bandlapalli
-
‘అనంత’ సాహితీ ‘సింగం’
- అభ్యుదయ భావజాల రచనలకు దిక్సూచి సింగమనేని అనంతపురం కల్చరల్ : కాల్పనిక జగత్తులో ఊగిసిలాడుతున్న ‘అనంత’ సాహిత్యాన్ని గతితర్క భౌతికవాద భావజాలంతో మలుపు తిప్పిన రచయిత సింగమనేని నారాయణ. మహాకవులు గురజాడ, శ్రీశ్రీలను సింగమనేని చదివినంతగా మరొకరు అర్థం చేసుకోలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఏకకాలంలో మనసును ఆహ్లాదపరుస్తూ, బుద్ధిని వికసింపజేస్తూ..ప్రతివారినీ ఆలోచింపచేయగల్గిన రచనా నిబద్ధత కల్గిన సింగమనేని నారాయణ 1943లో రాప్తాడు మండలం మరూరు బండపల్లి గ్రామంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జన్మించారు. చిన్నవయసులోనే రచనా వ్యాసంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 19 ఏళ్ల వయసులో ‘ఆదర్శాలు – అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీ’ నవలలను రచించారు. అనతికాలంలోనే కాల్పనిక రచనల వల్ల సమాజానికి ప్రయోజనం కల్గించేదేది లేదని గ్రహించిన ఆయన జూదం, అనంతం, సింగమనేని కథలు, నీకు నాకు మధ్య నిశీధి, జీవఫలం వంటి కథలను వినూత్న శైలితో రచించి రాష్ట్రస్థాయి రచయితల సరసన చేరిపోయారు. ఇక ఆయన రాసిన ‘సమయము– సందర్భము’, ‘సంభాషణం’, ‘మాతృభాషే ఎందుకు చదవాలి?’ మొదలైన వందల కొద్దీ వ్యాసాలు ఎంతో మంది యువ రచయితలకు స్పూర్తిని కల్గించాయి. వరించిన పురస్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, ఉరిపండ అప్పలస్వామి పురస్కారంతో పాటు పదుల సంఖ్యలో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. ‘కళారత్న’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుని జిల్లా కీర్తిని పెంచారు. ఆయన రచనలపై వివిధ వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయించి డాక్టరేట్లు ప్రకటించాయి. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సింగమనేని కథలు అనువాదమై పలు రాష్ట్రాలలో పాఠ్యాంశాలుగా మారాయి. రైతు జీవితానికి అండగా.. ప్రభుత్వాలు గ్రామీణ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, పెట్టుబడిదారుల జేబులు నింపడానికే పాలననంతా కేంద్రీకరిస్తున్నారన్న స్పృహతో సాగిన రచనలు సంచలనాలయ్యాయి. ఎటువంటి అభిప్రాయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగలడం వల్లే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లోని సాహిత్యంతో అనుబంధముంది. ప్రపంచీకరణ పేరుతో ప్రవేశపెడుతున్న విషసంస్కృతిని పరిహరిస్తూ ఆయన రాసిన అనేక రచనలు ప్రభుత్వాలకు చక్కటి పరిష్కార మార్గాలను వెతికిపెట్టాయి. రైతు లేకుంటే బతుకే లేదు ‘‘జీవితం పట్ల విలక్షణ దృక్పథం.. విస్తృత అవగాహన.. అనుమాన అనురక్తి ఎవరికైనా ఉండాలి. అవన్నీ నాలో సజీవ సహచర్యం చేయడానికి గురజాడ, శ్రీశ్రీ రచనలు ఎంతగానో తోడ్పడ్డాయి. చిన్నవయసు నుండే సమాజాన్ని సున్నితంగా గమనిస్తుండడం వల్ల అనుకుంటా రైతు లేని రాజ్యాన్ని చూడబోతున్నామన్న ఆందోళన నాకు ఎప్పుడూ కల్గుతూనే ఉంటుంది. ప్రభుత్వ విధానాలు పూర్తిగా భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తున్నాయి. భూమితల్లిని నమ్ముకున్న రైతులు వృత్తిని మానుకోకముందే అందరూ కళ్లు తెరవాలి. రైతు లేకుంటే బ్రతుకే లేదన్న స్పృహ అందరి ఉండాలన్నదే నా రచనల ధ్యేయం’’. - సింగమనేని నారాయణ -
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు
- రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా..? - మంత్రుల బృందం కరువు గ్రామాల్లో పర్యటించాలి - మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నార్పల (శింగనమల) : ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి శైలజానాథ్‌లు విమర్శించారు. ఆదివారం నార్పల మండలంలోని బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, కరువు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. స్థానిక రచ్చకట్ట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం అప్పటి కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో బండ్లపల్లిలో ప్రారంభించారని గుర్తు చేశారు. రాయల సీమ జిల్లాల్లో ఉన్న కరువును గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తొమ్మిది వారాలు గడుస్తున్నా, కూలీ డబ్బులు అందలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు కరువు గ్రామాల్లో పర్యటించి వారిని ఆదుకోవాలన్నారు. రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, ఉపాధి పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కనీసం రూ.200 కూలీ గిట్టుబాటు కాక గ్రామాల నుంచి కూలీలు వలస వెళ్తున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. -
వరుణుడి కోసం..
నార్పల : మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో శుక్రవారం రైతులు వర్షం కోసం గాడిదెలకు వివాహాన్ని జరిపించారు. ముందుగా డప్పువాయిద్యాలతో గ్రామంలో గాడిదలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పెళ్లి తంతును చేశారు. -
ఫిబ్రవరి 2న ‘ఛలో బండ్లపల్లి’
విజయవాడ బ్యూరో: అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న జరిగే ఉపాధి కూలీల భరోసా సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మాజీమంత్రులు, పార్టీ ప్రముఖులు హాజరవుతున్న బండ్లపల్లి సభ జాతీయస్థాయిలో జరుగుతుందన్నారు. పదేళ్ల కిందట ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు బండ్లపల్లిలోనే ప్రారంభించారనీ, ఫిబ్రవరి 2న మరోసారి అదేగ్రామంలో పథకం అమలు తీరుపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో చలో బండ్లపల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. గురువారం సాయంత్రం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలు పూర్తిగా గాడితప్పిందనీ, పథకం ద్వారా మంజూరయ్యే నిధులను టీడీపీ కాంట్రాక్టర్లు కోట్లకు కోట్లు దోచుకుంటున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ మిషన్లు స్వైరవిహారం చేస్తున్నాయనీ, కూలీలకు దక్కాల్సిన సొమ్ములు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. సోషల్ ఆడిట్ లేకుండా పోయిందనీ, పథకం నీరుగారిన నేపథ్యంలో రాష్ట్రంలోని 15నుంచి 20 లక్షల మంది కూలీలు వలసలు వెళ్లారన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే 7వేల మంది ఫీల్డు అసిస్టెంట్లను తొలగించిన ప్రభుత్వం జన్మభూమి కమిటీల పర్యవేక్షణ పేరుతో దళారుల వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో బండ్లపల్లి సభ ద్వారా పథకం అమలుపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి ఉపాధి కూలీలకు భరోసా కల్పిస్తామని రఘువీరా చెప్పారు. పార్టీశ్రేణుల సమీకరణలో భాగంగా గురువారం విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ ఉన్న వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు, మక్కెన మల్లికార్జునరావు, ఉగ్రనరసింహారెడ్డి, పార్టీ నేతలు మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, వినయ్‌కుమార్, సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. -
అనంతలో ప్రారంభమై.. అంతటా విస్తరించి..
- పేద కూలీలకు పట్టెడన్నం పెట్టిన ఉపాధి హామీ పథకానికి పదేళ్లు - మహానేత వైఎస్సార్ చొరవతో కరువుసీమ అనంతలో ప్రారంభం.. ఆపై దేశమంతటా అమలు - ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏను నీరుకార్చుతోందన్న కాంగ్రెస్ - ఫిబ్రవరి 2న బండ్లపల్లికి రాహుల్ గాంధీ: పీసీసీ చీఫ్ రఘువీరా వెల్లడి 2004.. పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతూ తెలుగు ప్రజలు మహానేత వైఎస్సార్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అప్పటికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు. అందులో ప్రధానమైనది రాయలసీమలో ఆకలిచావులు. ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదనే తన ఆశయాన్ని కేంద్రానికి వివరించిన వైఎస్సార్.. ప్రతిష్ఠాత్మక ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదట రాయలసీమలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. 2005, ఫిబ్రవరి 2.. భారతదేశ చరిత్రలో పేరెన్నికగల పథకాల్లో అగ్రభాగాన నిలిచే ఉపాధి హామీ పథకం ప్రారంభమైనరోజు. వైఎస్సార్ అభ్యర్థన మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి(బండమీదపల్లి)లో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉపాధిహామీ దేశమంతటా విస్తరించింది. మహానేత కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే పథకం విజయవంతంగా నడిచింది. పేద కూలీలకు పట్టెడన్నం దొరికినట్టైంది. ఏపీలో ఈ పథకం జోరు చూసిన తర్వాతే ఉపాధి హామీని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మహానేత అకాలమరణంతో పేదవాడికి కూడుపెట్టే ఈ పథకం క్రమంగా నిర్వీర్యమవుతూవచ్చింది. ప్రస్తుతం అధికారంలోఉన్న టీడీపీ సర్కారు ఉపాధి హామీపై కించిత్ శ్రద్ధయినా చూపకపోవడంతో మళ్లీ అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో ఆకలిచావులు నమోదవుతున్నాయి. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరైతే ఏకంగా ఉపాధి హామీ పథకాన్నే ఎత్తేస్తారేమోననేంత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లికి రానున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆ పథకాన్ని నేటి ఎన్డీఏ సర్కార్ నీరుగార్చుతున్నదని, భవిష్యత్తులో కూడా ఉపాధి హామీ చట్టం అమలయ్యేందుకు పోరాటాలు చేస్తామని రాహుల్.. కూలీలకు ధైర్యం చెబుతారని రఘువీరా వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 6000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపునకు గురైయ్యారని, జాబ్ కార్డులు ఉండీ, పనులు అడిగినవారికి ఉపాధి చూపించడంలేదని ఆ కారణంగా మళ్లీ వసలు ప్రారంభమయ్యాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 4 లక్షల మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయారని రఘువీరా చెప్పారు. బండ్లపల్లిలో నిర్వహించే సభకు రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి కూడా కూలీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాకి రాహుల్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటన తేదీ ఖరారైందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన రాహుల్ అనంతపురంలో పర్యటిస్తారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బండ్లపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం 10 ఏళ్ల వార్షికోత్సవ సభలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. గతంలో ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించారని రఘువీరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నీరుకారుస్తోందని రఘువీరారెడ్డి ఆరోపించారు.