గెలిచిందా? ఓడిందా? | Arizona Mother Drowns Her Own Twin Boys: Why Do Parents Kill Their Children? | Sakshi
Sakshi News home page

గెలిచిందా? ఓడిందా?

Published Sun, Sep 6 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

గెలిచిందా? ఓడిందా?

గెలిచిందా? ఓడిందా?

నిజాలు దేవుడికెరుక
జూలై 26, 2006.
టెక్సస్ (అమెరికా) కోర్టు ముందు పోలీసు వాహనం వచ్చి ఆగింది. పోలీసులు దిగారు. వారి వెనుకే ఓ నలభై రెండేళ్ల మహిళ దిగింది. ఎంతో దిగులుగా ఉంది. ఆమెను చూస్తూనే అక్కడ ఉన్న మహిళలు, ఎన్జీవోల ప్రతినిధులు అర వడం మొదలుపెట్టారు. ‘‘ఆండ్రియా మనిషి కాదు రాక్షసి. ఆమెకు మరణశిక్ష విధించాలి.’’

ఆండ్రియా తల దించుకుంది. వడి వడిగా కోర్టు హాల్ వైపు నడిచింది. హాల్లో అడుగు పెడుతుంటే ఆండ్రియా కళ్లు... ద్వారం పక్కనే గ్రే కలర్ సూటులో నిల బడి ఉన్న ఓ వ్యక్తి మీద పడ్డాయి. అంత వరకూ దిగులు గూడు కట్టుకున్న ఆమె కళ్లలో చిన్న సంతోషపు తెర! ‘‘రస్టీ...’’ అంది ఆప్యాయంగా. కానీ అంతలోనే అతని పక్కనున్న మహిళను చూసి ఆగి పోయింది. ఆ మహిళ రస్టీ చేయి పట్టుకుని నిలబడింది. ఇద్దరి భుజాలూ రాసుకుంటు న్నాయి. వారి దగ్గరతనం చూడగానే ఆండ్రియా మనసు కలుక్కుమంది. కన్నీళ్లు వరదలా పొంగసాగాయి. వాటిని తుడుచు కుంటూ బోనులోకి వెళ్లి నిలబడింది.
 
ఆరోజే ఫైనల్ హియరింగ్. న్యాయమూర్తి తన తీర్పును చదువుతున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. కానీ అవేవీ రస్టీ చెవులను చేరడం లేదు. అతడు ఆండ్రియా వైపే చూస్తున్నాడు. ఆమెనలా చూస్తుంటే అతడి మనసు గతంలోకి పయ నిస్తోంది. మసకబారిన జ్ఞాపకాల జాడల్ని వెతుకుతోంది. వెతుకుతూ వెతుకుతూ 2001, జూన్ 20 దగ్గర ఆగిపోయింది.
 
జూన్ 20, 2001.
ఇల్లంతా సందడిగా ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ అలానే ఉంటుంది. ఒకరా ఇద్దరా... ఐదుగురు పిల్లలున్న ఇల్లు మరి!
‘‘మమ్మీ చూడు. పాల్ నా బుక్ చించేశాడు’’... బుంగమూతి పెట్టుకుని వచ్చాడు నోవా. ఆండ్రియా పిల్లాడి వైపు చూడలేదు. భర్త ఆఫీసుకు వెళ్లే టైమ్ అయిపోయింది. అతనికి లంచ్ ప్యాక్ చేసే పనిలో ఉందామె.
 
‘‘నోవా... ఎన్నిసార్లు చెప్పాను నాన్నా నీకు! నువ్వు అందరికంటే పెద్దవాడివి. తమ్ముళ్లని, చెల్లెల్ని నువ్వే ఆడించాలి. వాళ్లు అల్లరి చేసినా కోప్పడకూడదు. సరేనా?’’
 సరే అన్నట్టు తలూపి వెళ్లిపోయాడు ఏడేళ్ల నోవా.  
 ‘‘అరే వాహ్... పిల్లలకు డిసిప్లిన్ నేర్పడంలో నీ తర్వాతే ఎవరైనా. నువ్వు చాలా గొప్ప మదర్‌వి’’... ఎప్పుడు వచ్చాడో, ఆండ్రియాను వెనుక నుంచి వాటేసుకుంటూ అన్నాడు రస్టీ. భర్త ప్రశంసకు మురిసిపోయింది ఆండ్రియా. ‘‘ఓహో... మంచి తల్లినే గానీ మంచి భార్యను కాదా?’’ అంది అలక నటిస్తూ.
 
