మేనమామ పోలిక అదృష్టం. మరి మేనత్త పోలిక? మహాభాగ్యం. బంధుత్వాలు బలంగా ఉండాలనే పెద్దలు ఇలా సెలవిచ్చారు.కాని పిల్లలకు అలా అర్థం కాకపోవచ్చు. ఆ మెలకువను చెప్పే కథనం ఇది. మీ ఫ్యామిలీకి ఉపయోగపడే మేలుకొలుపు.
గోరుచిక్కుళ్లు, మునక్కాడలు, పొట్లకాయలు మాత్రమే ప్రకృతికి సమ్మతం కాదు. సొరకాయలు, గుమ్మడికాయలు, దోసకాయలు కూడా ఉంటాయి. లలితంగా కోమలంగా ఉండే సన్నజాజులు, విరజాజులు మాత్రమే ప్రకృతి పూయదు. కలువలు, తామరలు, పొద్దు తిరుగుడు పూలు కూడా ఉంటాయి. ఉన్నదంతా ప్రకృతికి అపురూపమే. ఉన్నదే అందం. వచ్చిందే ఆనందం.
......
అమ్మాయికి పదహారేళ్లు. తక్కువ బరువు ఉంది. ఉండాల్సినంత బరువు లేదు. బలహీనంగా ఉంది. తిండి తినడం లేదు. ముద్ద పట్టడం లేదు. ఎటో చూస్తోంది. ఏమిటోగా ఉంటోంది. తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చారు.
‘ఏమిటి సమస్య?’ సైకియాట్రిస్ట్ అడిగింది.
‘అసలు అన్నం తినడం లేదు డాక్టర్’ అంది తల్లి.
‘సరే మీరు బయట కూర్చోండి’ అని తల్లిదండ్రులను బయటకు పంపించింది.
తర్వాత అమ్మాయి వైపు చూసింది. చక్కటి ముఖం. అందమైన కళ్లు. చాలా చక్కటి నాసిక. చెంపలు. పెదాలు. కాని ఆ ముఖంలో వెలుతురు లేదు. ఆ వయసులో ఉండాల్సిన తేజస్సు లేదు. ఆనందం కనిపించడం లేదు.
‘ఏమ్మా... ఏమైనా ప్రేమలో పడ్డావా’ అడిగింది సైకియాట్రిస్ట్.
తల అడ్డంగా ఊపింది.
‘మార్కులు తీసుకు రమ్మని... రాత్రికి రాత్రి సుందర్ పిచయ్ అయిపోవాలని వేధిస్తున్నారా?’
‘లేదు’ అని అంది ఆ అమ్మాయి.
‘ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామని ఎవరైనా బెదిరిస్తున్నారా?’
‘ఊహూ’
‘మరి?’
‘నేను మా మేనత్తలా ఉంటానట’
‘ఉంటే?’
‘అలా ఉండటం నాకిష్టం లేదు’
‘ఏం?’
‘అలా ఉంటే నేను చచ్చిపోతాను’...
‘అవును.. నేను మా మేనత్తలా ఉంటే చచ్చిపోతాను... చచ్చిపోతాను’ ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది.
.....
నాగసుందరి ఆ అమ్మాయి పేరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దానికి ముందు టెన్త్, ఆ ముందు నైన్త్ చాలా హుషారుగా చదవాలనుకుంది. కాని కొంచెం బొద్దుగా తయారవడం మొదలెట్టింది. కొంచెం లావుగా తయారవడం మొదలెట్టింది. రెండేళ్లలో పది కిలోల బరువు పెరిగింది. బట్ట కొంటే ఎక్కువ కొనాల్సి వచ్చేది. రెడీమేడ్ కొనాలంటే చాలాసేపు వెతకాల్సొచ్చేది. కొత్త చెప్పులు తొందరగా అణిగిపోయేవి. తండ్రి స్కూటర్ మీద ఎక్కించుకునేటప్పుడు ఆ స్కూటర్ కుయ్యోమని మూలిగినట్టుగా ఆ అమ్మాయికి అనిపించేది.
వారూ వీరూ ఇంటికి పోచుకోలు కబుర్లు చెప్పడానికి వచ్చినప్పుడు ‘అమ్మాయి.. బొద్దుగా తయారవుతోందండీ... ఈ వయసులోనే కంట్రోల్ చేయాలి... లేకుంటే తర్వాత చాలా కష్టమవుతుంది’ అనేవారు.
‘అది తన తప్పు కాదండీ. మేనత్త పోలిక. ఆమె కూడా ఇలా బొద్దుగా ఉండేది కదా. జీన్సు. ఎక్కడికి పోతాయి’ అనేది.
స్కూల్లో పిల్లలు ఏడిపించేవారు. బోండాం బోండాం అనేవారు. క్లాస్ టీచర్ స్నాక్స్ టైమ్‌లో రెండు ప్లేట్లు పెట్టేది. అవన్నీ నాగసుందరి సరదాగానే తీసుకునేది.
కాని ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్లతో వీళ్లతో మాట్లాడేటప్పుడు ‘మా అమ్మాయిది మేనత్త పోలిక’ అన్నప్పుడు మాత్రం వణుకు వచ్చేది.
......
‘కొంచెం లావుగా ఉన్నావని, మేనత్తలా ఉన్నావని ఎవరైనా అంటే భయపడతావా? దిగులు పడతావా? ఇందులో భయపడటానికి ఏముంది?’ అంది సైకియాట్రిస్ట్.
‘అది కాదు డాక్టర్’ అని ఆ అమ్మాయి తల వొంచుకుంది.
‘పర్లేదు చెప్పు’
‘మా మేనత్తకు లావు తగ్గలేదు. ఎన్నేళ్లున్నా పెళ్లి కాలేదు. ఒక రోజు ఆమె నాకీ లావు ఇష్టం లేదు అని చచ్చిపోయింది’
సైకియాట్రిస్ట్ ఒక్క క్షణం ఆ తీవ్రతను గ్రహించింది.
‘నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. నేను పెద్దయ్యి వాళ్లను బాగా చూసుకోవాలి. లావుగా ఉంటూ పెళ్లి అవకుండా వాళ్లను దిగులుతో చంపకూడదు. నేను చచ్చిపోకూడదు’ అంది వెచ్చటి కన్నీళ్లతో.
సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయినే చూస్తూ కూచుంది.
.....
నాగసుందరిని అనేక పరీక్షలు చేసిన మీదట ఆ అమ్మాయి పరిస్థితి సున్నితంగా ఉందని సైకియాట్రిస్ట్‌కు అర్థమైంది. అస్సలు అన్నం తినడం లేదు. తినడానికి రోజుల తరబడి సంశయిస్తోంది. ఆ లంకణాలను భరించలేక ఒక్కోసారి విపరీతంగా తినేస్తోంది. ఉండాల్సిన బరువు కన్నా తగ్గినా అద్దం ముందు నిలుచుంటే ఆ అమ్మాయికి తనను తాను చాలా లావుగా కనిపిస్తోంది. అంటే ఇంకా సన్నబడాలని తీవ్రంగా తిండిని కంట్రోల్ చేస్తోంది. ఇది ‘అనెరెక్సియా నెర్వోజా’ అనే డిజార్డర్. ఇది ఒక మోస్త్తరు వరకూ ఉంటే హాని ఉండదు. శ్రుతి మించితే ప్రాణాలకు కూడా ప్రమాదం.
....
సైకియాట్రిస్ట్ తల్లిదండ్రులను కూచోబెట్టింది.‘చూడండి. పిల్లల మనసులో ఏముందో వారికి ఎటువంటి భయాలు ఏర్పడుతున్నాయో మనం ఎటువంటి భయాలు కల్పిస్తున్నామో సొసైటీ వాళ్లను ఎంత అపోహలో నెడుతోందో ఎప్పటికప్పుడు మనం పట్టించుకోవాలి. బిజీలో ఇవాళ్టి తల్లిదండ్రులు ఏమీ గమనించక తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలని చూస్తున్నారు. మీ అమ్మాయికి మేనత్త పోలిక వచ్చింది. వస్తే తప్పేంటి? లావుగా ఉండటంలో ఏ తప్పూ లేదు. అది మరీ అవసరానికి మించిన లావు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని అదుపు చేసుకుంటే సరిపోతుందని చెప్పాలి. లావుగా ఉండటం పాపం సన్నగా ఉండటం వరం అని నూరిపోస్తున్నాం. మన క్యాలెండర్లలో బక్క చిక్కిన లక్ష్మీదేవిని ఎప్పుడైనా చూశామా? ఆరోగ్యకరమైన దేహమే ఐశ్వర్యం. ప్రకృతి ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉంటే లావైనా సన్నమైనా తెలుపైనా నలుపైనా ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పాలి. ఆ అమ్మాయి మేనత్తలో ఆత్మవిశ్వాసం నింపి ఉంటే ఆమెను ఏదో ఒక ఉద్యోగంలో వ్యాపకంలో పెట్టి ఉంటే ఎవరో ఒకరు ఇష్టపడేవారు దొరికి ఉండేవారు. లేదా ఆమె ఆ వ్యాపకాల్లో సంతృప్తి పడేది. శరీరం పరమావధి పెళ్లి మాత్రమే అనీ ఆ పెళ్లికి శరీరం సుందరంగా ఉండాలని నూరిపోస్తున్నాం. మామిడి చెట్లే ఉండాలి ద్రాక్ష గుత్తులే కాయాలి అనుకుంటే వేప చెట్టు ఉండేది కాదు. దాని చేదు కూడా కలిస్తేనే తీపి చేదు సమానమై సృష్టి సమతూకంతో ఉంటుంది. అన్ని విధాల రూపాలు, దేహాలు, రంగులు ఇవన్నీ ప్రకృతి తన కోసం అల్లుకున్న నేత. దానిని అర్థం చేయించాలి మన పిల్లలకు. ఆ అమ్మాయి మేనత్తలో కూడా ఏవో పాజిటివ్ విషయాలు ఉండే ఉంటాయి. వాటిని చెప్పండి మీ అమ్మాయికి. తనలోని పాజిటివ్ విషయాలు అర్థం చేయించండి. మీ అమ్మాయి టెన్త్‌లో టాపర్. బుద్ధి కూడా గొప్ప సౌందర్యం అని చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్.
ఆ తర్వాత సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, న్యూట్రీషనిస్ట్‌లు కలిసి ఒక టీమ్‌లా మారి నాగసుందరిని ట్రీట్ చేశారు.నాగసుందరి ఇప్పుడు నాగసుందరిలా ఉంది. బాగా చదువుకుంటోంది. సన్నగా ఉందా లావుగా ఉందా అని లోకం చూడవచ్చు. కాని అద్దం ముందు నిలుచున్న ప్రతిసారీ ఇది నేను... నేను నాకు చాలా ఇష్టం అనుకుని బుగ్గ మీద ఒక చిట్టి ముద్దు పెట్టుకుంటోంది.తనను తాను స్వీకరించడమే కదా అసలైన విజయం.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment