‘అనంత’ సాహితీ ‘సింగం’
- అభ్యుదయ భావజాల రచనలకు దిక్సూచి సింగమనేని
అనంతపురం కల్చరల్ : కాల్పనిక జగత్తులో ఊగిసిలాడుతున్న ‘అనంత’ సాహిత్యాన్ని గతితర్క భౌతికవాద భావజాలంతో మలుపు తిప్పిన రచయిత సింగమనేని నారాయణ. మహాకవులు గురజాడ, శ్రీశ్రీలను సింగమనేని చదివినంతగా మరొకరు అర్థం చేసుకోలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఏకకాలంలో మనసును ఆహ్లాదపరుస్తూ, బుద్ధిని వికసింపజేస్తూ..ప్రతివారినీ ఆలోచింపచేయగల్గిన రచనా నిబద్ధత కల్గిన సింగమనేని నారాయణ 1943లో రాప్తాడు మండలం మరూరు బండపల్లి గ్రామంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జన్మించారు. చిన్నవయసులోనే రచనా వ్యాసంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 19 ఏళ్ల వయసులో ‘ఆదర్శాలు – అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీ’ నవలలను రచించారు. అనతికాలంలోనే కాల్పనిక రచనల వల్ల సమాజానికి ప్రయోజనం కల్గించేదేది లేదని గ్రహించిన ఆయన జూదం, అనంతం, సింగమనేని కథలు, నీకు నాకు మధ్య నిశీధి, జీవఫలం వంటి కథలను వినూత్న శైలితో రచించి రాష్ట్రస్థాయి రచయితల సరసన చేరిపోయారు. ఇక ఆయన రాసిన ‘సమయము– సందర్భము’, ‘సంభాషణం’, ‘మాతృభాషే ఎందుకు చదవాలి?’ మొదలైన వందల కొద్దీ వ్యాసాలు ఎంతో మంది యువ రచయితలకు స్పూర్తిని కల్గించాయి.
వరించిన పురస్కారాలు :
తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, ఉరిపండ అప్పలస్వామి పురస్కారంతో పాటు పదుల సంఖ్యలో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. ‘కళారత్న’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుని జిల్లా కీర్తిని పెంచారు. ఆయన రచనలపై వివిధ వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయించి డాక్టరేట్లు ప్రకటించాయి. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సింగమనేని కథలు అనువాదమై పలు రాష్ట్రాలలో పాఠ్యాంశాలుగా మారాయి.
రైతు జీవితానికి అండగా..
ప్రభుత్వాలు గ్రామీణ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, పెట్టుబడిదారుల జేబులు నింపడానికే పాలననంతా కేంద్రీకరిస్తున్నారన్న స్పృహతో సాగిన రచనలు సంచలనాలయ్యాయి. ఎటువంటి అభిప్రాయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగలడం వల్లే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లోని సాహిత్యంతో అనుబంధముంది. ప్రపంచీకరణ పేరుతో ప్రవేశపెడుతున్న విషసంస్కృతిని పరిహరిస్తూ ఆయన రాసిన అనేక రచనలు ప్రభుత్వాలకు చక్కటి పరిష్కార మార్గాలను వెతికిపెట్టాయి.
రైతు లేకుంటే బతుకే లేదు
‘‘జీవితం పట్ల విలక్షణ దృక్పథం.. విస్తృత అవగాహన.. అనుమాన అనురక్తి ఎవరికైనా ఉండాలి. అవన్నీ నాలో సజీవ సహచర్యం చేయడానికి గురజాడ, శ్రీశ్రీ రచనలు ఎంతగానో తోడ్పడ్డాయి. చిన్నవయసు నుండే సమాజాన్ని సున్నితంగా గమనిస్తుండడం వల్ల అనుకుంటా రైతు లేని రాజ్యాన్ని చూడబోతున్నామన్న ఆందోళన నాకు ఎప్పుడూ కల్గుతూనే ఉంటుంది. ప్రభుత్వ విధానాలు పూర్తిగా భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తున్నాయి. భూమితల్లిని నమ్ముకున్న రైతులు వృత్తిని మానుకోకముందే అందరూ కళ్లు తెరవాలి. రైతు లేకుంటే బ్రతుకే లేదన్న స్పృహ అందరి ఉండాలన్నదే నా రచనల ధ్యేయం’’.
- సింగమనేని నారాయణ