‘‘అంత మాటంటానా నిన్ను? నువ్వు మంచి భార్యవి, మంచి తల్లివి. అసలీ ప్రపంచంలోనే మంచి స్త్రీమూర్తివి. సరేనా’’ అంటూ ఆమెను మరింత హత్తుకున్నాడు.
 ‘‘దీనికేం తక్కువ లేదు. టైమయ్యింది బయలుదేరు’’ అంటూ అతని చేతుల్ని విడిపించుకుంది ఆండ్రియా. లంచ్ ప్యాక్ భర్త చేతుల్లో పెట్టింది. అతడి నుదుటి మీద ఎప్పటిలా చిన్న ముద్దు పెట్టబో యింది. కానీ పెట్టలేకపోయింది. ఉన్న ట్టుండి కళ్లు తిరిగినట్టయ్యాయి. తుళ్లి పడబోతే రస్టీ చప్పున పట్టుకున్నాడు. ‘‘ఏమైంది డియర్’’ అన్నాడు కంగారుగా.
 ‘‘ఏం లేదులే. కాస్త నీరసం’’ అంది.
 
‘‘డెలివరీ అయ్యి ఆరు నెలలయ్యింది. అప్పట్నుంచీ నీరసం అంటూనే ఉన్నాయి. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే వినవ్’’
 నవ్వేసింది ఆండ్రియా. ‘‘మళ్లీ మొదలు పెట్టావా? నాకేం కాలేదు నువ్వు బయల్దేరు’’ అంటూ అతణ్ని కారు దగ్గరకు లాక్కెళ్లింది. కానీ రస్టీకి ఆమెనలా వదిలి వెళ్లబుద్ధి కాలేదు. బలవంతంగా బయలు దేరాడు. అరగంటలో ఆఫీసు చేరు కున్నాడు. కానీ మనసంతా ఆండ్రియా మీదే ఉంది. ధ్యాసను మళ్లించుకోవడానికి ప్రయత్నించినా అతని వల్ల కాలేదు.

రెండు గంటల విఫలయత్నం తర్వాత ఇక ఇంటికి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నాడు. కానీ బయలుదేరేలోపే అతనికో ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి ‘‘హలో’’ అన్నాడు.
 ‘‘హలో మిస్టర్ రస్టీ యేట్స్. నేను ఇన్‌స్పెక్టర్ రిచర్డ్స్‌ని మాట్లాడుతున్నాను. ఓసారి వెంటనే మీ ఇంటికి రాగలరా?’’
 ‘‘నేను ఇంటికే బయల్దేరుతున్నాను. ఏమైంది ఇన్‌స్పెక్టర్... ఎనీ ప్రాబ్లెమ్?’’
 ‘‘ముందు మీరు రండి. తర్వాత మాట్లాడదాం.’’
 ఫోన్ కట్ అయ్యింది. రస్టీ గుండె ఝల్లుమంది. కొంపదీసి ఆండ్రియాకి ఏమీ కాలేదు కదా? ఆ ఆలోచన రాగానే ఒక్కక్షణం ఆగలేకపోయాడు. వెంటనే ఇంటికి బయలుదేరాడు.

ఇంటి ముందు గుమిగూడిన జనాన్ని చూడగానే గుండె దడదడలాడింది రస్టీకి. అందరినీ దాటుకుని ముందుకు వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి మతి పోయిందతనికి.
 తెల్లని బట్టలో చుట్టి ఉన్నాయి తన ఐదుగురు పిల్లల శరీరాలు. ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ ముఖాల్లో ఎలాంటి భావాలూ లేవు. ఎప్పుడూ చెంగు చెంగున గెంతే వారి శరీరాల్లో చలనమూ లేదు. ‘‘ఏమైంది? నా పిల్లలకేమైంది?’’ అంటూ వెళ్లి వాళ్ల దగ్గర కూలబడ్డాడు.

