భర్త కావాలి | Psychiatrist Help To Wife And Husband | Sakshi
Sakshi News home page

భర్త కావాలి

Published Thu, Jan 30 2020 12:23 AM | Last Updated on Thu, Jan 30 2020 12:23 AM

Psychiatrist Help To Wife And Husband - Sakshi

ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది తోడు కోసం. అర్థం చేసుకునే ఆత్మీయుడి కోసం. సౌకర్యంగా ఉంచే సహచరుడి కోసం. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది మంచి భర్త కోసం. అయితే ఆమె ఊహించుకున్న భర్త, నిజజీవితంలో ఉన్న భర్త వేరువేరు అయితే? ఆమె కోరుకునే భర్త ఎవరు?

అమెరికా సంబంధం బాగుంటుంది. అవును. బాగుంటుంది. పెళ్లయ్యాక అమ్మాయి అక్కడ హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్లి ఎంజాయ్‌ చేసి రావొచ్చు. అవును. చేసి రావొచ్చు. కాని కష్టం వస్తే? వెంటనే వెళ్లి ఓదార్చి రావడం కుదురుతుందా? కుదరదు. ఆమె కాపురంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం వీలవుతుందా? వీలవదు. మనం ఇక్కడ. అమ్మాయి అక్కడ. ఏం చేయాలి? అవును. ఏం చేయాలి? ‘ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది’ అనుకుంది సంయుక్త తల్లి. ‘అసలు ఈ నిర్ణయం తీసుకోవాలని ఎలా అనిపించింది’ అని కంగారు పడిపోయాడు సంయుక్త తండ్రి. పెళ్లయ్యి సరిగ్గా నెల. నెల రోజులకే ఈ పెళ్లి వద్దని, ఇండియాకు వచ్చేయాలనుకుంటున్నానని సంయుక్త ఆ తల్లిదండ్రుల నెత్తి మీద పిడుగు వేసింది.

‘ఎందుకు?’ అని అడిగారు ఇద్దరూ ‘నాకు అతను నచ్చడం లేదు’ అని చెప్పింది సంయుక్త. ‘భర్తకు భార్య, భార్యకు భర్త ఒకపూటలో అరపూటలో నచ్చేయరు. మెల్లగా కాపురం గడిచేకొద్దీ ఒకరికొకరు అర్థమవుతారు. ప్రేమ పెరుగుతుంది. జీవితం బాగుంటుంది’ అని చెప్పారు ఇద్దరు. ‘రోజులు గడిచేకొద్దీ నాకు అతని మీద విరక్తి పెరుగుతోంది తప్ప ప్రేమ కలగడం లేదు’ అని చెప్పింది సంయుక్త. ‘అయితే ఏమంటావ్‌?’ అని అడిగారు వాళ్లు. ‘ఏమంటాను.. విడాకులు తీసుకుంటాను అంటాను’ అంది సంయుక్త. సంయుక్త తల్లిదండ్రులు హైదరాబాద్‌లో మంచిస్థితిలో ఉన్నారు. తండ్రికి వ్యాపారాలు ఉన్నాయి. సంయుక్త ఒక్కతే కూతురు. బాగా చదివించారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని వారనుకున్నా సంయుక్త పట్టుబట్టి ఉద్యోగం చేస్తానంటే బెంగళూరులో చేయనిచ్చారు. ఆ వెంటనే మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఒకే కులం. ఒకే ప్రాంతం. ఒకే ఆర్థిక నేపథ్యం. ‘బాగున్నాడు చేసుకో.

ఇప్పుడు కాకపోతే మళ్లీ ముహూర్తాలు దొరికేలా లేవు’ అన్నారు తల్లిదండ్రులు. అతను అమెరికా నుంచి వచ్చాడు. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య వారం రోజులే ఎడం దొరికింది. తొందర తొందరగానే అన్నీ ముగించాల్సి వచ్చింది. అమెరికా పెళ్లికొడుకుల పెళ్లి ‘సెలవుచీటి’ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పెళ్లికొడుకు అంతే హడావిడి చేసి సంయుక్తను తీసుకొని ఫ్లయిట్‌ ఎక్కాడు. ‘అమ్మయ్య’ అనుకున్నారు తల్లిదండ్రులు. ‘అంతా బాగానే చేశాం కదా ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తోంది’ అని బాధ పడుతున్నారు ఇప్పుడు. అంతా విన్న సైకియాట్రిస్ట్‌ మొదట సంయుక్త భర్తతో మాట్లాడతానని అతనికి స్కైప్‌ ద్వారా కాల్‌ చేసి మాట్లాడాడు. ‘సంయుక్త మంచిదే డాక్టర్‌. కాని ఎందుకో ఇన్‌కన్వినియన్స్‌ ఫీల్‌ అవుతోంది. నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడటం లేదు. నేను కూడా తనతో హార్ష్‌గా బిహేవ్‌ చేసింది లేదు. పెద్ద కొట్లాటలు కూడా లేవు. ఆమె మనసులో ఏముందో అర్థం కావడం లేదు. అలాగని సస్పీషియస్‌గా కూడా లేదు.

నాకు ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియడంలేదు. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రోజు వరకూ రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు ప్రత్యేకంగా మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడని అంశాలేమీ కనిపించలేదు. అయితే చనువు, దగ్గరితనం ఏర్పడ్డాకే తను ఫస్ట్‌నైట్‌ అంది. అందువల్ల ఇండియాలో మా ఫస్ట్‌నైట్‌ జరగలేదు. పెద్దవాళ్లకు జరిగిందని చెప్పాం. ఇక్కడికి వచ్చాక కూడా జరగలేదు. నెల రోజులుగా నేను దూరంగానే ఉంటున్నాను’ అన్నాడతను. అతని స్టేట్‌మెంట్‌ హానెస్ట్‌గా అనిపించింది సైకియాట్రిస్ట్‌కి. ఇప్పుడు సంయుక్తతో మాట్లాడాలని అనుకున్నాడు. రెండు మూడు స్కైప్‌ కాల్స్‌ మాట్లాడాక ఓపెన్‌ అయ్యింది సంయుక్త. ‘డాక్టర్‌... ఏం చెప్పను. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను బొమ్మలాగున్నావ్‌ బొమ్మలాగున్నావ్‌ అని అనేవారు. నాన్న అమ్మ కూడా బొమ్మలాగే పెంచారు. చక్కగా ఉన్న అమ్మాయి బయటకు వెళితే ఎవరో తన్నుకుపోతారన్నట్టుగా ఉండేది వాళ్ల పెంపకం. ఏమీ మాట్లాడటానికి లేదు.

స్వేచ్ఛగా నచ్చింది చేయడానికి లేదు. చాలా ప్రొటెక్టివ్‌గా పెంచారు. నా బాడీలో ఒక సెన్సర్‌ పెట్టకపోవడం ఒక్కటే తక్కువ. నాకు ‘నో’ చెప్పడానికి కూడా మొహమాటం చెప్పేంత గారాబంలో ఉంచేశారు. ఇలా కాదని పట్టుబడి బెంగళూరుకి ఉద్యోగానికి వెళ్లాను. అదేదో సినిమాలో పెళ్లికిముందు యూరప్‌ ట్రిప్‌కు హీరోయిన్‌ను పంపినట్టు ఎలాగూ మూడు నెలలో పెళ్లి చేసేస్తాం కదా అని మనసులో పెట్టుకొని నన్ను పంపించారు. కాని ఆ మూడునెలల్లో నాకు లోకం తెలిసింది. చాలామంది ఫ్రెండ్స్‌ అయ్యారు. హాయిగా తిరిగాను. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమా దోమా అనే మాటలు లేకుండా కూడా ఫ్రెండ్స్‌గా ఉండొచ్చని మాలాంటి వయసులో సరదాగా ఉండొచ్చని అనిపించేది. నాకు పరిచయమైన మా కలీగ్స్, అబ్బాయిలు చాలా బ్రాడ్‌ మైండెడ్‌గా ఉండేవారు. చాలా ఓపెన్‌గా ఉండేవారు. సినిమా హీరోల అట్రాక్షన్‌ ఒకటి. నా కాబోయే భర్త హీరోలా ఉండి సరదాగా లిబరల్‌గా ఉండాలనుకున్నాను.

ఆ కల ఇంకా కళ్లలోనే ఉండగానే హడావిడిగా పెళ్లి చేసేశారు. ఇతను చూడటానికి బాగున్నా, మంచివాడే అయినా అచ్చు మా నాన్నలాగే ఉండటం మొదలెట్టాడు. ఇది అమెరికా.. ఇక్కడ నువ్వు అలా చేయుద్దు ఇలా చేయుద్దు... ఎక్కడికీ వెళ్లొద్దు... వీళ్లతో మాట్లాడు.. వాళ్లతో వద్దు.. ఇలాంటి బట్టలు కట్టుకో... అసలు ఇరవైనాలుగ్గంటలు ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉండే మొగుడు చాటు భార్యగా ఉండాలని ఇతను కోరుకుంటున్నాడు. ఒక నాన్నతో వేగి వస్తే ఇంకో నాన్నగా ఇతను మారాడు. నాకు నచ్చడం లేదు. మా నాన్నకు ఆరోగ్యం పాడవుతుందని, అమ్మ ఏదో అయిపోతుందని మీరు చెప్పి నన్ను కాపురం చేయమంటే చేస్తాను. కాని సంతోషంగా ఉండను’ అని కుండ బద్దలు కొట్టింది సంయుక్త.

ఇదంతా సంయుక్త భర్తకు చెప్పాడు సైకియాట్రిస్ట్‌. ‘నీకు నచ్చింది ఆమె నుంచి ఫిఫ్టీ పర్సెంట్‌ మాత్రమే ఆశించు’ అని చెప్పాడు అతనికి. సంయుక్తతో మాట్లాడాడు. ‘నీకు నచ్చనిది ఫిఫ్టీ పర్సెంటే చెయ్‌’ అని చెప్పాడు. ‘మీరు వంద పర్సెంట్‌ మారక్కర్లేదు. ఫిఫ్టీ పర్సెంట్‌ అడ్జస్ట్‌ అవ్వండి’ అని ఇద్దరికీ చెప్పాడు. సంయుక్త కొంచెం కొంచెం అడ్జస్ట్‌ అవుతోంది. ఆమె భర్త కొంచెం కొంచెం ఆమె రెక్కలను ఎగరనిస్తున్నాడు. పెళ్లి అనేది అందమైన గూడులా ఉండాలి తప్ప పంజరంలా కాదు. అది బంగారందైనా. ఏది చేయనివ్వాలి, ఎంత చేయనివ్వాలి, ఏది మానుకోవాలి, ఎంత మానుకోవాలి ఇద్దరూ తెలుసుకుంటే చాలా ఇబ్బందులు పోయినట్టే. ప్రస్తుతం సంయుక్త, సంయుక్త భర్త ఈ ఫేజ్‌లో ఉన్నారు.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement