శభాష్.. మిస్టర్ రాకేష్
బాడీ బిల్డింగ్ పోటీల్లో రాణిస్తున్న 32 ఏళ్ల యువకుడు
9 సార్లు ‘మిస్టర్ ఆంధ్రా’.. ఈ ఏడాది ‘మిస్టర్ ఇండియా’గా విజయం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కొందరు బంధువులు, ఆత్మీయుల అవహేళనలే అవకాశంగా మలుచుకుని.. కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు నగరానికి చెందిన 32 ఏళ్ల బోళ్ల తిరువెంగళరాకేష్. మొక్కవోని దీక్షతో.. బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆంధ్రా.. మిస్టర్ ఇండియా టైటిల్స్‌ను సాధించి యోధుడిగా మారాడు. ఓ వైపు సింగ్‌నగర్‌లో జిమ్ కోచ్‌గా.. మరోవైపు బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యే విద్యార్థిలా నిత్యం సన్నద్ధమవుతూ.. అందరితో శభాష్.. రాకేష్ అనిపించుకుంటున్నాడు.
సాధారణ కుటుంబంలో జన్మించి..
వన్‌టౌన్ కేఎల్‌రావు నగర్లో రాకేష్, అతని తల్లి దండ్రులు బోళ్ల రామారావు, ఇందుమతి, అతని సోదరి నివసిస్తున్నారు. అతని తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో గుమాస్తా. అతనికి కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటమే కాకుండా రాకేష్ కూడా సన్నగా ఉండేవాడు. అతన్ని అందరూ ఆట పట్టిస్తుండటంతో బాడీ పెంచాలని నిర్ణయించుకున్నాడు. వన్‌టౌన్‌లోని జిమ్‌లలో చేరి శరీర ఆకృతిని పెంచుకునేందుకు శిక్షణ తీసుకునేవాడు.
ఒక పూట చదువు.. మరో పూట శిక్షణ..
రాకేష్ పదో తరగతి వరకూ గణేష్ ట్యుటోరియల్స్‌లో, ఇంటర్మీడియట్ శాతవాహన కళాశాలలో, డిగ్రీ శారద కళాశాలలో పూర్తిచేశాడు. తన కుటుంబానికి భారంగా మారకూడదని రాకేష్ ఓ పూట చదువుకుంటూ మరో పూట జిమ్‌లో శిక్షణ ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ.. స్వయంకృషితో ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో సింగ్‌నగర్ నందమూరి నగర్‌లో 2018లో జిమ్‌ను స్థాపించి నిత్యం దానిలోనే కసరత్తులు చేస్తూ.. వందలాది మంది యువకులకు తక్కువ ఫీజులతో శిక్షణ ఇస్తున్నాడు. ఉపాధి అవకాశాన్ని అందించిన జిమ్‌నే దేవాలయంగా భావించి జీవితంలో మరోమెట్టు పైకి ఎక్కేందుకు పరుగులు తీస్తున్నాడు.
‘మిస్టర్ ఆసియా’ టైటిల్ నా కల
అందరూ సన్నాగా ఉన్నానని ఎగతాళి చేయడంతో జిమ్‌లో చేరాను. ఆ తర్వాత జిమ్ నాకు దేవాలయంగా మారిపోయింది. మిస్టర్ ఆంధ్రా, మిస్టర్ ఇండియా టైటిల్స్‌ను గెలవడం చాలా సంతోషంగా ఉంది. ‘మిస్టర్ ఆసియా’పోటీల్లో గెలుపొంది.. ఆ టైటిల్‌ను సాధించాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం దాని కోసం కసరత్తులు చేస్తున్నాను. కచ్చితంగా ఆ టైటిల్‌ను సాధించి నగరానికి మంచి పేరు తీసుకువస్తాను.
–బోళ్ల తిరువెంగళ రాకేష్
Comments
Please login to add a commentAdd a comment