ప్రకృతి సోయగాల మధ్య పాలంక వీరభద్రస్వామి ఆలయ వ్యూ
పచ్చటి వృక్షాలతో దట్టమైన అడవి, పెద్ద కొండ చరియ పై నుంచి జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయత మైమరపించే అందాలకు ఆలవాలంగా నిలుస్తుంది పాలంక క్షేత్రం. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఆదిశేషుని ఆకారం వంటి కొండచరియ కింద మూల విరాట్ పాలంకేశ్వరుడితో పాటు వీరభద్రుడు, గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తున్న నాగమయ్య పుట్ట కొలువై ఉన్నాయి. సంతాన ప్రాప్తిని సిద్ధించే స్వామిగా భక్తుల పాలిట కొంగుబంగారంలా పూజలందుకుంటున్నారు.
యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో, కృష్ణానది ఒడ్డున పాలంక వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. స్వామి కరుణకోసం వేలాది మంది భక్తులు కాలినడకన, ప్రత్యేకవాహనాల్లో తరలివెళ్తారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు పాలంకకు చేరుకుంటారు. సంతాన ప్రాప్తి కోసం భక్తులు నల్లమల అడవుల్లోని పాలంక వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. ఇక్కడి పెద్ద కొండచరియపై నుంచి పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం సంతానం లేని దంపతులు దోసిళ్లు పడతారు. అలా దోసిళ్లపై నీటి బిందువులు పడిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
శ్రీశైల క్షేత్రానికి సమీపంలో వెలసిన పర్వతాల మల్లయ్య
పాలుట్ల గిరిజన గూడేనికి పది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. నల్లమల అందాలకు పరవశించిన పరమశివుడు ముగ్ధుడై పూజలందుకునేందుకు ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామిని ఇక్కడ పాలంకేశ్వరుడిగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ఆరోగ్య, సౌభాగ్య, సంతాన ప్రదాత వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారు. ‘పర్వతాల మల్లయ్య, పాలంక వీరయ్య’ అంటూ పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రంతో పోల్చబడింది. ఏటా ఆషాడ శుద్ధ తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు ప్రారంభమౌతాయి.
కొండకోనల్లో ప్రయాణం సాగేదిలా
శ్రీకృష్ణదేవరాయల వారి రక్షణ
శ్రీశైలం క్షేత్రంతో విజయనగర సామ్రాజ్యధీశుడు శ్రీకృష్ణదేవరాయలకు ఎంత అనుబంధం ఉందో అంతే అనుబంధం పాలంక క్షేత్రంతోనూ ఉంది. రాయలవారు తూర్పు దండయాత్రల సందర్భంగా గజపతులను ఓడించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. అలా కృష్ణానది ఒడ్డున ప్రయాణం సాగిస్తుండగా ప్రజలు దారిదోపిడీ దొంగల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు తన సైన్యాధిపతులైన బొడా వెంకటపతినాయుడు, నలగాటి పెద్ద తిమ్మనాయుడులకు ఈ ప్రాంతాన్ని జాగీరులుగా ఇచ్చి నది పక్కన ఆలాటం కోటను నిర్మించారు. అక్కడి నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో పాలంక వీరభద్రుడు, భద్రకాళీ మాతను ప్రతిష్టించి ఆ ప్రాంతానికి రక్షణ బాధ్యతను తన సైన్యాధిపతులకు అప్పగించారని చరిత్ర చెప్తుంది.
అహ్లాదంగా కొండకోనల్లో భక్తిరస యాత్ర
పాలంక క్షేత్రం యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి పాలంక చేరుకునేందుకు 42 కిలోమీటర్ల యాత్ర సాగించాలి. దట్టమైన నల్లమల అడవుల్లో ఆకాశాన్ని అంటే కొండల్లో నుంచి సాగే ఈ భక్తిరస యాత్ర ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తుంది. విజయనగర సామ్రాజ్యధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు పాలన వైభవనాకి చెరిగిపోని జ్ఞాపకంగా ఈ పాలంక క్షేత్రం నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment