ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు
- రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా..?
- మంత్రుల బృందం కరువు గ్రామాల్లో పర్యటించాలి
- మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
నార్పల (శింగనమల) : ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి శైలజానాథ్‌లు విమర్శించారు. ఆదివారం నార్పల మండలంలోని బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, కరువు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. స్థానిక రచ్చకట్ట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం అప్పటి కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో బండ్లపల్లిలో ప్రారంభించారని గుర్తు చేశారు.
రాయల సీమ జిల్లాల్లో ఉన్న కరువును గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తొమ్మిది వారాలు గడుస్తున్నా, కూలీ డబ్బులు అందలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు కూలీల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు కరువు గ్రామాల్లో పర్యటించి వారిని ఆదుకోవాలన్నారు. రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, ఉపాధి పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కనీసం రూ.200 కూలీ గిట్టుబాటు కాక గ్రామాల నుంచి కూలీలు వలస వెళ్తున్నా పాలకులకు పట్టడం లేదన్నారు.