Singamaneni Narayana
-
కథా దార్శనికుడు ‘సింగమనేని’ కన్నుమూత
సాక్షి, అనంతపురం: రాయలసీమ అస్తిత్వ పోరాటాలకు సాహితీ పరిమళాలద్దిన ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ (78) గురువారం కన్నుమూశారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిన్న వయస్సు నుంచే రచనలు సింగమనేని నారాయణ రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లి గ్రామంలో 1943 జూన్ 23న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తిరుపతిలోని ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివిన ఆయన.. చిన్నవయసు నుంచే రచనా వ్యాసంగంలో మక్కువ చూపించేవారు. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు తెలుగు భాషపట్ల ఆసక్తి కలిగించిన సింగమనేని.. 2001లో పదవీ విరమణ చేశారు. కథకుడు, నవలా రచయితగా.. సింగమనేని ఇప్పటివరకు 43 కథలు రాశారు. 1960లో ‘న్యాయమెక్కడ’ అన్న తొలికథ నుంచి నేటివరకు ఆయన కలం నుంచి అనేక సాహితీ విలువలున్న వ్యాసాలను, కథలను రచించారు. జూదం, సింగమనేని కథలు, అనంతం అనే కథా సంపుటాలను, సీమ కథలు, ఇనుపగజ్జెల తల్లి, తెలుగు కథలు–కథన రీతులు, తెలుగు కథ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సంభాషణ అనే పేరుతో వ్యాస సంపుటి ఎంతోమందికి స్ఫూర్తినందించింది. అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు నవలలు రాసి మెప్పించారు. కళారత్నతో సత్కరించిన సర్కార్ ఎన్నో అవార్డులు, రివార్డులనందుకున్న ‘సింగమనేని’ని 2017లో ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. అనంతపురం జిల్లా సాహిత్యానికి పెద్ద దిక్కుగా ఉన్న సింగమనేని నారాయణ మరణంతో ఒక శకం ముగిసిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డితోపాటు ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య పీఎల్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ తదితరులు సింగమనేనికి కన్నీటి నివాళులర్పించారు. సింగమనేనికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా కనగానిపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
తెలుగు కథా సింగం
నిలువుటద్దం సైజులో మహాప్రస్థానాన్ని, ఆ పుస్తకాల్ని ఏనుగుపై చెన్నపట్నంలో ఊరేగించా లని శ్రీశ్రీ కోరుకున్నాడు. పూర్వం వావిళ్ళ వారు ప్రచురించిన తెలుగు మహాభారతాన్ని ఆ విధంగా ఊరేగించారట. నిలువుటద్దం సైజు కాకపోయినా, ఏనుగుపై ఊరేగింపు లేకపో యినా, మహాప్రస్థానాన్ని జెయింట్ సైజులో ముద్రించాలని శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు సంకల్పించి పని మొదలుపెట్టారు. విజయవా డలో మాటల సందర్భంలో ఈ విషయం చెప్పి, ఆ పుస్తకాన్ని సింగమనేని నారాయణతో ఆవిష్కరించాలని అన్నాడు. సింగమనేని రెండు నెలలుగా అనారోగ్యంతో పోరాటం చేస్తున్నాడు కదా అంటే, అనంతపురం వెళ్ళి ఆయన ఇంట్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేద్దామ న్నాడు. గుంటూరు రాగానే సింగమనేనితో ఫోన్లో మాట్లాడాను. నేనూ వస్తున్నానంటే తిరుపతి నుండి కోట పురుషోత్తం, సాకం నాగరాజను కూడా పిలవమన్నాడు. తర్వాత రెండుసార్లు ఆయనే ఫోన్ చేసి ఎప్పుడొస్తారని అడిగాడు. కానీ ఆయనే మా కోసం ఆగలేదు. శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా 2010లో నా ఆధ్వర్యంలో గుంటూరులో అన్ని వామపక్ష రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యతతో ఒక భారీ ఊరేగింపు, బహిరంగ సభ నిర్వ హించాం. ముఖ్య అతిథిగా ఎవర్ని పిలవాలనే చర్చవస్తే సింగమనేని కంటే అర్హతలున్న సాహితీవేత్త కనబడలేదు. తిరుపతిలో శ్రీశ్రీ కాంస్య విగ్రహం ఆవిష్కరించాలంటే కూడా వాళ్ళకూ ఆయన పేరే స్ఫురించింది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశ్రీపై సాధికారత ఎవరికుందంటే స్ఫురించే రెండు పేర్లు: సింగమనేని, సింగం పల్లి (అశోక్‌కుమార్). కాకుంటే సింగమనేని అనర్గళ వక్త.పంచెకట్టుపైన సి. నారాయణ రెడ్డి గేయానికి బొమ్మ గీయమని అడిగితే బాపు కచ్చితంగా ధవళవస్త్ర ధారణలో ఉండే సింగమ నేనిని వేసేవారు. సింగమనేని నారాయణ గొప్ప కథకుడే కాదు, విమర్శకుడు కూడా. కథావరణం, సంభాషణ, మున్నుడి, పరిమితం, మధు రాంతక రాజారాం లాంటి విమర్శన గ్రం«థాలు రాశాడు. చాసో, కేతు, రారా వంటి వారిపై గొప్ప విమర్శనా వ్యాసాలు రాశాడు. ఆయన కథలు ‘నీకూ నాకూ మధ్య నిశీధి’, ‘జీవఫలం చేదునిజం’, ‘జూదం’, ‘అనంతం’, ‘సింగమ నేని కథలు’ సంపుటాలుగా వచ్చాయి. ఆయన రాసినవి మొత్తం నాలుగు డజన్లు దాటక పోయినా ‘జూదం’, ‘తరగతి గదిలో తల్లి’ రెండు చాలు ఆయన్ని సమకాలీన కథకుల్లో అగ్రశ్రేణికి చేర్చటానికి. అనేకమంది ప్రముఖ రచయితల రచన లకు తను ముందుమాటలు రాసినా, తన రచనలకు మాత్రం సాధారణమైన స్నేహితుల చేత ముందుమాట రాయించుకున్న ‘పరిమి తుడు’. ఆయన కథని చదవటం ద్వారా పాఠ కుడు ఎంత ఆస్వాదిస్తాడో, వర్ధమాన రచ యిత కథ ఎలా రాయాలో అంత తెల్సు కుంటాడు. అనంతపురం జిల్లా కరువుని, నీళ్ళులేని సాగుని, ముఠాకక్షల స్వరూప స్వభావాల్ని ప్రపంచానికి చూపగలిగాడు. అనేక కథా సంకలనాలకు సంపాదక బాధ్యత వహించాడు. ప్రసిద్ధ సంస్థలకు కథల పోటీల న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. తెలుగులో కథల కోసం ఒక స్కూలు నడపాలన్నా, ఒక అకాడమీ పెట్టాలన్నా దానికి ప్రిన్సిపాల్‌గా ఉండే యోగ్యత ఉన్న ఒకే ఒక్కడు సింగమ నేని. రచన వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే సిద్ధాంతం ప్రబలంగానే వుంది. ప్రగతిశీల విప్లవ వాదాల్ని రచనల్లో ప్రవచిస్తూనే, ఒకనొక ప్రముఖుడు హస్తసాముద్రికాన్ని, జ్యోతి ష్యాన్ని నమ్ముతానన్నాడు. అంతకంటే ప్రము ఖుడైన మరో ప్రగతిశీలి దయ్యాల్ని, భూతాల్ని, పునర్జన్మల్ని నమ్ముతానన్నాడు. యజ్ఞోపవీ తాన్ని ధరిస్తూ విప్లవ ప్రవచనాల్ని చెప్పిన వారూ వున్నారు. ఈ కోవకు చెందక రచనా, రచయితా ఒకే కుదురు నుండి జనించినట్లు కన్పించే అరుదైన వ్యక్తుల్లో సింగమనేని ఒకరు. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం నుండే ప్రతి రచననూ ఆవిష్కరించిన నిబద్ధుడు. ఎప్పుడో చిన్న వయస్సులో పడిన తరిమెల నాగిరెడ్డి ప్రభావాన్ని చివరి క్షణం వరకు నిలుపుకొని, రచనల్లో సామాజిక ప్రయోజనాన్ని కాంక్షిం చటమే కాదు జీవితంలోనూ ఆ విలువల్ని నిలుపుకున్నాడు. అనంతపురం వెళ్ళిన సాహితీవేత్తలు, స్నేహితులు ఆయన ఇంట ఆతిథ్యం అందు కోకుండా రావటం అసాధ్యం. వారి శ్రీమతి గోవిందమ్మ ఆయనను మించిన అతిథేయ. మర్యాద, మంచి తనాల్ని కూడా భరించటం కష్టమైన పనే అని వాళ్లింట్లోనే అర్థమవుతుంది. అనంతపురం వెళ్ళిన ప్రతిసారీ ఒకటే ఫోన్లు. తినటానికి ఏమీ పెట్టమంటేనే వస్తాననే షర తుపై అంగీకారం కుదిరినా ఏనాడూ వాళ్ళు మాటపై నిలబడలేదు. సింగమనేని పూర్తిపేరు సింగమనేని నారాయణ చౌదరి. కులాన్ని స్ఫురింపజేసే ‘చౌదరి’ని తొలగించుకున్నాడు. అనంతపురం జిల్లా మారూరుబండ మీద పల్లెలో 26–6– 1943న జన్మించిన సింగమనేని 25–2– 2021న తన 78వ యేట కథను ఒంటరి చేసి వెళ్ళి పోయాడు. కానీ తెలుగు కథ ఉన్నంత కాలం ఉంటాడు. రచయిత చెరుకూరి సత్యనారాయణ, న్యాయవాది -
‘అనంత’ సాహితీ ‘సింగం’
- అభ్యుదయ భావజాల రచనలకు దిక్సూచి సింగమనేని అనంతపురం కల్చరల్ : కాల్పనిక జగత్తులో ఊగిసిలాడుతున్న ‘అనంత’ సాహిత్యాన్ని గతితర్క భౌతికవాద భావజాలంతో మలుపు తిప్పిన రచయిత సింగమనేని నారాయణ. మహాకవులు గురజాడ, శ్రీశ్రీలను సింగమనేని చదివినంతగా మరొకరు అర్థం చేసుకోలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఏకకాలంలో మనసును ఆహ్లాదపరుస్తూ, బుద్ధిని వికసింపజేస్తూ..ప్రతివారినీ ఆలోచింపచేయగల్గిన రచనా నిబద్ధత కల్గిన సింగమనేని నారాయణ 1943లో రాప్తాడు మండలం మరూరు బండపల్లి గ్రామంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జన్మించారు. చిన్నవయసులోనే రచనా వ్యాసంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 19 ఏళ్ల వయసులో ‘ఆదర్శాలు – అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీ’ నవలలను రచించారు. అనతికాలంలోనే కాల్పనిక రచనల వల్ల సమాజానికి ప్రయోజనం కల్గించేదేది లేదని గ్రహించిన ఆయన జూదం, అనంతం, సింగమనేని కథలు, నీకు నాకు మధ్య నిశీధి, జీవఫలం వంటి కథలను వినూత్న శైలితో రచించి రాష్ట్రస్థాయి రచయితల సరసన చేరిపోయారు. ఇక ఆయన రాసిన ‘సమయము– సందర్భము’, ‘సంభాషణం’, ‘మాతృభాషే ఎందుకు చదవాలి?’ మొదలైన వందల కొద్దీ వ్యాసాలు ఎంతో మంది యువ రచయితలకు స్పూర్తిని కల్గించాయి. వరించిన పురస్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, ఉరిపండ అప్పలస్వామి పురస్కారంతో పాటు పదుల సంఖ్యలో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. ‘కళారత్న’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుని జిల్లా కీర్తిని పెంచారు. ఆయన రచనలపై వివిధ వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయించి డాక్టరేట్లు ప్రకటించాయి. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సింగమనేని కథలు అనువాదమై పలు రాష్ట్రాలలో పాఠ్యాంశాలుగా మారాయి. రైతు జీవితానికి అండగా.. ప్రభుత్వాలు గ్రామీణ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, పెట్టుబడిదారుల జేబులు నింపడానికే పాలననంతా కేంద్రీకరిస్తున్నారన్న స్పృహతో సాగిన రచనలు సంచలనాలయ్యాయి. ఎటువంటి అభిప్రాయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగలడం వల్లే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లోని సాహిత్యంతో అనుబంధముంది. ప్రపంచీకరణ పేరుతో ప్రవేశపెడుతున్న విషసంస్కృతిని పరిహరిస్తూ ఆయన రాసిన అనేక రచనలు ప్రభుత్వాలకు చక్కటి పరిష్కార మార్గాలను వెతికిపెట్టాయి. రైతు లేకుంటే బతుకే లేదు ‘‘జీవితం పట్ల విలక్షణ దృక్పథం.. విస్తృత అవగాహన.. అనుమాన అనురక్తి ఎవరికైనా ఉండాలి. అవన్నీ నాలో సజీవ సహచర్యం చేయడానికి గురజాడ, శ్రీశ్రీ రచనలు ఎంతగానో తోడ్పడ్డాయి. చిన్నవయసు నుండే సమాజాన్ని సున్నితంగా గమనిస్తుండడం వల్ల అనుకుంటా రైతు లేని రాజ్యాన్ని చూడబోతున్నామన్న ఆందోళన నాకు ఎప్పుడూ కల్గుతూనే ఉంటుంది. ప్రభుత్వ విధానాలు పూర్తిగా భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తున్నాయి. భూమితల్లిని నమ్ముకున్న రైతులు వృత్తిని మానుకోకముందే అందరూ కళ్లు తెరవాలి. రైతు లేకుంటే బ్రతుకే లేదన్న స్పృహ అందరి ఉండాలన్నదే నా రచనల ధ్యేయం’’. - సింగమనేని నారాయణ -
రైతు కథకుడు
చైతన్యం సంక్రాంతి అంటే రైతు పండగ. రైతు సంబరాలు చేసుకునే పండగ. కాని కంటికి కనిపించే ఆ దృశ్యం వెనుక కనిపించని గాథలను అక్షరబద్ధం చేసిన కథకులు ఉన్నారు. లోకాన్ని తట్టిలేపిన వారున్నారు. అలాంటివారిలో ముఖ్యులు - సింగమనేని నారాయణ. కొన్ని కథలు విన్నంతసేపే గుర్తుంటాయి. కొన్ని మనస్సును గిలిగింతలు పెడుతూ పొద్దో అరపొద్దో అంటిపెట్టుకొని ఉంటాయి. ఇంకొన్ని కథలు పాఠకుణ్ని రోమాంచితుణ్ణి చేసి రోజుల తరబడి వెంటాడతాయి. కానీ, కొన్ని కథలు - పాఠకుల ప్రశాంతతను భగ్నంచేసి, వాళ్ల మెదళ్లను గీరి అక్కడ గూడుకట్టి, గుడ్లుపెట్టి, పొదిగి, తమలాంటి పిల్లల్ని లేపేదాకా కదలవు. అవి పునరుత్పత్తి శక్తి కలిగిన కథలు. అలాంటి శక్తి సామర్థ్యాలున్న కథలు రాసిన కథకుడు సింగమనేని నారాయణ. రాయలసీమ రైతుల సంక్షోభాన్ని ఆలోచించ ప్రయత్నించే ప్రతి కథకునికీ బైబిల్, ఖురాన్‌లాంటి కథలు ఈయనవి. ఆధునిక భారతంలో రైతును కీర్తించడం ఎక్కువైంది. అతణ్ణి దేశభారాన్ని అలవోకగా మోసేవాడుగా శ్లాఘించటం, అతని శ్రమను సౌందర్యంగా కవిత్వీకరించటం, చెమట బిందువుల్ని సుందరీకరించటం అక్షర జీవులకు అలవాటయ్యింది. వాస్తవానికి - రైతు జీవితం సౌందర్యవంతమైంది కాదు. సుఖాలతో కూడుకొన్నది ఎంత మాత్రమూ కాదు. అనాది నుంచీ అది వేదనామయమే. ఈ నిజాన్ని గొంతెత్తి కేకలేసి చెప్పేందుకు రైతుల్లోంచీ, రైతు కూలీల్లోంచీ, అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన సింగమనేనిలాంటి కథకుల వల్లే సాధ్యమైంది. వ్యవసాయం ఆయన మతం. దాని పతనానికి హేతువులు ఆయన వ్యథ. దాని వెనుక ఉన్న ఎన్నో విషయాల్ని ఆయన వెలికి తీసినవాడు. ఆయన ప్రతీ కథ - ‘కరువునేల చెక్కిలి మీది కన్నీటి చారికల్ని తుడిచే ప్రయత్నం!’ సింగమనేని కథలు చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సాధారణమైన విషయాలు, ఇంతటి బీద విషయాలు, యీ మట్టి సంగతులు కూడా కథలవుతాయా? వ్యవసాయ ఋణాల్ని తీర్చాలని తెగ ప్రయాసపడే ఒక రైతుకు సంబంధించిన ఒకటి రెండు రోజుల దినచర్య కూడా కథ అవుతుందా? ఎండిపోయిన బావిలో అరవై అడుగులు బోరు దించినా సుద్దపొడి తప్ప నీళ్లు పడక, భార్య మెడలో బంగారు గొలుసు మాయమైనా దప్పిక తీరక, ఇంటికొచ్చేసరికి - పనికిమాలిన నీళ్ల మోటారు నిలువెత్తు కరెంటు బిల్లు వచ్చి ఉక్కిరిబిక్కిరి అయిన రైతు బాధల్ని కూడా కథగా రాయొచ్చా? ఎసట్లోకి గింజలులేక, ఊర్లో బదుళ్లు దొరక్క, అంగట్లో అప్పు పుట్టక, ఇన్నేళ్లూ నమ్ముకొన్న వ్యవసాయమే యీ కష్టాలన్నింటికీ కారణమని తెలిసి, దాన్ని వదలి రోడ్డు పనిలో కూలీగా మారటానికి ఓ రైతు నిర్ణయించు కోవటమూ ఓ కథేనా. పొలం తప్ప మరో ప్రపంచం తెలీని రైతు మేఘాలను బుజ్జగించీ, పాతాళ గంగను బతిమాలీ, చీడపీడల్ని అదిలించీ, చీనీచెట్ల తలపైన రెండు చేతుల్నీ అడ్డుంచి కాపాడి, పంటను కోసి మార్కెట్టుకు తరలిస్తే, అక్కడి దళారుల మాయాజాలం అతని నెత్తిన అరచేతుల్ని పెట్టి నిలువుదోపిడీ చేస్తూ, పెట్టిన పెట్టుబడి కూడా రాని స్థితిలో ఇంటికొచ్చి, ఆ ఆక్రోశాన్ని చీనీచెట్ల మీద చూపి, వాటిని నిలువునా నరికిస్తే తప్ప బతకలేమనే నిర్ణయానికి రావటం కూడా కథేనా? అవును కథే. శక్తిమంతమైన కథ. ఆంధ్రదేశాన్ని ఊపేసిన కథ. అది సింగమనేని కథ. ఇవే కాదు, ఇలాంటి వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు ఎన్నో సింగమనేని కలం చేతిలో కథలయ్యాయి. కథలు కావటం కాదు - ఎందరో కథకుల్ని తయారు చేశాయి. తను పుట్టుకొచ్చిన మట్టిని ప్రేమించటం, తన బతుకు చుట్టూ అల్లుకొన్న జీవితాల్ని ప్రేమించటం, అప్పులతో కుమిలిపోతూ వున్న వాళ్ల బతుకుల్ని అర్థం చేసుకోవటం, భూమి దుఃఖాన్ని ఆర్తిగా వినటం, మట్టి గొంతుకలకు తోడుగా గొంతెత్తటం, వర్షాధార వ్యవసాయ నేలలపై రాజ్యవివక్షను నిర్మొహమాటంగా ఎండగట్టడం, మార్కెట్టు మాయాజాలంపై ఆగ్రహించటం వగైరా విషయాల్ని సింగమనేని కథలు పాఠకులకు నేర్పాయి. ఎప్పుడో 1978లోనే ‘రైతు జీవితం అప్పులమయం’ అని ఎలుగెత్తి ఆక్రోశించారు సింగమనేని. ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా ‘రైతు జీవితం ఆత్మహత్యలమయం’ అని ఏడ్చుకోవలసి వస్తోంది. సింగమనేని కథల నిండా భూమి దుఃఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురవుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వెతకటంలో, పరిష్కారాల్ని సూచించటంలో సింగమనేని అవగాహన మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆయన వ్యక్తీకరించిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి. ఇతర ప్రాంతాలవాళ్లు సీమ మనుషుల మీదా, నేల మీదా, నీళ్ల మీదా, సంస్కృతుల మీదా ఏర్పరచుకొన్న అపోహలను తొలగిస్తూ, యీ గడ్డ మీది తొంభై శాతం జనాభా ఎలా బతుకుతున్నారో తెలిపే దృశ్యమాలికలు సింగమనేని కథలు. కేవలం కథలు రాసి వూరుకోలేదు ఆయన. రైతు కోసం ఉద్యమించారు. దేశమంతా తిరిగారు. సీమ జనజీవన దృశ్యాల్ని సీమేతర ప్రాంతాలవారికి స్పష్టంగా చూపించారు. నాకనిపిస్తుంది - ఆయన రాసినదానికంటే రచయితల్ని ప్రేరేపించిందే ఎక్కువని. ఆయన రాసిన పది పేజీల ‘జూదం’ కథ చదివి పాఠకుడు దిగ్భ్రాంతికి గురై ఆ నేల మీదా, ఆ మనుషుల మీదా అంతులేని సానుభూతిని చూపించి ఉండొచ్చు. కానీ ఆయన ముందు చెవి ఒగ్గితే జూదం కథల్లాంటివి వంద పేజీలు వినొచ్చు. కథల్లో కన్పించని ఎన్నో కొత్త అంశాలు ఆయన మాటల్లో మనకు విన్పిస్తాయి. ఆయన తను రాసిందానికంటే - సహ రచయితల కోసం మిగిల్చిందే ఎక్కువ. ఆయనతో నాలుగు మాటలు మాట్లాడితే ఒక కథకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రోజు గడిపితే ఒక నవలకు వస్తువు సిద్ధం చేసుకోవచ్చు. రైతు గురించి ఆయన మాట్లాడని రోజు లేదు. సింగమనేని ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా చదివారు. పురాణాల్ని, ప్రబంధాల్ని బాగా అధ్యయనం చేశారు. శ్రీశ్రీని ఔపోశన పట్టారు. చలం, కొకు, బుచ్చిబాబు లాంటి రచయితల్ని లోతుగా పరిశీలించారు. కానీ ఆయన కలాన్ని వీళ్ల ఆత్మలు ఎక్కడా అంటుకోలేదు. ఎక్కడా అనవసరంగా ఒక్క వాక్యం కవితాత్మకం కాలేదు. ఒక్క పేరా అదనంగా వచ్చి కూచోలేదు. కొసమెరుపులో నడుమ ఉరుములో పాఠకుల కోసం చేర్చబడలేదు. ఆయన శైలి నిరాడంబరం. ఆయన వచనం నిరలంకారం. ఆయన కథంతా చదివితే రాయలసీమ మెట్టనేలల మీద నడచినంత సహజంగా ఉంటుంది. ఆయన వాక్యం ఇక్కడి రైతు నడకలా ఉంటుంది. నేలను దున్నుకొంటూ పోతోన్న నాగలిలా ఉంటుంది. ఆయన కథల్లోకి ప్రవేశిస్తే ఆ విషయం ప్రతి పాఠకుడికీ అర్థమవుతుంది. - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సింగమనేని కథలు విశాలాంధ్రలో దొరుకుతాయి. ఆయన నం. 9493423442