ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కోల్‌ప్లాంటులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వి.పోతురాజు ఉద్యోగాలు ఇప్పి స్తానని పలువురిని మోసగించి రూ.23 లక్షలు వసూలు చేశాడు. మూడేళ్ల క్రితం మోసానికి గురైన బాధితులు ఇబ్రహీంపట్నంలో గురువారం మీడియాను ఆశ్రయించి వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఎన్టీటీపీఎస్‌కు చెందిన 327 కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు వి.పోతురాజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసపు వల విసిరాడు. విద్యుత్ సౌధలో సీఎండీ పీఏగా పనిచేస్తున్నట్లు బాధితులను నమ్మించి శ్రీహరి అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతని ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. యూనియన్‌లో మరో నాయకుడు రామును మధ్యవర్తిగా పెట్టి మచిలీపట్నానికి చెందిన 23 మంది యువకుల నుంచి విడతల వారీగా రూ.23 లక్షలు వసూలు చేశాడు. గేట్ పాస్‌ల కోసం వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆరు నెలల క్రితం పోతురాజును నిలదీయడంతో రూ.4 లక్షలు తిరిగి చెల్లించాడు. మరో రూ.19 లక్షలు చెల్లించకుండా, ఉద్యోగాలు ఇప్పించకుండా ముఖం చాటేశాడు. ఈ మోసంపై మచిలీపట్నం స్టేషన్‌కు సమాచారం ఇచ్చామన్నారు.
రూ.23 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్ట్ కార్మికుడు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించిన బాధితులు


