తానా నవలల పోటీలో రెండు లక్షల బహుమతి గెలుచుకున్న సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’కు జంపాల చౌదరి రాసిన ముందుమాటలోంచి కొంతభాగం:
దట్టమైన అడవిలో కొండలమీద చెట్లకింద పడుకున్న అనుభవం నాకు లేదు. అప్పుడప్పుడూ అడవులగుండా ప్రయాణం చేసినా, కారు అద్దాల భద్రత వెనుక నుండే నేను అడవిని చూసింది. నాకు తెలిసినవారిలోనూ అడవిలో బతికిన అనుభవం ఉన్న వాళ్లు తక్కువ. కానీ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పటికీ, తెలుగుదేశంలో కొంతమంది మధ్యతరగతి మనుషులు తమ మీద ఆధారపడిన జీవాలను బతికించుకోవడానికి తమ గ్రామాలు విడిచి, కొన్ని నెలలపాటు అడవుల్లో సంచారం చేస్తూ, వందలయేళ్లకు ముందు తమ పూర్వీకులు బతికినట్టు బతకవలసి వస్తుందని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది.
నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. కొన్ని తరాలుగా ఈ గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇలా తరచు కొండపొలం పోవలసి రావటం తప్పకపోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవనవిధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి.
ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తుపట్టగలగాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ నిత్యజీవిత సాహసయాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది ఈ కొండపొలం నవల.
ఈ సాహసయాత్రలో మనం వందలాది గొర్రెలను కాచుకొంటూ ఓబిలం (అహోబిలం) చుట్టుపక్కల పల్లెలపాయ, బింగోని బావి, గద్దగూడుకొండ, చింతల సడ్డు, ఇనప సరూట్లు, రేగిమానుకొండ, గాలికుప్ప, తుమ్మమాని ఏనె, మబ్బుసెల, రాసాల చేను, పెద్దపులి సెల, దొంగ చెలిమ, కులుకుడు గుండాలు, జివ్విమాను బండ, ఒన్నూరమ్మ కోట, బాలప్పబావి వంటి ప్రాంతాలు తిరుగుతాము. అక్కడి బోడులు, మిట్టలు, పేటలు, కొండలు, ఏనెలు, సెలలు, వాగులు, వంకలు మనకు పరిచయమౌతాయి. భిల్లు, చందనం, ఏపె, సీకరేణి, సిరిమాను, పొలికె, తాండ్ర, మద్ది, సండ్ర వంటి రకరకాల చెట్లను చూస్తాము.
పరిక్కాయ, ఈతకాయ, టూకీపండు, మోవిపండుల రుచులు తెలుస్తాయి. కొండల పైన, సెలలలోన మొలిచే అనేక రకాల గడ్డి మనకు కనిపిస్తుంది. నేండ్రగడ్డి కనిపిస్తే గొర్రెలు దబ్బగోగడిని, పీచుగోగడిని, బొచ్చుగడ్డినీ మూచూడవని గమనిస్తాము. ఎడుగండు ఎదురుపడితే గట్టిగా హడలుకొడితే చాలని, కానీ పెద్దపులి అలా జడవదని, మనమే దూరంగా తప్పుకోవాలని మన అనుభవానికి వస్తుంది. ముచ్చుగొర్రెకూ, బొల్లిగొర్రెకూ తేడా తెలుస్తుంది. మందలో కారుపొట్టేలు, దొడ్డిపొట్టేలు, తలపొట్టేళ్ల తరతమ స్థానాలు అర్థమవుతాయి. ఎదగొర్రెల యవనదశల వెంపర్లాటే కాదు; కొండచిలువల ప్రణయ కాండ గురించి కూడా తెలుస్తుంది.
ఆధునిక సాహిత్యంలో పశుపోషణ ముఖ్యాంశంగా ఉన్న కథలు, నవలలు తక్కువ. ఉన్న కొద్ది కథల్లోనూ వ్యవసాయానికి అవసరమైన పశువుల (ఎద్దుల) ప్రసక్తే ఎక్కువ. మన ప్రాంతాల్లోనూ, ప్రపంచపు నలుమూలల సంస్కృతులలోనూ కనిపించే గొర్రెల గురించి, గొర్రెలకాపరుల జీవితాల గురించి తెలుగులో వ్రాసినది తక్కువ. అలాగే తెలుగులో అడవి ముఖ్యపాత్రగా ఉండే పుస్తకాలూ తక్కువే; ఉన్నకొద్ది కూడా గిరిజనుల జీవితాల గురించి లేక నక్సలైటు ఉద్యమం గురించి రాసినవే. ఈ రెండు వస్తువులనీ కలుపుకొంటూ ఒక ప్రత్యేక జీవనపోరాటాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
-జంపాల చౌదరి
Comments
Please login to add a commentAdd a comment