‘‘నోవా... జాన్.. ఏమైందిరా? పాల్... లూక్... ఏమైందిరా మీకు? మేరీ లేమ్మా. లే’’... పిచ్చివాడిలా అరుస్తున్నాడు. అది చూసి అందరి మనసులూ కదిలిపో యాయి. అందరి కళ్లూ తడిసిపోయాయి.
 వెక్కి వెక్కి ఏడుస్తున్న రస్టీ మదిలో ఓ ప్రశ్న. ఆండ్రియా ఏది? చుట్టూ చూశాడు. పోలీసుల మధ్య నిలబడి ఉంది. ఆమె చేతులకు బేడీలు. ఉలిక్కిపడ్డాడు. అంటే పిల్లల్ని ఆండ్రియానే?... ఆ ఆలోచనే భరించలేకపోయాడు. భార్య దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏంటి ఆండ్రియా? నీ చేతులకు బేడీలు ఎందుకు వేశారు?’’
 ఆండ్రియా మాట్లాడలేదు. ఎటో చూస్తోంది. ఆ చూపుల్లో ఏ భావమూ లేదు... శూన్యం తప్ప!
 ‘‘సారీ మిస్టర్ రస్టీ.

మీ భార్యే పిల్లల్ని హత్య చేసింది. పిల్లలందర్నీ బాత్ టబ్‌లో ముంచి చంపేశానని తనే మాకు ఫోన్ చేసి చెప్పింది. సో ఆమెను ఆరెస్ట్ చేస్తున్నాం.’’
 ఇన్‌స్పెక్టర్  మాటలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది రస్టీకి. ఆండ్రియాను తీసుకెళ్లిపోతున్నా, పిల్లల్ని అంబులెన్స్‌లోకి ఎక్కించుకుని వెళ్తున్నా అతడిలో చలనం లేదు. జరిగినదాన్ని నమ్మలేక, తనకిక ఎవ్వరూ లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక జీవచ్ఛవంలా అక్కడే నిలబడిపోయాడు.
 
మరుసటి రోజు... పోలీస్ స్టేషన్‌లో...
 ‘‘మీ మధ్య ఏవైనా గొడవలున్నాయా మిస్టర్ రస్టీ... మీ మీద కోపంతో తను...’’
 ఆ మాటే వినలేన ట్టు విలవిల్లాడాడు రస్టీ. ‘‘లేదు ఇన్‌స్పెక్టర్. తను ఓ మంచి భార్య. మంచి తల్లి. నా మీద కోపమూ లేదు. పిల్లల్ని చంపేంత కసాయితనమూ తనలో లేదు. ఆరు నెలల క్రితం పాపకి జన్మనిచ్చినప్పట్నుంచీ ఆండ్రియాలో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి రెస్ట్‌లెస్ అయ్యేది. ఒక్కోసారి ఊరికే కోప్పడేది.

విసుగు, చిరాకు అనేవి ఆమెకు తెలియదు. అలాంటిది డెలివరీ అయ్యాక అవి ఆమెలో తరచూ కనిపించేవి. డాక్టర్‌కి చూపిస్తే ప్రసవం తర్వాత అలాంటి మార్పులొస్తా యన్నారు. దాంతో తనే మామూలు అయిపోతుందిలే అనుకున్నాను. కానీ అంతలోనే ఇలా జరుగుతుందని...’’
 ‘‘అంటే మానసిక పరిస్థితి బాలేకే తను ఇలా చేసిందంటారా?’’... అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘అంతకు మించి వేరే కారణం ఉండే అవకాశమే లేదు’’... స్థిరంగా పలికింది రస్టీ గొంతు. ఆరోజే కాదు. కేసు నడిచిన ఐదేళ్లూ అతను అదే చెప్పాడు.  అందరూ ఆండ్రియాను కసాయి తల్లి అంటుంటే.... తను హత్య చేసేంత దుర్మా ర్గురాలు కాదన్నాడు.

ఆండ్రియాకు మరణ శిక్ష వేయమని అంతా డిమాండ్ చేస్తుంటే, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని తీర్పు ఇవ్వమంటూ కోర్టును అర్థించాడు. కింది కోర్టు ఆమెకి యావజ్జీవిత ఖైదును విధిస్తే, న్యాయం కాదంటూ పై కోర్టుకు అప్పీలు చేశాడు. చివరకు 2006లో పై కోర్టు... ‘ఆండ్రియా డెలివరీ తర్వాత ఏర్పడే పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అనే మాన సిక సమస్యతో బాధపడుతూ, ఆ స్థితిలో తెలియక చేసింది కాబట్టి శిక్ష వేయడం సరికాదు, తనని విడుదల చేస్తున్నాం, తనకి మానసిక వైద్యాలయంలో చికిత్స అందించాలని ఆదేశిస్తున్నాం’ అని తీర్పు ఇస్తే సంతోషించాడు. ఇంత చేశాడు కానీ తన పిల్లల్ని చంపిన ఆమెతో కలిసి మళ్లీ జీవి తాన్ని కొనసాగించేందుకు సిద్ధపడలేక పోయాడు. అందుకే కేసు నడుస్తుండగానే విడాకులు తీసుకున్నాడు. మరో పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నాడు.
 
మరి ఆండ్రియా పరిస్థితి ఏమిటి? సర్వస్వాన్నీ పోగొట్టుకుని ఆమె ఓడి పోయిందా? లేక అంత పెద్ద నేరం చేసినా శిక్ష నుంచి తప్పించుకుని గెలిచిందా? ఈ ప్రశ్న ఆండ్రియాను అడగాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ జవాబు చెప్పే స్థితిలో ఆమె లేదు. అప్పటికే ఉన్న మానసిక వ్యాధికి తోడు తన బిడ్డల్ని చంపు కున్నానన్న బాధ, ప్రాణంగా ప్రేమించే భర్తకు శాశ్వతంగా దూరమైపోయానన్న వ్యథ ఆమెను పూర్తిగా పిచ్చిదాన్ని చేసే శాయి. ప్రస్తుతం నార్త్ టెక్సస్ స్టేట్ హాస్పి టల్‌లో ఓ మానసిక రోగిలా పడివుంది.
 
అయితే ఆండ్రియాకు శిక్ష వేయక పోవడం అన్యాయం అంటూ ఇప్పటికీ కొందరు అంటున్నారు. ఆమె అసలు అమ్మేనా అని మండిపడుతూనే ఉన్నారు. మరి మనమేం అందాం? ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చినందుకు ఆండ్రియాను అమ్మ అని ఒప్పుకుందామా? లేక తన పిల్లల్ని పొట్టనబెట్టుకున్న కసాయి అని అందరిలానే తిడదామా? లేదంటే తెలిసీ తెలియని స్థితిలో చేసిన నేరానికి... కడుపు కోత రూపంలో జీవితకాలపు శిక్షను అను భవిస్తోన్న ఆమెను చూసి జాలిపడదామా? మీరే నిర్ణయించండి.
- సమీర నేలపూడి
 
ఇది చిన్న సమస్య కాదు!
ప్రసవ సమయంలో మహిళల్లో ఏర్పడే న్యూరో కెమికల్, హార్మోనల్ ఇంబాలెన్‌‌స కారణంగా  పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనే మాససిక రుగ్మత ఏర్పడుతుంది. దానివల్ల ఒత్తిడికి లోనవడం, చిన్నవాటికే ఏడవడం, కోప్పడటం వంటివి చేస్తుంటారు. ఈ స్థితిని ముందే గమనించి మందులు వేయడం, కౌన్సెలింగ్ ఇప్పించడం చేస్తే సమస్య ఉండదు. అలా చేయకుండా వదిలేసినప్పుడు ఇరవై నుంచి ముప్ఫై శాతం మందిలో అది తీవ్రమై ‘పోస్ట్‌పార్టమ్ సైకోసిస్’ అనే వ్యాధిగా పరిణమిస్తుంది. ఆ వ్యాధి వచ్చినవాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. కారణం లేని అభద్రతా భావం ఏర్పడుతుంది. మాటిమాటికీ మూడ్స్ మారిపోతుంటాయి. అప్పుడే నవ్వుతారు. అప్పుడే ఏడుస్తారు.

ఒక్కోసారి వాళ్లకేవో  స్వరాలు వినిపిస్తుంటాయి. ఎవరో ఏదో చేయమని చెప్పినట్టు ఫీలవుతారు. తమ పిల్లల్ని చంపేయబోతున్నారని భయపడతారు. అలాంటప్పుడు - ఎవరో చంపేలోపు తామే చంపేస్తే మంచిదని నిర్ణయించుకుంటారు. ఆండ్రియా విషయంలో అదే జరిగింది. మన దేశంలో కూడా వెయ్యిమందిలో ఒకరికి ఈ రుగ్మత వస్తోంది. పిల్లల్ని చంపేయడం, పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవడం చేసేది అందుకే. అలా అని అందరూ వయొలెంట్ అవ్వరు. అయితే ఇప్పటి వరకూ దీన్ని ఓ సీరియస్ సమస్యగా మన దేశంలో గుర్తించకపోవడం దురదృష్టం.
- డా॥కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్, హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement