డయాబెటాలజిస్టు పేరుతో వైద్యం చేసిన ప్రిస్క్రిప్షన్
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఫెలోషిప్ కోర్సులు పరిగణనలోకి రావు. అలాంటి డిగ్రీలు చెల్లవు. నిబంధనలనుఅతిక్రమిస్తే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకునే అధికారం ఆరోగ్య శాఖకు ఉంటుంది. కానీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆరోగ్యశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
అనంతపురం న్యూసిటీ: ప్రజల అనారోగ్య సమస్యలను కొందరు వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. తుమ్మినా.. దగ్గినా.. లేనిపోని పరీక్షలతో సగం చంపేస్తున్నారు. వచ్చిన రోగి ఆర్థిక స్థోమత తెలిసీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రోగం వచ్చినందుకు కాకుండా.. వైద్యం ఖర్చులకే జడవాల్సిన పరిస్థితి నెలకొంది. చదివిన చదువుతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స చేస్తున్న ఓ వైద్యురాలి బాగోతం వైద్య వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. డాక్టర్లను కనిపించే దేవుళ్లుగా పరిగణించే ప్రజలనే తమ దోపిడీకి పాలువుగా ఎంచుకోవడం విమర్శలకు తావిస్తోంది. నగరంలోని సాయినగర్ స్టేట్ బ్యాంకు ఎదురుగా డాక్టర్ సబిత డయాబెట్స్ సెంటర్ పేరిట క్లీనిక్ నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఆమె డయాబెటాలజిస్టు కాదు.. ఆమెనే కాదు, అసలు అలాంటి వైద్యులే లేకపోవడం గమనార్హం.
2004 నుంచీ మోసం
డాక్టర్ చిచిలి సబిత నగరంలో 2004 నుంచి డయాబెట్స్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ రికార్డుల్లో నమోదైంది. 1996లో మానసిక విభాగంలో ఆమె స్పెషలైజేషన్ చేశారు. 2008లో ఆస్ట్రేలియాకు చెందిన ద యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్‌లో డయాబెటిస్ కోర్సు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఫెలోషిప్‌లు, డిప్లమాలు పరిగణలోకి రావు. కానీ డాక్టర్ సబిత ఎండీ, డయాబెటాలజిస్టుగా ప్రిస్క్రిప్షన్‌లో చూపిస్తున్నారు. వాస్తవంగా ఎండీ సైకియార్టిస్ట్ అని రాయాల్సి ఉంది. సైకియాట్రీ విభాగంలోనే సేవలందించాల్సి ఉన్నా.. సదరువైద్యురాలు డయాబెటాలజిస్టు అంటూ క్లీనిక్‌లు నిర్వహించడం వైద్య వర్గాలకే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రజలను మోసగించడమే. ఇది తెలియని సామాన్య ప్రజానీకం ఆమెను చక్కెర వ్యాధి నిపుణులనుకుని రోజూ వేల సంఖ్యలో క్లీనిక్‌కు తరలి వస్తున్నారు.
అధికారులు ఏమిచేస్తున్నట్లు?
నగరం నడిబొడ్డున ఉండే సాయినగర్‌లో ఓ వైద్యురాలు గత 14 ఏళ్లుగా డయాబెటాలజిస్టు పేరుతో వైద్యం చేస్తున్నా ఆరోగ్యశాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా అధికారులు మేలుకోలేదు. స్పెషలైజేషన్‌ను మార్చి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నా అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం చూస్తే వీరి పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఫెలోషిప్స్‌కుఎంసీఐ అనుమతి లేదు
డయాబెటాలజిస్టుకు సంబంధించి ఎలాంటి స్పెషలైజేషన్లు లేవు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఫెలోషిప్‌లు పరిగణనలోకి రావు. ఎంసీఐ గుర్తింపు లేకుండా ఏ డిప్లమా, డిగ్రీ కానీ చెల్లదు. ఫెలోషిప్స్‌కు ఎంసీఐ అనుమతించదు. స్పెషలైజేషన్ చేసిన కోర్సులోనే వైద్యులు సేవలందించాలి. అలాకాకుండా ఇతరత్రా వైద్యం చేస్తే చర్యలు తప్పవు. డాక్టర్ సబితకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడతాం.
– డాక్టర్ కేవీఎన్‌ఎస్‌అనిల్‌కుమార్, డీఎంహెచ్‌ఓ
డయాబెటాలజిస్టుగాచెప్పుకోకూడదు
స్పెషలైజేషన్ ఒక విభాగంలో చేసి మరో విభాగానికి సంబంధించిన వైద్యం చేయడానికి ఐఎంఏ పూర్తి వ్యతిరేకం. ఇప్పటికే ఐఎంఏ తరఫున ఫిజీషియన్లకు ఒక నివేదిక ఇవ్వాలని కోరాం. వాస్తవంగా ఎండోక్రైనాలజిస్టులను చక్కెర వ్యాధి నిపుణులుగా పరిగణించాలి. వారి తర్వాత ఫిజీషియన్లు చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యం అందించవచ్చు. కానీ డయాబెటాలజిస్టుగా చెలామణి కాకూడదు.
– డాక్టర్ మనోరంజన్ రెడ్డి,ఐఎంఏ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment