సాక్షి, న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న స్థానాలకు టికెట్ ఆశిస్తున్న పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్, అద్దంకి దయాకర్‌లతో పాటు ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు ఉన్నారు. రాహుల్ వీరితో పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పోటీకి దిగవద్దని రాహుల్ వారికి సూచించారు. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. మరోవైపు ఇప్పటికే రెండు జాబితాల్లో 75 స్థానాలకు టికెట్లను ప్రకటించిన కాంగ్రెస్.. శనివారం మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
ఢిల్లీలో తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. ‘ఆదిలాబాద్, ఖమ్మం జిలాల్ల అభ్యర్థులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇవ్వనున్నట్టు రాహుల్ తెలిపారు. ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సంబంధించి రాహుల్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. గెలిచే అవకాశాలు, అక్కడి స్థానిక పరిస్థితుల గురించి నాయకులతో చర్చించారు. రేపు మిగతా స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment