‘మీ అబ్బాయి టెన్త్ అట కదా’... ‘బాగా చదువుతున్నాడా?’... ‘పరీక్షలు బాగా రాసి మీ అమ్మా నాన్నలకు పేరు తేవాలోయ్’... ‘ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి బాబు’... ‘మీ అమ్మా నాన్నల ఆశలన్నీ నీ మీదే’...ఫైనల్ పరీక్షలనే సరికి పలకరింపులతోనే పిల్లలకు సగం స్ట్రెస్ పెంచుతారు చుట్టుపక్కలవాళ్లు. తల్లిదండ్రుల ఆరాటం సరేసరి. పిల్లాడు పరీక్షకే వెళుతున్నది... యుద్ధానికి కాదు. తమ శక్తి మేరకు, సామర్థ్యం మేరకు, సౌకర్యం మేరకు పిల్లలు పరీక్షలు రాసేలా ఉత్సాహపరచాలి తప్ప బెంబేలెత్తించి కాదు. పాల్గొనడానికి నిరాకరించే స్థాయిలో వత్తిడి తేకుండా జాగ్రత్త పడమని చెప్పేదే నేటి కథనం.
రక్షిత్ సరిగ్గా చదవడం లేదు. పరీక్షలు గట్టిగా నెల రోజులు ఉన్నాయి. ముందు బాగానే ఉండేవాడు. రోజూ పుస్తకాలు తెరిచేవాడు. ఇప్పుడు చిత్రంగా మారిపోయాడు. స్కూల్‌లో సిలబస్ అయిపోయిందని ఒకరోజు వెళుతున్నాడు ఒకరోజు వెళ్లడం లేదు. లేట్‌గా నిద్ర లేస్తున్నాడు. పుస్తకం పట్టుకున్నా టీవీ చూస్తున్నాడు. ‘చదువుకో నాన్నా.. అసలే టెన్త్ క్లాస్’ అని తల్లి అంటే ‘నాకు తెలుసులే’ అని కసురుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. టెన్త్ మంచి మార్కులతో పాస్ అయితే మంచి కాలేజీలో చేర్పించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. కాని రక్షిత్ వాలకం మాత్రం వేరేగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి?.
........................
రక్షిత్ చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్. తల్లిదండ్రులకు ఒకే పిల్లాడు కాబట్టి సహజంగానే ఇష్టం, ప్రేమ ఎక్కువ. వాడు బాగా చదవాలని కోరిక కూడా ఉంది. మంచి స్కూల్లో చేర్పించారు. అడిగినవన్నీ ఇప్పించారు. బాగా చదవాలని పదే పదే చెప్పారు. కాని పరీక్షలు వచ్చేసరికి వాడు బాగా కంగారు పడుతుంటాడు. ‘ఇప్పుడు తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు?’ అడుగుతాడు. ‘ఏం చేస్తామురా. ఈసారి బాగా రాయి అంటాము’ అంటుంది తల్లి. ‘మళ్లీ తక్కువొస్తే?’ ‘ఎందుకొస్తాయి?’ ‘వస్తే..?’ ‘రాకూడదు. మంచి మార్కులు రావాలి’‘అదిగో... నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని’. మంచి మార్కుల కోసం ఎక్కువ చదువుతాడు నిజమే కాని మంచి మార్కుల ఆరాటంలో పాఠాలు అర్థం చేసుకోడు. అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోడు. రుబ్బి రుబ్బి చదివి మర్చిపోతాడు. లేదా వొత్తిడి వల్ల అసలు సమయానికి రాయలేకపోతాడు. చివరకు అత్తెసరు మార్కులు వస్తాయి. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది... ఈ క్లాసులన్నీ ఇలాగే జరిగాయి. కాని ఇప్పుడు పది వచ్చింది.
∙∙
పదికి వచ్చినప్పటి నుంచి ఇరుగు పొరుగువారు, బంధువుల హెచ్చరిక జెండాలు ఎగరడం ఎక్కువైంది. ‘ఏమ్మా... మీ రక్షిత్ గాడిలో పడ్డాడా. ఏరా.. రక్షిత్ బాగా చదువుతున్నావా’ అని ఒకరు... ‘మా పిల్లవాడు చూడు ఎంతమంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో... నువ్వూ వాడి తమ్ముడి వరసే కదరా.. నీకెందుకు రావు’ అని ఒకరు ‘ఈ సంవత్సరం మీరు ఎలా చేస్తారో ఏమిటో’ అని వేరొకరు ఒకటే దాడి. తల్లిదండ్రులు ఆ మాటలు విని తమ మాటలు పెంచారు. ‘ఒరే.. ఇంకొకణ్ణి కంటే నిన్ను సరిగ్గా చూసుకోలేమని కనలేదు. నువ్వే మా ఆశవు. మన బంధువుల్లో అందరూ బాగా చదువుతున్నారు. నువ్వు తప్ప. టెన్త్ బాగా చదవాలి’ అని. ఇవన్నీ విని రక్షిత్ చదువుతున్నట్టే కనిపించాడు. కాని సడన్‌గా మారిపోయాడు. స్కూల్‌కు వెళ్లకపోవడం, చదవకపోవడం, టీవీ చూడటం... తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్లారు
.....................
‘డాక్టర్.. ఇదీ పరిస్థితి. అసలు ఎగ్జామ్స్ రాయడానికి వెళతాడో లేడో అన్నంత భయంగా ఉంది’ అంది తల్లి రక్షిత్‌ని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చి. సైకియాట్రిస్ట్ ఆమెను బయటకు పంపించి రక్షిత్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని రక్షిత్ సహకరించలేదు. ‘రక్షిత్.. చూడు.. నేను ఇక్కడ ఉన్నది నీ మనిషిగా. నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాడు. మీ అమ్మా నాన్నల మాటలు విని నిన్ను తప్పు పట్టను. నీ మాటలు విని నీ బాధ అర్థం చేసుకుంటాను’ అని ఊరడింపుగా అడిగేసరికి రక్షిత్ చాలా సేపు ఏడ్చాడు. తర్వాత చెప్పాడు...
‘అంకుల్.. నాకు పరీక్షలంటే భయం లేదు కానీ మంచి మార్కులు రాకపోతే అమ్మా నాన్నలు బాధ పడతారని టెన్షన్ పడతాను. ఎంత చదివినా చదివింది మర్చిపోతానేమోనన్న టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అమ్మానాన్నలతో పాటు మా బంధువులకు, ఫ్రెండ్స్‌కు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. నేను బాగా చదివినా సరిగ్గా రాయలేక ఫెయిల్ అయితే అందరూ మా అమ్మానాన్నలనే అంటారు... వాళ్లు నన్ను సరిగ్గా పెంచలేదని. అందుకని నేను అందరి ముందు సరిగ్గా చదవకుండా నా తప్పు వల్లే ఫెయిల్ అయ్యాను అనిపించుకుంటే నన్ను తిడతారు తప్ప వారిని ఏం అనరు కదా. అందుకని నేను చదవడం లేదు’ అన్నాడు.
సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది..
‘రక్షిత్ ఏ స్టూడెంట్ అయినా మూడు చీౖచీ లను పట్టించుకోకూడదు. othersలోని ఓ.. Openionsలోని ఓ.. Outcomeలోని ఓ. నీ ఇరుగుపొరుగు వాళ్లని, వాళ్ల అభిప్రాయాలని పట్టించుకోకు. వాళ్లు నీకేం అన్నం పెట్టరు. ఫీజు కట్టరు. మీ అమ్మా నాన్నలు ఆశిస్తున్న అవుట్‌కమ్‌ని కూడా పట్టించుకోకు. అది నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉన్నదల్లా నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడటం. ఇక మర్చిపోవడం గురించి. ఏదో ధ్యాస లో తల ఒంచుకుని ఒక దారిలో వెళితే మళ్లీ ఆ దారిని గుర్తు పట్టగలవా? లేవు. అదే బాగా గమనిస్తూ ఒకటికి నాలుగు సార్లు ఆ దారిలో తిరిగితే ఎప్పటికీ మర్చిపోవు. శ్రద్ధ పెట్టి నీ పాఠాలు ఒకటికి నాలుగుసార్లు చదివితే ఎందుకు మర్చిపోతావు. మర్చిపోతావేమో అని మైండ్ భయపెడుతూ మరింత బాగా చదివిస్తుంటుంది. ఇది అందరికీ ఉండే భయమే. నువ్వు ఫర్‌ఫెక్ట్‌గా ఉన్నావు. పరీక్షలు బాగా రాయి. యావరేజ్ రిజల్ట్స్ వస్తాయా, టాప్ రిజల్ట్స్ వస్తాయా నీకెందుకు? మీ మనసులో నువ్వు గిల్ట్ ఫీలవకుండా కష్టపడటమే నీకు కావలసింది. మీ అమ్మా నాన్నలకు కూడా అది అర్థమయ్యేలా చెబుతాను’ అన్నాడు సైకియాట్రిస్ట్.
రక్షిత్‌కి కొంచెం ధైర్యం వచ్చింది. ‘నేను బాగా రాయగలనా?’ అని అడిగాడు. ‘కచ్చితంగా బాగా రాయగలవు. ఇంత వర్రీ అవుతున్నావంటే నీకు చాలా బాధ్యత ఉందని అర్థం. బాధ్యత ఉన్నవాడు ఎలా ఓడిపోతాడు చెప్పు’ అన్నాడు సైకియాట్రిస్ట్. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కూడా అదే చెప్పాడు. ‘మీ అబ్బాయికి మీ బరువు సరిపోతుంది. ఇరుగుపొరుగువారి బరువు కూడా ఇవ్వకండి. మీ ఇంటి మొక్క ఎంత పెరగగలదో అంత పెరగగలదు. ఊరి చెట్లతో పోటీ పెట్టకండి. మీ మొక్కను సౌకర్యంగా సంరక్షించండి చాలు’ అన్నాడు. పరీక్షలు మరో మూడు వారాల్లో ఉండగా జరిగిన ఈ కౌన్సెలింగ్ రక్షిత్‌కు లాభించింది.
అతడు పరీక్షలకు మనస్ఫూర్తిగా సిద్ధం అయ్యాడు.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment