లలిత ఒక ఇండియన్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆనంద్ ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లలిత ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు పనిచేయాల్సి ఉండగా, ఆనంద్ పని సాయంత్రం ఆరుగంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కనీసం మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. దీనివల్ల వారి కుటుంబ జీవితం సజావుగా సాగడంలేదు.
సత్యది చలాకీ మనస్తత్వం. ఎవరితోనైనా ఇట్టే అల్లుకుపోతుంది. మాట కలిపిందంటే ఆపదు. ఆమె భర్త కుమార్ భిన్న ధ్రువం. తన పని, పుస్తకాలు, సినిమాలతో గడిపేస్తుంటాడు. వంద మాటలకు ఒక్కమాటతో సమాధానం చెప్తాడు. దీంతో తన మాటలు వినడంలేదని సత్య.. వింటూనే ఉన్నా కదా, ఇంకేం చేయాలని కుమార్.. రోజూ గొడవ పడుతూనే ఉన్నారు.
రష్మి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అమెరికాలో పనిచేసే అవకాశం రావడంతో వెళ్లేందుకు సిద్ధమైంది. అది ఆమె భర్త రాజేష్‌కి ఇష్టంలేదు. ఇద్దరం ఇక్కడే పనిచేసుకుంటూ ఉందామన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేనని, తన కెరీర్‌కి అడ్డు రావద్దని తేల్చి చెప్పింది రష్మి. ఈ విషయమై మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానై విడాకుల వరకూ వెళ్లింది.
మారుతున్నకాలంతో పాటు ఉద్యోగాలూ మారుతున్నాయి. భిన్నమైన టైమింగ్స్, విభిన్నమైన వాతావరణాల్లో పని చేయాల్సి వస్తోంది. దీనివల్ల దంపతుల మధ్య సమస్యలు రావడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు అవి విడాకులకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వేర్వేరు టైమ్ జోన్స్‌లో పనిచేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది.
పనివేళల్లో తేడాల వల్ల వచ్చే సమస్యలు
♦వేర్వేరు పని షెడ్యూళ్ల కారణంగా జంటలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి కలసి గడిపేందుకు సరిపడా సమయం లేకపోవడం. దీనివల్ల దంపతుల్లో ఒకరి పై ఒకరికి నిర్లక్ష్యభావం ఏర్పడుతుంది. ఇది ఆ బంధంలో ఒత్తిడిని పెంచుతుంది. విరుద్ధమైన పని షెడ్యూళ్లలో పనిచేసే జంటలు తామిద్దరూ మాట్లాడుకోవడానికి ఇద్దరికీ అనుకూలమైన సమయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం. ఇది సవాలుగా మారి ఆ దాంపత్యంలో అపార్థాలు, ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఫలితంగా సంఘర్షణ, మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది.
ఒక భాగస్వామికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ పని ఒత్తిడి ఉన్న భాగస్వామే ఇంటి పనులను ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇది కోపానికి, వాగ్వావాదానికి కారణమవుతుంది. ∙ఒక భాగస్వామికి ఎక్కువ పని గంటలు.. అంతే ఎక్కువ పని ఒత్తిడీ ఉన్నప్పుడు ఆ అలసట, బర్న్ అవుట్.. భావోద్వేగ సమస్యలకు దారితీయవచ్చు. దీనివల్ల దంపతుల మధ్య మానసిక దూరం ఏర్పడుతుంది. వేర్వేరు పని షెడ్యూళ్లు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వొచ్చు. అలాంటి సమస్యలున్న భాగస్వామికి మద్దతునివ్వడం మరొక భాగస్వామికి కష్టం కావచ్చు.
ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు
♦విభిన్నమైన పని షెడ్యూళ్లను నిర్వహించడంలో మొదటి, అతిముఖ్యమైన దశ.. మీ భాగస్వామితో నిజాయితీగా మీ ఆందోళనలు, అవసరాలు, అంచనాలను పంచుకోవడం. మీ భాగస్వామి అభిప్రాయాన్ని జాగ్రత్తగా వినడం.
♦మీ పని షెడ్యూళ్లు, బాధ్యతల చుట్టూ స్పష్టమైన సరిహద్దులను సెట్ చేసుకోండి. వీలైనంత వరకూ అవి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ∙మీకెంత బిజీ షెడ్యూళ్లు ఉన్నప్పటికీ మీ పార్టనర్‌తో బంధానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇద్దరికీ సమయం కుదిరినప్పుడు మీ యాక్టివిటీస్ షెడ్యూల్ చేసుకోండి. అలా కుదరనప్పుడు మెసేజెస్, కాల్స్, ఇ మెయిల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేలా చూసుకోండి.
♦మీ భాగస్వామి పని డిమాండ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి అవసరాలకు అనుగుణంగా మీ సొంత షెడ్యూల్స్‌ను మార్చుకోవడానికీ సిద్ధంగా ఉండండి. అవసరమైతే ఇంట్లో అదనపు బాధ్యతలు తీసుకోండి. పిల్లలు ఉంటే, వీలైనంతవరకు వారిని మీ కార్యకలాపాల్లో కలుపుకోండి. ఇది మీరు కుటుంబంగా కలసి ఉండటంలో, జ్ఞాపకాలను క్రియేట్ చేయడంలో తోడ్పడుతుంది. మీ భాగస్వామితో కలసి చేయగల పనుల కోసం చూడండి. అది భాగస్వామి అభిరుచి, ఫిట్నెస్ రొటీన్ లేదా ఇష్టమైన టీవీ షో కూడా కావచ్చు.
♦అన్నింటికంటే ముఖ్యంగా మీకు తగినంత నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, తదితర కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ∙ఇవన్నీ చేసినా మీ ఒత్తిడి, ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోతే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోండి.
చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment