కొట్టే మొగుడు | Special Story On Husband And Wife | Sakshi
Sakshi News home page

కొట్టే మొగుడు

Published Thu, Jan 9 2020 12:45 AM | Last Updated on Thu, Jan 9 2020 12:45 AM

 Special Story On Husband And Wife - Sakshi

కొందరు కొట్టే ‘చెడ్డ’ మొగుళ్లు ఉంటారు. అన్ని దుర్లక్షణాలుండి కొట్టే చెయ్యి కూడా ఉండేవాళ్లు వీరు. మరికొందరు కొట్టే ‘మంచి’ మొగుళ్లు ఉంటారు. అన్ని మంచి లక్షణాలు ఉండి కొట్టడం ఒక్కటే చెడు లక్షణంగా ఉండేవారు వీరు. వీరు కొడతారని మూడో కంటికి తెలియదు– ఒక్క భార్యకు తప్ప. ఈ కొట్టే మొగుళ్లను ఎలా మార్చడం? ఈ హింసకు వ్యతిరేకంగా ఎలా నిలబడటం?

విజయశేఖర్‌ లెక్చరర్‌. కాలేజీలో అతని క్లాస్‌ మిస్సయ్యే స్టూడెంట్‌ ఉండడు. క్లాస్‌ కిటకిటలాడాల్సిందే. అంత బాగా నవ్విస్తూ పాఠాలు చెబుతాడు. స్టూడెంట్స్‌ని ‘నాన్నా’ అని పిలుస్తాడు. ‘అది కాదు నాన్నా’ అని చాలా వాత్సల్యంగా వివరిస్తాడు. స్టాఫ్‌రూమ్‌లో అతనంటే అందరికీ గౌరవం. చిన్నా పెద్దా అందరినీ ‘గురువు గారూ’ అని సంబోధిస్తాడు. ఎప్పుడూ నీట్‌గా క్లీన్‌ షేవ్‌తో హుషారుగా ఉంటాడు. చురుగ్గా కదులుతాడు. బయటి విషయాల పట్ల కూడా చాలా అవగాహన ఉంటుంది. ‘సిఏఏ’, ‘ఎన్‌ఆర్‌సి’ లాంటి విషయాల గురించి వివరంగా మాట్లాడతాడు. పుస్తకాలు చదవడం అతని పని. అందరి చేత ‘ఎంత మంచివాడండి’ అని అనిపించుకోవడం అతనికి అలవాటైపోయింది. కాని అతనికి ఇంకో కోణం ఉంది. అది తెలిసిన భార్య ఆ విషయం గుర్తొస్తే ఒణికిపోతూ ఉంటుంది.విజయశేఖర్‌ పద్మను చూడటానికి వచ్చినప్పుడు ‘నాకు కట్నం అంటే అసహ్యం’ అని అన్నాడు. నిజంగా కట్నం తీసుకోలేదు. పెళ్లిలో పద్మ తరుఫువారి నుంచి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి.

తాను దగ్గరుండి సర్దుబాటు చేశాడు. హనీమూన్‌కు తనే ఢిల్లీ–ఆగ్రా ట్రిప్‌ ప్లాన్‌ చేసి సొంత ఖర్చులతో తీసుకెళ్లాడు. బంగారంలాగా చూసుకున్నాడు. హైదరాబాద్‌లో కాపురం పెట్టినప్పుడు ఫ్లాట్‌ బాగుండేలా జాగ్రత్త తీసుకున్నాడు. పని మనిషిని పెట్టాడు. పద్మ ఇవన్నీ చూసి చాలా సంతోషపడింది. ఎంత మంచి భర్త దొరికాడు అని అనుకుంది. రెండు మూడు నెలలు గడిచాయి. ఆ రోజు కాలేజీ నుంచి విజయ శేఖర్‌ వచ్చాడు. ఎప్పటి లాగే పద్మ కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది. ‘ఏమిటిలా ఉంది?’ అన్నాడు విజయశేఖర్‌. అలా అంటున్నప్పుడు అతని ముఖం కొత్తగా అనిపించింది. ‘ఏం.. బాగలేదా?’ సౌమ్యంగా అడిగింది. విజయశేఖర్‌ రెప్పపాటు కాలంలో లేచి నిలబడ్డాడు. ఏం జరుగుతుందో ఊహించే లోపలే లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. పద్మ దిమ్మెరపోయింది. బిక్కచచ్చిపోయింది. చాలా అనూహ్యమైనదేదో జరిగినట్టుగా కొయ్యబారిపోయింది. ఆమె తేరుకునేలోపలే పిడికిలి బిగించాడు. బలం కొద్దీ కొట్టాడు. ప్రాణాలు లుంగచుట్టుకుపోయాయి. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని అలా కొట్టొచ్చని నమ్మలేనంతగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు.

పద్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. జ్వరం వచ్చేసింది. ఆ రాత్రి అతడు తిరిగి ఇంటికొస్తే వొణికిపోయింది. కాని అతను చాలా మామూలుగా ఉన్నాడు. ‘సారీ’ చెప్పాడు. ‘జ్వరం వచ్చిందా?’ అని టాబ్లెట్‌ ఇచ్చాడు. ‘ఏం వండకులే’ అని బజారుకు వెళ్లి ఇడ్లీ తెచ్చిచ్చాడు. తినేదాకా ఊరుకోలేదు కూడా. ఇంతకు ముందు మనిషి ఈ మనిషి ఒకడే అంటే నమ్మడం కష్టం. ఆ రోజున పద్మకు అనిపించింది తన భర్తలో ఒక వేరే మనిషి ఉన్నాడని.. ఆ మనిషి తనకు శత్రువు అని. పద్మకు కొడుకు పుట్టాడు. వాడికి ఎనిమిదేళ్లు వచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో పద్మ చాలా సంతోషంగా ఉంది. చాలా భయభ్రాంతంగా కూడా ఉంది. విజయశేఖర్‌ ఆమెనూ కొడుకునూ చాలా బాగా చూసుకుంటాడు. వాళ్ల కోసం కానుకలు తెస్తాడు. షికార్లకు తిప్పుతాడు. కాని హటాత్తుగా ఒక రాత్రి ఆమె ‘అలా సిగరెట్లు తాగవద్దండి’ అన్నందుకు చావబాదుతాడు. ‘పూలు తెస్తే బాగుండేదండీ’ అంటే కొడతాడు. ‘పక్కింటి వాళ్లు పెళ్లికి పిలిచారు. వెళ్లాలా’ అని అడిగితే చెయ్యెత్తుతాడు.

అలా ఎందుకు జరుగుతుందో ఊహకు కూడా అందని విషయం. ఆమె మెల్లమెల్లగా అతడి లోపలి మనిషిని అన్వేషించడం మొదలెట్టింది. కొన్ని కారణాలు తెలిశాయి. వాటిని రిపేర్‌ చేయాలి. కాని తాను చెప్తే వింటాడా? ఒకరోజు భర్తతో భయపడుతూనే అడిగింది ‘బాబును ఒకసారి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళదామండీ. వాడికి చదువు మీద ఫోకస్‌ ఉండటం లేదు. అటెన్షన్‌ డైవర్షన్‌ ఉందేమో సందేహంగా ఉంది. ఇప్పుడు తీసుకెళ్లకపోతే ప్రమాదమేమో‘ అని. బాబు బిహేవియర్‌ అతను కూడా గమనించాడు కాబట్టి ‘నువ్వు తీసుకెళ్లు’ అన్నాడు. అదే పదివేలు అనుకొని బాబును తీసుకొని సైకియాట్రిస్ట్‌ దగ్గరకు వచ్చింది. బాబుది పెద్ద సమస్య కాదని సరి చేయవచ్చని సైకియాట్రిస్ట్‌ చెప్పాక తన సమస్య చెప్పుకుంది. ‘డాక్టర్‌ నన్ను కాపాడండి. అన్నీ ఉన్నా ఇంటి మధ్య అశుద్ధం పడి ఉన్నట్టు నాకు అన్నీ ఉన్నా నా భర్తలో ఉన్న ఈ చెడుగుణం వల్ల నరకం చూస్తున్నాను. ఆయనకు సంఘం పెద్ద బలహీనత.

సంఘం పట్ల చాలా మొహమాటం. సంఘం ఏమనుకుంటుందో అని భయం. అందరితో మంచిగా ఉండాలనుకుంటారు. వాళ్లను హర్ట్‌ చేయవద్దనుకుంటారుగానీ వాళ్లు హర్ట్‌ చేస్తే వారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపుతున్నారని నాకు అనిపిస్తోంది. మంచితనం కోసం డాంబికానికి పోయి చాలామందికి అప్పులిస్తారు. వాళ్లు తిరిగివ్వరు. ఈయన అడగరు. ‘మీ డబ్బులు ఎక్కడికీ పోవండీ’ అని చాలామంది ఎగ్గొట్టారు. అయినా మారడు. ఇస్తూనే ఉంటాడు. అదంతా ఏదోరోజు పేరబడి నన్ను కొడతాడు. ఆయన అందరితో బాగుండటానికి నాతో చెడుగా ఉంటున్నాడని నాకర్థమవుతోంది. ఏం చేయమంటారు? సైకియాట్రిస్ట్‌కు చూపించుకోండి అన్నా కొడతాడని మీతో చెబుతున్నాను. అతనికి నేరుగా కాకుండా ఇన్‌డైరెక్టుగా వైద్యం చేయండి’ అంది పద్మ కళ్లనీళ్లతో. ‘సరే.. బాబు గురించి మాట్లాడాలని పిలిచానని తీసుకురండి’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. వారం తర్వాత పద్మ, విజయశేఖర్‌ వచ్చారు.

సైకియాట్రిస్ట్‌ బాబు గురించి చాలా సేపు మాట్లాడాక ‘పద్మగారూ మీరు బయటికెళ్లండి. ఒక నిమిషం మీ భర్తతో మాట్లాడాలి’ అని ఆమెను బయటకు పంపించాడు. విజయశేఖర్‌ డాక్టర్‌ వైపు ఎందుకూ అన్నట్టు చూశాడు. ‘విజయశేఖర్‌గారూ.. మీకు గాంధీజీ గారి గురించి తెలుసా?’ అన్నాడు డాక్టర్‌. విజయశేఖర్‌ తలూపాడు. ‘ఆయన మన దేశానికి జాతిపిత. కాని ఆయనకు కూడా వ్యతిరేకులు ఉన్నారు. ఆయనను కూడా చెడ్డవారనుకున్నవారున్నారు. అలా అనుకొని కాల్చి చంపారు. నెహ్రూకు వంకలు పెట్టేవారు, మదర్‌ థెరిసాలో లోపాలు వెతికేవారు, అందరూ సూపర్‌స్టార్‌ అనుకునే హీరో పోస్టర్‌ మీద పేడ కొట్టేవారు.. ఇలా ప్రతిఒక్కరినీ ఒప్పుకోని వారు ఒకరో ఇద్దరో ఉంటారు. అంతెందుకు దేవుడు లేడని తిట్టే నాస్తికులు ఉంటారు. అంటే మీరెంత మంచిగా ఉన్నా మీరు నచ్చని వాళ్లు కొందరు ఉంటారు. నచ్చడం నచ్చకపోవడం ప్రతిఒక్కరి గురించి సమానంగా ఉంటుంది.

మీరెందుకు అందరినీ ఇంప్రెస్‌ చేయాలని చూస్తున్నారు? ఎదుటివారిలో మీకు నచ్చనివి మీరు నిశ్శబ్దంగా భరిస్తున్నారు. మంచితనంతో ఉండటం వేరు. చేతగాని తనంతో ఉండటం వేరు. మీ క్లాస్‌లో అల్లరి చేసే పిల్లాణ్ణి, మీ అప్పు ఎగ్గొట్టే కొలీగ్‌ని, మీ పై కామెంట్‌ చేసే దారినపోయేవాడిని వాడి భాషలో మీరు జవాబు చెప్పడం నేర్చుకోండి. లేదంటే మీరిప్పుడు మీ ఆవిడను బాక్సింగ్‌ బ్యాగ్‌లా ట్రీట్‌ చేయడం అలాగే కొనసాగుతుంది. చూడండి... మీ అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. వాడి ముందు మీరు మీ భార్యను కొడుకుతుంటే వాడి చిన్న మనసులో ఎంతటి భయంకరమైన ముద్ర పడుతుందో ఊహించారా? అసలైన మంచితనం ఏమిటంటే మన కుటుంబ సభ్యుల పట్ల మనం ప్రకటించేది. వాళ్లతో మొదట మంచిగా ఉండండి.

బయట మంచిగా ఉండేవాళ్లతో మాత్రమే మంచిగా ఉండండి. అదే మీరు తెలుసుకోవాల్సింది’ అన్నాడు. విజయశేఖర్‌కు అంతా అర్థమైంది. భార్య తన హింసను తట్టుకోలేకే పిల్లాడి మిషతో ఇక్కడకు తీసుకొచ్చినట్టు అర్థం చేసుకున్నాడు. ‘కొంచెం హెల్ప్‌ చేయండి డాక్టర్‌ మారుతాను’ అన్నాడు తల వొంచుకుని. విజయశేఖర్‌కు మరో రెండుమూడు సిట్టింగ్‌లు అయ్యాయి. విజయశేఖర్‌ ఇప్పుడు మంచి భర్త. మంచి తండ్రి. బయట మంచివాళ్లకు మంచివాడు. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కాలేజ్‌లో అతని ఇమేజ్‌ అలాగే కొనసాగుతోంది. కాకుంటే ‘సారుతో జాగ్రత్త’ అని కూడా అనుకుంటున్నారు. అది చాలు విజయశేఖర్‌కు.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement