రైతు కథకుడు | Singamaneni Narayana.. Farmer's poet | Sakshi
Sakshi News home page

రైతు కథకుడు

Published Mon, Jan 13 2014 12:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతు కథకుడు - Sakshi

రైతు కథకుడు

  చైతన్యం
             
 సంక్రాంతి అంటే రైతు పండగ. రైతు సంబరాలు చేసుకునే పండగ.  కాని కంటికి కనిపించే ఆ దృశ్యం వెనుక కనిపించని గాథలను అక్షరబద్ధం చేసిన కథకులు ఉన్నారు. లోకాన్ని తట్టిలేపిన వారున్నారు. అలాంటివారిలో ముఖ్యులు
 
  - సింగమనేని నారాయణ.
 
 కొన్ని కథలు విన్నంతసేపే గుర్తుంటాయి. కొన్ని మనస్సును గిలిగింతలు పెడుతూ పొద్దో అరపొద్దో అంటిపెట్టుకొని ఉంటాయి. ఇంకొన్ని కథలు పాఠకుణ్ని రోమాంచితుణ్ణి చేసి రోజుల తరబడి వెంటాడతాయి. కానీ, కొన్ని కథలు - పాఠకుల ప్రశాంతతను భగ్నంచేసి, వాళ్ల మెదళ్లను గీరి అక్కడ గూడుకట్టి, గుడ్లుపెట్టి, పొదిగి, తమలాంటి పిల్లల్ని లేపేదాకా కదలవు. అవి పునరుత్పత్తి శక్తి కలిగిన కథలు. అలాంటి శక్తి సామర్థ్యాలున్న కథలు రాసిన కథకుడు సింగమనేని నారాయణ. రాయలసీమ రైతుల సంక్షోభాన్ని ఆలోచించ ప్రయత్నించే ప్రతి కథకునికీ బైబిల్, ఖురాన్‌లాంటి కథలు ఈయనవి.
 
 ఆధునిక భారతంలో రైతును కీర్తించడం ఎక్కువైంది. అతణ్ణి దేశభారాన్ని అలవోకగా మోసేవాడుగా శ్లాఘించటం, అతని శ్రమను సౌందర్యంగా కవిత్వీకరించటం, చెమట బిందువుల్ని సుందరీకరించటం అక్షర జీవులకు అలవాటయ్యింది. వాస్తవానికి - రైతు జీవితం సౌందర్యవంతమైంది కాదు. సుఖాలతో కూడుకొన్నది ఎంత మాత్రమూ కాదు. అనాది నుంచీ అది వేదనామయమే. ఈ నిజాన్ని గొంతెత్తి కేకలేసి చెప్పేందుకు రైతుల్లోంచీ, రైతు కూలీల్లోంచీ, అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన సింగమనేనిలాంటి కథకుల వల్లే సాధ్యమైంది.  వ్యవసాయం ఆయన మతం. దాని పతనానికి హేతువులు ఆయన వ్యథ. దాని వెనుక ఉన్న ఎన్నో విషయాల్ని ఆయన వెలికి తీసినవాడు. ఆయన ప్రతీ కథ - ‘కరువునేల చెక్కిలి మీది కన్నీటి చారికల్ని తుడిచే ప్రయత్నం!’
 
 సింగమనేని కథలు చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సాధారణమైన విషయాలు, ఇంతటి బీద విషయాలు, యీ మట్టి సంగతులు కూడా కథలవుతాయా? వ్యవసాయ ఋణాల్ని తీర్చాలని తెగ ప్రయాసపడే ఒక రైతుకు సంబంధించిన ఒకటి రెండు రోజుల దినచర్య కూడా కథ అవుతుందా? ఎండిపోయిన బావిలో అరవై అడుగులు బోరు దించినా సుద్దపొడి తప్ప నీళ్లు పడక, భార్య మెడలో బంగారు గొలుసు మాయమైనా దప్పిక తీరక, ఇంటికొచ్చేసరికి - పనికిమాలిన నీళ్ల మోటారు నిలువెత్తు కరెంటు బిల్లు వచ్చి ఉక్కిరిబిక్కిరి అయిన రైతు బాధల్ని కూడా కథగా రాయొచ్చా?  ఎసట్లోకి గింజలులేక, ఊర్లో బదుళ్లు దొరక్క, అంగట్లో అప్పు పుట్టక, ఇన్నేళ్లూ నమ్ముకొన్న వ్యవసాయమే యీ కష్టాలన్నింటికీ కారణమని తెలిసి, దాన్ని వదలి రోడ్డు పనిలో కూలీగా మారటానికి ఓ రైతు నిర్ణయించు కోవటమూ ఓ కథేనా.  పొలం తప్ప మరో ప్రపంచం తెలీని రైతు మేఘాలను బుజ్జగించీ, పాతాళ గంగను బతిమాలీ, చీడపీడల్ని అదిలించీ, చీనీచెట్ల తలపైన రెండు చేతుల్నీ అడ్డుంచి కాపాడి, పంటను కోసి మార్కెట్టుకు తరలిస్తే, అక్కడి దళారుల మాయాజాలం అతని నెత్తిన అరచేతుల్ని పెట్టి నిలువుదోపిడీ చేస్తూ, పెట్టిన పెట్టుబడి కూడా రాని స్థితిలో ఇంటికొచ్చి, ఆ ఆక్రోశాన్ని చీనీచెట్ల మీద చూపి, వాటిని నిలువునా నరికిస్తే తప్ప బతకలేమనే నిర్ణయానికి రావటం కూడా కథేనా? అవును కథే. శక్తిమంతమైన కథ. ఆంధ్రదేశాన్ని ఊపేసిన కథ. అది సింగమనేని కథ.
 
