటం వల్ల కంటి చూపు సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి.
► కొందరైతే వెబ్ సిరీసుల్లో లీనమైపోయి అందులో జరిగినట్టు తమ జీవితంలోనూ మార్పులు రావాలని ఊహించుకుంటూ సమస్యల బారినపడుతున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి..
వేసవి సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వేసవిలో పిల్లల భవిష్యత్‌కు దోహదపడేలా ఏదైన ఒక ఔట్‌డోర్ గేమ్, ఏదైనా భాషలో వారికి శిక్షణ ఇప్పించాలి. ప్రస్తుతం బింజ్ వాచింగ్ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉంటోంది. గతేడాది 20 మంది వరకు ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ సమస్యతో బాధపడుతూ మా వద్దకు వచ్చారు. ఏ అలవాటు మితిమీరినా ముప్పు తప్పదు.
– డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, మానసిక వైద్యుడు, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment