అనంతలో ప్రారంభమై.. అంతటా విస్తరించి..
- పేద కూలీలకు పట్టెడన్నం పెట్టిన ఉపాధి హామీ పథకానికి పదేళ్లు
- మహానేత వైఎస్సార్ చొరవతో కరువుసీమ అనంతలో ప్రారంభం.. ఆపై దేశమంతటా అమలు
- ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ ఎన్ఆర్ఈజీఏను నీరుకార్చుతోందన్న కాంగ్రెస్
- ఫిబ్రవరి 2న బండ్లపల్లికి రాహుల్ గాంధీ: పీసీసీ చీఫ్ రఘువీరా వెల్లడి
2004.. పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతూ తెలుగు ప్రజలు మహానేత వైఎస్సార్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అప్పటికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు. అందులో ప్రధానమైనది రాయలసీమలో ఆకలిచావులు. ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదనే తన ఆశయాన్ని కేంద్రానికి వివరించిన వైఎస్సార్.. ప్రతిష్ఠాత్మక ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదట రాయలసీమలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు.
2005, ఫిబ్రవరి 2.. భారతదేశ చరిత్రలో పేరెన్నికగల పథకాల్లో అగ్రభాగాన నిలిచే ఉపాధి హామీ పథకం ప్రారంభమైనరోజు. వైఎస్సార్ అభ్యర్థన మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి(బండమీదపల్లి)లో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉపాధిహామీ దేశమంతటా విస్తరించింది. మహానేత కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే పథకం విజయవంతంగా నడిచింది. పేద కూలీలకు పట్టెడన్నం దొరికినట్టైంది. ఏపీలో ఈ పథకం జోరు చూసిన తర్వాతే ఉపాధి హామీని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయితే మహానేత అకాలమరణంతో పేదవాడికి కూడుపెట్టే ఈ పథకం క్రమంగా నిర్వీర్యమవుతూవచ్చింది. ప్రస్తుతం అధికారంలోఉన్న టీడీపీ సర్కారు ఉపాధి హామీపై కించిత్ శ్రద్ధయినా చూపకపోవడంతో మళ్లీ అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో ఆకలిచావులు నమోదవుతున్నాయి. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరైతే ఏకంగా ఉపాధి హామీ పథకాన్నే ఎత్తేస్తారేమోననేంత అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఉపాధి హామీ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లికి రానున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆ పథకాన్ని నేటి ఎన్డీఏ సర్కార్ నీరుగార్చుతున్నదని, భవిష్యత్తులో కూడా ఉపాధి హామీ చట్టం అమలయ్యేందుకు పోరాటాలు చేస్తామని రాహుల్.. కూలీలకు ధైర్యం చెబుతారని రఘువీరా వెల్లడించారు.
ఇప్పటికే దాదాపు 6000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపునకు గురైయ్యారని, జాబ్ కార్డులు ఉండీ, పనులు అడిగినవారికి ఉపాధి చూపించడంలేదని ఆ కారణంగా మళ్లీ వసలు ప్రారంభమయ్యాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 4 లక్షల మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయారని రఘువీరా చెప్పారు. బండ్లపల్లిలో నిర్వహించే సభకు రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి కూడా కూలీలు తరలిరావాలని పిలుపునిచ్చారు.