 ఇవే కాదు, ఇలాంటి వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు ఎన్నో సింగమనేని కలం చేతిలో కథలయ్యాయి. కథలు కావటం కాదు - ఎందరో కథకుల్ని తయారు చేశాయి. తను పుట్టుకొచ్చిన మట్టిని ప్రేమించటం, తన బతుకు చుట్టూ అల్లుకొన్న జీవితాల్ని ప్రేమించటం, అప్పులతో కుమిలిపోతూ వున్న వాళ్ల బతుకుల్ని అర్థం చేసుకోవటం, భూమి దుఃఖాన్ని ఆర్తిగా వినటం, మట్టి గొంతుకలకు తోడుగా గొంతెత్తటం, వర్షాధార వ్యవసాయ నేలలపై రాజ్యవివక్షను నిర్మొహమాటంగా ఎండగట్టడం, మార్కెట్టు మాయాజాలంపై ఆగ్రహించటం వగైరా విషయాల్ని సింగమనేని కథలు పాఠకులకు నేర్పాయి.
 
 ఎప్పుడో 1978లోనే ‘రైతు జీవితం అప్పులమయం’ అని ఎలుగెత్తి ఆక్రోశించారు సింగమనేని. ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా ‘రైతు జీవితం ఆత్మహత్యలమయం’ అని ఏడ్చుకోవలసి వస్తోంది. సింగమనేని కథల నిండా భూమి దుఃఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురవుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వెతకటంలో, పరిష్కారాల్ని సూచించటంలో సింగమనేని అవగాహన మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆయన వ్యక్తీకరించిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి. ఇతర ప్రాంతాలవాళ్లు సీమ మనుషుల మీదా, నేల మీదా, నీళ్ల మీదా, సంస్కృతుల మీదా ఏర్పరచుకొన్న అపోహలను తొలగిస్తూ, యీ గడ్డ మీది తొంభై శాతం జనాభా ఎలా బతుకుతున్నారో తెలిపే దృశ్యమాలికలు సింగమనేని కథలు.
 
 కేవలం కథలు రాసి వూరుకోలేదు ఆయన. రైతు కోసం ఉద్యమించారు. దేశమంతా తిరిగారు. సీమ జనజీవన దృశ్యాల్ని సీమేతర ప్రాంతాలవారికి స్పష్టంగా చూపించారు.  నాకనిపిస్తుంది - ఆయన రాసినదానికంటే రచయితల్ని ప్రేరేపించిందే ఎక్కువని. ఆయన రాసిన పది పేజీల ‘జూదం’ కథ చదివి పాఠకుడు దిగ్భ్రాంతికి గురై ఆ నేల మీదా, ఆ మనుషుల మీదా అంతులేని సానుభూతిని చూపించి ఉండొచ్చు. కానీ ఆయన ముందు చెవి ఒగ్గితే జూదం కథల్లాంటివి వంద పేజీలు వినొచ్చు. కథల్లో కన్పించని ఎన్నో కొత్త అంశాలు ఆయన మాటల్లో మనకు విన్పిస్తాయి. ఆయన తను రాసిందానికంటే - సహ రచయితల కోసం మిగిల్చిందే ఎక్కువ. ఆయనతో నాలుగు మాటలు మాట్లాడితే ఒక కథకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రోజు గడిపితే ఒక నవలకు వస్తువు సిద్ధం చేసుకోవచ్చు. రైతు గురించి ఆయన మాట్లాడని రోజు లేదు.
 
 సింగమనేని ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా చదివారు. పురాణాల్ని, ప్రబంధాల్ని బాగా అధ్యయనం చేశారు. శ్రీశ్రీని ఔపోశన పట్టారు. చలం, కొకు, బుచ్చిబాబు లాంటి రచయితల్ని లోతుగా పరిశీలించారు. కానీ ఆయన కలాన్ని వీళ్ల ఆత్మలు ఎక్కడా అంటుకోలేదు. ఎక్కడా అనవసరంగా ఒక్క వాక్యం కవితాత్మకం కాలేదు. ఒక్క పేరా అదనంగా వచ్చి కూచోలేదు. కొసమెరుపులో నడుమ ఉరుములో పాఠకుల కోసం చేర్చబడలేదు. ఆయన శైలి నిరాడంబరం. ఆయన వచనం నిరలంకారం. ఆయన కథంతా చదివితే రాయలసీమ మెట్టనేలల మీద నడచినంత సహజంగా ఉంటుంది. ఆయన వాక్యం ఇక్కడి రైతు నడకలా ఉంటుంది. నేలను దున్నుకొంటూ పోతోన్న నాగలిలా ఉంటుంది.  ఆయన కథల్లోకి ప్రవేశిస్తే ఆ విషయం ప్రతి పాఠకుడికీ అర్థమవుతుంది.

 - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

 సింగమనేని కథలు విశాలాంధ్రలో దొరుకుతాయి. ఆయన నం. 9493423442
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement