ర్యాలీగా వస్తున్న రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
ఎర్రావారిపాళెం(చిత్తూరు) : దత్తత ముసుగులో భారీ కుంభకోణానికి తెరలేపారంటూ ఎన్‌ఆర్‌ఐ అబ్దుల్ అలీ భూ ఆక్రమణపై రైతులు తిరుగుబాటు చేశారు. బుధవారం ఎర్రావారిపాళెం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. వారు మాట్లాడుతూ, దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రభుత్వ ఫలాలన్నీ బొక్కేశాడంటూ మండిపడ్డారు. గ్రామంలో కక్కూసు బిల్లుల నుంచి రైతులకందే ఉద్యాన నిధుల వరకు కాజేయడంలో అబ్దుల్‌అలీ సిద్ధ హస్తుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్ప్ ఫ్యాక్టరీ నిర్మిస్తానంటూ రైతులను బెదిరించి ఎర్రావారిపాళెం సమీపంలోని మబ్బుతోపు వద్దనున్న రైతుల భూములను ఆక్రమించడానికి పన్నాగం పన్నాడన్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు అబ్దుల్ అలీపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ట్రైనింగ్ పేరిట ఉద్యానశాఖలోని ఉన్నత స్థాయి అధికారి అండతో నిధులను మింగేశారని చెప్పారు. దీన్‌దార్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్‌ను రైతుల కోసమంటూ ప్రభుత్వ రాయితీతో నిర్మించుకొని ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలను నడుపుతూ రైతులను అడ్డదిడ్డంగా బెదిరించ సాగారన్నారు.
రైతులకు న్యాయం చేయాలి
ఎన్‌ఆర్‌ఐ అబ్దుల్‌అలీ బారి నుంచి తమ వ్యవసాయ భూములను తమకు ఇప్పించాలంటూ రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. రైతు సంఘం పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన అబ్దుల్ అలీపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు న్యాయం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. రైతులంతా ఏకమై వందలాదిగా తరలివచ్చారు. అబ్దుల్ అలీ అక్రమంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో తమ భూములు కోల్పోయామంటూ తహసీల్దార్ దైవాదీనంకు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment