Sannapureddy Venkatarami Reddy
-
జీవనారణ్యంలో సాహసయాత్ర
తానా నవలల పోటీలో రెండు లక్షల బహుమతి గెలుచుకున్న సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’కు జంపాల చౌదరి రాసిన ముందుమాటలోంచి కొంతభాగం: దట్టమైన అడవిలో కొండలమీద చెట్లకింద పడుకున్న అనుభవం నాకు లేదు. అప్పుడప్పుడూ అడవులగుండా ప్రయాణం చేసినా, కారు అద్దాల భద్రత వెనుక నుండే నేను అడవిని చూసింది. నాకు తెలిసినవారిలోనూ అడవిలో బతికిన అనుభవం ఉన్న వాళ్లు తక్కువ. కానీ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పటికీ, తెలుగుదేశంలో కొంతమంది మధ్యతరగతి మనుషులు తమ మీద ఆధారపడిన జీవాలను బతికించుకోవడానికి తమ గ్రామాలు విడిచి, కొన్ని నెలలపాటు అడవుల్లో సంచారం చేస్తూ, వందలయేళ్లకు ముందు తమ పూర్వీకులు బతికినట్టు బతకవలసి వస్తుందని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది. నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. కొన్ని తరాలుగా ఈ గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇలా తరచు కొండపొలం పోవలసి రావటం తప్పకపోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవనవిధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తుపట్టగలగాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ నిత్యజీవిత సాహసయాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది ఈ కొండపొలం నవల. ఈ సాహసయాత్రలో మనం వందలాది గొర్రెలను కాచుకొంటూ ఓబిలం (అహోబిలం) చుట్టుపక్కల పల్లెలపాయ, బింగోని బావి, గద్దగూడుకొండ, చింతల సడ్డు, ఇనప సరూట్లు, రేగిమానుకొండ, గాలికుప్ప, తుమ్మమాని ఏనె, మబ్బుసెల, రాసాల చేను, పెద్దపులి సెల, దొంగ చెలిమ, కులుకుడు గుండాలు, జివ్విమాను బండ, ఒన్నూరమ్మ కోట, బాలప్పబావి వంటి ప్రాంతాలు తిరుగుతాము. అక్కడి బోడులు, మిట్టలు, పేటలు, కొండలు, ఏనెలు, సెలలు, వాగులు, వంకలు మనకు పరిచయమౌతాయి. భిల్లు, చందనం, ఏపె, సీకరేణి, సిరిమాను, పొలికె, తాండ్ర, మద్ది, సండ్ర వంటి రకరకాల చెట్లను చూస్తాము. పరిక్కాయ, ఈతకాయ, టూకీపండు, మోవిపండుల రుచులు తెలుస్తాయి. కొండల పైన, సెలలలోన మొలిచే అనేక రకాల గడ్డి మనకు కనిపిస్తుంది. నేండ్రగడ్డి కనిపిస్తే గొర్రెలు దబ్బగోగడిని, పీచుగోగడిని, బొచ్చుగడ్డినీ మూచూడవని గమనిస్తాము. ఎడుగండు ఎదురుపడితే గట్టిగా హడలుకొడితే చాలని, కానీ పెద్దపులి అలా జడవదని, మనమే దూరంగా తప్పుకోవాలని మన అనుభవానికి వస్తుంది. ముచ్చుగొర్రెకూ, బొల్లిగొర్రెకూ తేడా తెలుస్తుంది. మందలో కారుపొట్టేలు, దొడ్డిపొట్టేలు, తలపొట్టేళ్ల తరతమ స్థానాలు అర్థమవుతాయి. ఎదగొర్రెల యవనదశల వెంపర్లాటే కాదు; కొండచిలువల ప్రణయ కాండ గురించి కూడా తెలుస్తుంది. ఆధునిక సాహిత్యంలో పశుపోషణ ముఖ్యాంశంగా ఉన్న కథలు, నవలలు తక్కువ. ఉన్న కొద్ది కథల్లోనూ వ్యవసాయానికి అవసరమైన పశువుల (ఎద్దుల) ప్రసక్తే ఎక్కువ. మన ప్రాంతాల్లోనూ, ప్రపంచపు నలుమూలల సంస్కృతులలోనూ కనిపించే గొర్రెల గురించి, గొర్రెలకాపరుల జీవితాల గురించి తెలుగులో వ్రాసినది తక్కువ. అలాగే తెలుగులో అడవి ముఖ్యపాత్రగా ఉండే పుస్తకాలూ తక్కువే; ఉన్నకొద్ది కూడా గిరిజనుల జీవితాల గురించి లేక నక్సలైటు ఉద్యమం గురించి రాసినవే. ఈ రెండు వస్తువులనీ కలుపుకొంటూ ఒక ప్రత్యేక జీవనపోరాటాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. -జంపాల చౌదరి -
సాహితీ కృషీవలుడు సన్నపురెడ్డి
సాక్షి, కడప : జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ‘కొండపొలం’ నవలకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అవార్డు ప్రకటించింది. 2019 సంవత్సరానికిగాను ప్రకటించిన నవలల పోటీలో ఆయన నవలను ప్రత్యేక న్యాయ నిర్ణేతల కమిటీ బహుమతికి ఎంపిక చేశారు. బహుమతిగా రూ. 2 లక్షల మొత్తాన్ని ప్రకటించారు. ఇంతవరకు పోటీలు నిర్వహించిన ఏ సంస్థ తెలుగు నవలకు ఇంత పెద్ద మొత్తాన్ని బహుమతిగా ఇవ్వలేదు. త్వరలో ఆయనకు ఈ బహుమతి అందజేయడడంతోపాటు బహుమతి పొందిన నవలను కూడా ప్రచురించనున్నారు. కథా సాహితీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచేగాకఅమెరికా నుంచి 58 నవలలు అందాయి. న్యాయ నిర్ణేతలు పలుమార్లు నవలలను వడపోసి బహుమతికి సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నవల కొండపొలంను ఎంపిక చేశారు. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లాలోని బాలరాజుపల్లెలో 1963 ఫిబ్రవరి 16న జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు పాఠాలు బోధించడంతోపాటు స్వగ్రామం నుంచి సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎనిమిది నవలలు, మూడు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి రాశారు. 2017లో తానా నవలల పోటీలో ఈయన రచించిన ‘ఒంటరి’కి బహుమతి లభిం చింది. మొదటి నవల ‘కాడి’కి, ‘తోలుబొమ్మలాట’లకు ఆటా పురస్కారాలు లభించాయి. ఆయన రచించిన మరికొన్ని నవలలు, ఇతర రచనలు, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సన్నపురెడ్డి రచించిన 75కు పైగా కథలు, వివిధ సంకలనాల్లో చోటుచేసుకోవడమే కాకుండా ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనకు ఈ బహుమతి లభించడం పట్ల జిల్లా సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండూరు పిచ్చమ్మ వెంకట్రాజు స్మారక ట్రస్టు, లలిత కళా నికేతన్, భూతపురి సుబ్రమణ్యం స్మారక ట్రస్టు, జానమద్ది సాహితీపీఠం, నారు నాగనార్య సాహితీపీఠం, పోతన సాహితీపీఠం, రాయలసీమ టూరిజం కల్చరల్ సొసైటీ ప్రతినిధులు సన్నపురెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
రైతు కథకుడు
చైతన్యం సంక్రాంతి అంటే రైతు పండగ. రైతు సంబరాలు చేసుకునే పండగ. కాని కంటికి కనిపించే ఆ దృశ్యం వెనుక కనిపించని గాథలను అక్షరబద్ధం చేసిన కథకులు ఉన్నారు. లోకాన్ని తట్టిలేపిన వారున్నారు. అలాంటివారిలో ముఖ్యులు - సింగమనేని నారాయణ. కొన్ని కథలు విన్నంతసేపే గుర్తుంటాయి. కొన్ని మనస్సును గిలిగింతలు పెడుతూ పొద్దో అరపొద్దో అంటిపెట్టుకొని ఉంటాయి. ఇంకొన్ని కథలు పాఠకుణ్ని రోమాంచితుణ్ణి చేసి రోజుల తరబడి వెంటాడతాయి. కానీ, కొన్ని కథలు - పాఠకుల ప్రశాంతతను భగ్నంచేసి, వాళ్ల మెదళ్లను గీరి అక్కడ గూడుకట్టి, గుడ్లుపెట్టి, పొదిగి, తమలాంటి పిల్లల్ని లేపేదాకా కదలవు. అవి పునరుత్పత్తి శక్తి కలిగిన కథలు. అలాంటి శక్తి సామర్థ్యాలున్న కథలు రాసిన కథకుడు సింగమనేని నారాయణ. రాయలసీమ రైతుల సంక్షోభాన్ని ఆలోచించ ప్రయత్నించే ప్రతి కథకునికీ బైబిల్, ఖురాన్లాంటి కథలు ఈయనవి. ఆధునిక భారతంలో రైతును కీర్తించడం ఎక్కువైంది. అతణ్ణి దేశభారాన్ని అలవోకగా మోసేవాడుగా శ్లాఘించటం, అతని శ్రమను సౌందర్యంగా కవిత్వీకరించటం, చెమట బిందువుల్ని సుందరీకరించటం అక్షర జీవులకు అలవాటయ్యింది. వాస్తవానికి - రైతు జీవితం సౌందర్యవంతమైంది కాదు. సుఖాలతో కూడుకొన్నది ఎంత మాత్రమూ కాదు. అనాది నుంచీ అది వేదనామయమే. ఈ నిజాన్ని గొంతెత్తి కేకలేసి చెప్పేందుకు రైతుల్లోంచీ, రైతు కూలీల్లోంచీ, అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన సింగమనేనిలాంటి కథకుల వల్లే సాధ్యమైంది. వ్యవసాయం ఆయన మతం. దాని పతనానికి హేతువులు ఆయన వ్యథ. దాని వెనుక ఉన్న ఎన్నో విషయాల్ని ఆయన వెలికి తీసినవాడు. ఆయన ప్రతీ కథ - ‘కరువునేల చెక్కిలి మీది కన్నీటి చారికల్ని తుడిచే ప్రయత్నం!’ సింగమనేని కథలు చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సాధారణమైన విషయాలు, ఇంతటి బీద విషయాలు, యీ మట్టి సంగతులు కూడా కథలవుతాయా? వ్యవసాయ ఋణాల్ని తీర్చాలని తెగ ప్రయాసపడే ఒక రైతుకు సంబంధించిన ఒకటి రెండు రోజుల దినచర్య కూడా కథ అవుతుందా? ఎండిపోయిన బావిలో అరవై అడుగులు బోరు దించినా సుద్దపొడి తప్ప నీళ్లు పడక, భార్య మెడలో బంగారు గొలుసు మాయమైనా దప్పిక తీరక, ఇంటికొచ్చేసరికి - పనికిమాలిన నీళ్ల మోటారు నిలువెత్తు కరెంటు బిల్లు వచ్చి ఉక్కిరిబిక్కిరి అయిన రైతు బాధల్ని కూడా కథగా రాయొచ్చా? ఎసట్లోకి గింజలులేక, ఊర్లో బదుళ్లు దొరక్క, అంగట్లో అప్పు పుట్టక, ఇన్నేళ్లూ నమ్ముకొన్న వ్యవసాయమే యీ కష్టాలన్నింటికీ కారణమని తెలిసి, దాన్ని వదలి రోడ్డు పనిలో కూలీగా మారటానికి ఓ రైతు నిర్ణయించు కోవటమూ ఓ కథేనా. పొలం తప్ప మరో ప్రపంచం తెలీని రైతు మేఘాలను బుజ్జగించీ, పాతాళ గంగను బతిమాలీ, చీడపీడల్ని అదిలించీ, చీనీచెట్ల తలపైన రెండు చేతుల్నీ అడ్డుంచి కాపాడి, పంటను కోసి మార్కెట్టుకు తరలిస్తే, అక్కడి దళారుల మాయాజాలం అతని నెత్తిన అరచేతుల్ని పెట్టి నిలువుదోపిడీ చేస్తూ, పెట్టిన పెట్టుబడి కూడా రాని స్థితిలో ఇంటికొచ్చి, ఆ ఆక్రోశాన్ని చీనీచెట్ల మీద చూపి, వాటిని నిలువునా నరికిస్తే తప్ప బతకలేమనే నిర్ణయానికి రావటం కూడా కథేనా? అవును కథే. శక్తిమంతమైన కథ. ఆంధ్రదేశాన్ని ఊపేసిన కథ. అది సింగమనేని కథ. ఇవే కాదు, ఇలాంటి వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు ఎన్నో సింగమనేని కలం చేతిలో కథలయ్యాయి. కథలు కావటం కాదు - ఎందరో కథకుల్ని తయారు చేశాయి. తను పుట్టుకొచ్చిన మట్టిని ప్రేమించటం, తన బతుకు చుట్టూ అల్లుకొన్న జీవితాల్ని ప్రేమించటం, అప్పులతో కుమిలిపోతూ వున్న వాళ్ల బతుకుల్ని అర్థం చేసుకోవటం, భూమి దుఃఖాన్ని ఆర్తిగా వినటం, మట్టి గొంతుకలకు తోడుగా గొంతెత్తటం, వర్షాధార వ్యవసాయ నేలలపై రాజ్యవివక్షను నిర్మొహమాటంగా ఎండగట్టడం, మార్కెట్టు మాయాజాలంపై ఆగ్రహించటం వగైరా విషయాల్ని సింగమనేని కథలు పాఠకులకు నేర్పాయి. ఎప్పుడో 1978లోనే ‘రైతు జీవితం అప్పులమయం’ అని ఎలుగెత్తి ఆక్రోశించారు సింగమనేని. ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా ‘రైతు జీవితం ఆత్మహత్యలమయం’ అని ఏడ్చుకోవలసి వస్తోంది. సింగమనేని కథల నిండా భూమి దుఃఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురవుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వెతకటంలో, పరిష్కారాల్ని సూచించటంలో సింగమనేని అవగాహన మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆయన వ్యక్తీకరించిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి. ఇతర ప్రాంతాలవాళ్లు సీమ మనుషుల మీదా, నేల మీదా, నీళ్ల మీదా, సంస్కృతుల మీదా ఏర్పరచుకొన్న అపోహలను తొలగిస్తూ, యీ గడ్డ మీది తొంభై శాతం జనాభా ఎలా బతుకుతున్నారో తెలిపే దృశ్యమాలికలు సింగమనేని కథలు. కేవలం కథలు రాసి వూరుకోలేదు ఆయన. రైతు కోసం ఉద్యమించారు. దేశమంతా తిరిగారు. సీమ జనజీవన దృశ్యాల్ని సీమేతర ప్రాంతాలవారికి స్పష్టంగా చూపించారు. నాకనిపిస్తుంది - ఆయన రాసినదానికంటే రచయితల్ని ప్రేరేపించిందే ఎక్కువని. ఆయన రాసిన పది పేజీల ‘జూదం’ కథ చదివి పాఠకుడు దిగ్భ్రాంతికి గురై ఆ నేల మీదా, ఆ మనుషుల మీదా అంతులేని సానుభూతిని చూపించి ఉండొచ్చు. కానీ ఆయన ముందు చెవి ఒగ్గితే జూదం కథల్లాంటివి వంద పేజీలు వినొచ్చు. కథల్లో కన్పించని ఎన్నో కొత్త అంశాలు ఆయన మాటల్లో మనకు విన్పిస్తాయి. ఆయన తను రాసిందానికంటే - సహ రచయితల కోసం మిగిల్చిందే ఎక్కువ. ఆయనతో నాలుగు మాటలు మాట్లాడితే ఒక కథకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రోజు గడిపితే ఒక నవలకు వస్తువు సిద్ధం చేసుకోవచ్చు. రైతు గురించి ఆయన మాట్లాడని రోజు లేదు. సింగమనేని ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా చదివారు. పురాణాల్ని, ప్రబంధాల్ని బాగా అధ్యయనం చేశారు. శ్రీశ్రీని ఔపోశన పట్టారు. చలం, కొకు, బుచ్చిబాబు లాంటి రచయితల్ని లోతుగా పరిశీలించారు. కానీ ఆయన కలాన్ని వీళ్ల ఆత్మలు ఎక్కడా అంటుకోలేదు. ఎక్కడా అనవసరంగా ఒక్క వాక్యం కవితాత్మకం కాలేదు. ఒక్క పేరా అదనంగా వచ్చి కూచోలేదు. కొసమెరుపులో నడుమ ఉరుములో పాఠకుల కోసం చేర్చబడలేదు. ఆయన శైలి నిరాడంబరం. ఆయన వచనం నిరలంకారం. ఆయన కథంతా చదివితే రాయలసీమ మెట్టనేలల మీద నడచినంత సహజంగా ఉంటుంది. ఆయన వాక్యం ఇక్కడి రైతు నడకలా ఉంటుంది. నేలను దున్నుకొంటూ పోతోన్న నాగలిలా ఉంటుంది. ఆయన కథల్లోకి ప్రవేశిస్తే ఆ విషయం ప్రతి పాఠకుడికీ అర్థమవుతుంది. - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సింగమనేని కథలు విశాలాంధ్రలో దొరుకుతాయి. ఆయన నం. 9493423442