డాక్టర్‌గావైద్యం చేస్తూ...
మోపురగుండు డాక్టర్ తిప్పేస్వామి...సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు....కష్టపడి చదువుకున్నాడు...వైద్య విద్య పూర్తి చేసి మంచి డాక్టర్‌గా పేరుగాంచాడు...తాతలు, తండ్రులెవరూ రాజకీయాల్లో లేకపోయినా...వైఎస్సార్ అండతో ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో తొలిసారి పలమనేరు నుంచి పోటీ చేశాడు. బంపర్ మెజార్టీతో గెలిచి ప్రజాసమస్యలపై తొలిసారి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. ఆ తర్వాత కూడా ప్రజాసేవలోనే కొనసాగుతున్నాడు. 2014లో తన సొంత నియోజకవర్గం మడకశిర నుంచి పోటీ చేసి ఓటమి చెందినా...కోర్టు తీర్పుతో తాజాగా బుధవారం మరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాడు.
అనంతపురం, మడకశిర: డాక్టర్ తిప్పేస్వామిది అమరాపురం మండలం ఉదుగూరు గ్రామం. పదోతరగతి వరకూ అమరాపురంలోనే చదువుకున్నాడు. ఇంటర్ అనంతపురంలో... ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అనంతరం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎండీ, డీజీఓ కోర్సులను పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పని చేశారు. తొలిసారిగా పాండిచ్చేరిలో వైద్య ఆరోగ్యశాఖలో పని చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా... ఆ తర్వాత పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో, వాయల్పాడు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇదే హాదాలో పని చేశారు. ఇలా వైద్య వృత్తిలో ఉంటూనే ప్రజా సేవ చేయాలన్న లక్ష్యం...వైఎస్సార్ ప్రోత్సాహంతో 1994లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1999లో పలమనేరు నుంచి రెండోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
♦ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోల సభ్యుడిగా కొనసాగారు.
♦ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగానే పలమనేరు నుంచే పోటీ చేసి కేవలం 737 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
♦ ఇక 2009లో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్పతేడాతో ఓడి పోయారు.
♦ డాక్టర్ తిప్పేస్వామి కాంగ్రెస్ పార్టీలోనూ పలు పదవులు దక్కించుకున్నారు. 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
♦ కర్నూలు, కడప జిల్లాలకు కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పని చేశారు.
♦ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, లీగల్ సెల్, లేబర్‌సెల్‌లో రాష్ట్ర స్థాయి పదవుల్లో కొనసాగుతూ క్రీయాశీలకంగా వ్యవహరించారు.
♦ తమిళనాడులోని రామనాథపురం జిల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌గా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు.
♦ విద్యార్థి, డాక్టర్ల సంఘాల్లో కూడా వివిధ పదవుల్లో కొసాగారు. ఇలా ఆయన రాజకీయాల్లో రాణించి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా వైఎస్సార్ ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకున్నారు.
♦ వైఎస్ కుటుంబానికి విధేయుడైన డాక్టర్ తిప్పేస్వామి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడ్డారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పలమనేరులో పోటీ చేయడానికి తిప్పేస్వామికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఆయన స్వస్థమైన మడకశిర ఎస్సీలకు రిజర్వు అయ్యింది. దీంతో ఆయన 2014లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండతో మడకశిర నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
న్యాయ పోరాటంతో విజయం
మడకశిర అసెంబ్లీ నుంచి 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ తిప్పేస్వామి, టీడీపీ అభ్యర్థిగా ఈరన్న పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఈరన్న తన నేర చరిత్రను నామినేషన్ వేసే సందర్భంగా అఫిడవిట్‌లో పేర్కొన లేదు. ఈ విషయాన్ని ఆ రోజే డాక్టర్ తిప్పేస్వామి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన 2014 జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. గత నవంబర్ 27న హైకోర్టు ఈరన్న ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేగా డాక్టర్ తిప్పేస్వామిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా డాక్టర్ తిప్పేస్వామినే ఎమ్మెల్యేగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు డాక్టర్ తిప్పేస్వామి చేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు.
సాగునీటికోసం రాజీలేని పోరాటం
మడకశిర: సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ...హంద్రీనీవా నీటిని పొలాల్లో పారించేందుకు ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని మడకశిర ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం ఆయన అమరావతిలో స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం తగ్గడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పదవీ సమయం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతానన్నారు. టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా మడకశిరకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే తాను సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానన్నారు. అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైఎస్సార్ సీపీకి మంచి పేరు తెస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు మడకశిర నుంచే నాంది పలుకుతామన్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పు క్రిమినల్ కేసులున్న టీడీపీ ప్రజాప్రతినిధులకు చెంపపెట్టు లాంటిదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీలో క్రిమినల్స్ లేరని పదేపదే చెబుతుంటారని, ఈ సంఘటనతో క్రిమినల్స్ ఏ పార్టీలో ఉన్నారో బయటపడిందన్నారు. 2014 ఎన్నికల నామినేషన్ రోజే ఈరన్నపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను రిటర్నింగ్ అధికారికి అందించినా పట్టించుకోలేదన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. చివరకు సుప్రీంకోర్టు కూడా తనకే మద్దతు తెలిపిందన్నారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మడకశిరలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఇక నుంచి రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు.
నాకున్న సమయం చాలా తక్కువే. అయినా ప్రజాసమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా. ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తా. ఈ విజయం 2019 ఎన్నికలకు నాంది. రానున్న ఎన్నికల్లోనూ మడకశిరలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయం– డాక్టర్ తిప్పేస్వామి,మడకశిర ఎమ్మెల్యే
నేడు మడకశిరకు ఎమ్మెల్యే తిప్పేస్వామి
మడకశిర: అమరావతిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి గురువారం మడకశిరకు రానున్న డాక్టర్ తిప్పేస్వామికి ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉదయం 9 గంటలకు మడకశిరకు చేరుకోనుండగా...పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరానున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ రామకృష్ణ, మండల కన్వీనర్ రామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సర్కిల్‌లో సభ కూడా ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment