Jampala Chowdary
-
జీవనారణ్యంలో సాహసయాత్ర
తానా నవలల పోటీలో రెండు లక్షల బహుమతి గెలుచుకున్న సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’కు జంపాల చౌదరి రాసిన ముందుమాటలోంచి కొంతభాగం: దట్టమైన అడవిలో కొండలమీద చెట్లకింద పడుకున్న అనుభవం నాకు లేదు. అప్పుడప్పుడూ అడవులగుండా ప్రయాణం చేసినా, కారు అద్దాల భద్రత వెనుక నుండే నేను అడవిని చూసింది. నాకు తెలిసినవారిలోనూ అడవిలో బతికిన అనుభవం ఉన్న వాళ్లు తక్కువ. కానీ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పటికీ, తెలుగుదేశంలో కొంతమంది మధ్యతరగతి మనుషులు తమ మీద ఆధారపడిన జీవాలను బతికించుకోవడానికి తమ గ్రామాలు విడిచి, కొన్ని నెలలపాటు అడవుల్లో సంచారం చేస్తూ, వందలయేళ్లకు ముందు తమ పూర్వీకులు బతికినట్టు బతకవలసి వస్తుందని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది. నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. కొన్ని తరాలుగా ఈ గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇలా తరచు కొండపొలం పోవలసి రావటం తప్పకపోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవనవిధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తుపట్టగలగాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ నిత్యజీవిత సాహసయాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది ఈ కొండపొలం నవల. ఈ సాహసయాత్రలో మనం వందలాది గొర్రెలను కాచుకొంటూ ఓబిలం (అహోబిలం) చుట్టుపక్కల పల్లెలపాయ, బింగోని బావి, గద్దగూడుకొండ, చింతల సడ్డు, ఇనప సరూట్లు, రేగిమానుకొండ, గాలికుప్ప, తుమ్మమాని ఏనె, మబ్బుసెల, రాసాల చేను, పెద్దపులి సెల, దొంగ చెలిమ, కులుకుడు గుండాలు, జివ్విమాను బండ, ఒన్నూరమ్మ కోట, బాలప్పబావి వంటి ప్రాంతాలు తిరుగుతాము. అక్కడి బోడులు, మిట్టలు, పేటలు, కొండలు, ఏనెలు, సెలలు, వాగులు, వంకలు మనకు పరిచయమౌతాయి. భిల్లు, చందనం, ఏపె, సీకరేణి, సిరిమాను, పొలికె, తాండ్ర, మద్ది, సండ్ర వంటి రకరకాల చెట్లను చూస్తాము. పరిక్కాయ, ఈతకాయ, టూకీపండు, మోవిపండుల రుచులు తెలుస్తాయి. కొండల పైన, సెలలలోన మొలిచే అనేక రకాల గడ్డి మనకు కనిపిస్తుంది. నేండ్రగడ్డి కనిపిస్తే గొర్రెలు దబ్బగోగడిని, పీచుగోగడిని, బొచ్చుగడ్డినీ మూచూడవని గమనిస్తాము. ఎడుగండు ఎదురుపడితే గట్టిగా హడలుకొడితే చాలని, కానీ పెద్దపులి అలా జడవదని, మనమే దూరంగా తప్పుకోవాలని మన అనుభవానికి వస్తుంది. ముచ్చుగొర్రెకూ, బొల్లిగొర్రెకూ తేడా తెలుస్తుంది. మందలో కారుపొట్టేలు, దొడ్డిపొట్టేలు, తలపొట్టేళ్ల తరతమ స్థానాలు అర్థమవుతాయి. ఎదగొర్రెల యవనదశల వెంపర్లాటే కాదు; కొండచిలువల ప్రణయ కాండ గురించి కూడా తెలుస్తుంది. ఆధునిక సాహిత్యంలో పశుపోషణ ముఖ్యాంశంగా ఉన్న కథలు, నవలలు తక్కువ. ఉన్న కొద్ది కథల్లోనూ వ్యవసాయానికి అవసరమైన పశువుల (ఎద్దుల) ప్రసక్తే ఎక్కువ. మన ప్రాంతాల్లోనూ, ప్రపంచపు నలుమూలల సంస్కృతులలోనూ కనిపించే గొర్రెల గురించి, గొర్రెలకాపరుల జీవితాల గురించి తెలుగులో వ్రాసినది తక్కువ. అలాగే తెలుగులో అడవి ముఖ్యపాత్రగా ఉండే పుస్తకాలూ తక్కువే; ఉన్నకొద్ది కూడా గిరిజనుల జీవితాల గురించి లేక నక్సలైటు ఉద్యమం గురించి రాసినవే. ఈ రెండు వస్తువులనీ కలుపుకొంటూ ఒక ప్రత్యేక జీవనపోరాటాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. -జంపాల చౌదరి -
అది నాకు ముఖ్యమైన జ్ఞాపకం
అమెరికాలో 35 ఏళ్లుగా ఉంటున్న తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సాహిత్యాభిమాని, వ్యాసకర్త, కథా రచయిత. పద్నాలుగేళ్లుగా విజయవాడ పుస్తక ప్రదర్శనకు హాజరవుతున్న ఆయన తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. ఏటా వస్తుంటాను నేను 2002 నుంచి పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను. పుస్తకాలు, పుస్తకాలకు సంబంధించిన మనుషులు, పుస్తక ప్రచురణ కర్తలు, రచయితలు వస్తుంటాను. కొత్త పుస్తకాలు ఏం వచ్చాయి? ఎవరు ఏం చదువుతున్నారు?.. వంటివి పరిశీలిస్తాను. ఈ ప్రదర్శనకు దాదాపు రాష్ర్టం నలుదిక్కుల నుంచి అభిమానులు, రచయితలు వస్తున్నారు. వారిని కలవడం ఆనందంగా ఉంటుంది. వాస్తవానికి నేను ఈనెల 11వ తేదీన రావాల్సి ఉంది. ఆ రోజుతో ఈ ప్రదర్శన అయిపోతుంది కనుక, మూడు రోజులు ముందే వచ్చాను. పదేళ్లలో వచ్చిన మార్పు 2002 పుస్తక ప్రదర్శనలో చిన్నపిల్లల కోసం తెలుగు పుస్తకాలు కొనడానికి చాలా వెతకాల్సి వచ్చేది. ప్రస్తుతం పిల్లలకు తెలుగు పుస్తకాలు విరివిగా లభిస్తున్నాయి. పిల్లలకు కూడా చదవాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. ఆ మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది నాకు అన్ని రకాల పుస్తకాలు చదవడం ఇష్టం. సమకాలీన రచనలు, రాజకీయ రచనలు, విమర్శలు, సంప్రదాయ రచనలు... ఒకటేమిటి అన్నీ చదువుతాను. ప్రస్తుతం ఈ ప్రదర్శన స్థలం వైశాల్యం తగ్గడం వల్ల నడక తగ్గింది. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. నేను అనుకున్నదాని కంటే బాగుందనే చెప్పాలి. మరిచిపోలేని జ్ఞాపకాలు 2003 జనవరిలో బాపురమణలతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేశాం. నేను, శ్రీరమణ సంధాతలుగా వ్యవహరించాం. అది నాకు ముఖ్యమైన జ్ఞాపకం. అలాగే, మోహన్‌ప్రసాద్ గారిని కలిసి సుదీర్ఘంగా సంభాషించడం మరచిపోలేను. తానా తరఫున ఇక్కడే నాలుగు పుస్తకాలు విడుదల చేయడం ఒక మరపురాని అనుభూతి. ఆనందపడే విషయం పదేళ్లలో తెలుగు పుస్తకాలు ఎక్కువగా రావడం ఆనందించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా పుస్తకాలు కొని చదువుతున్నారు. ఇది మంచి పరిణామం. అయితే, సమకాలీన సాహిత్యానికి పెద్ద ఆదరణ లేదని, సంప్రదాయ సాహిత్యం లేదా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలను విరివిగా కొంటున్నారని విన్నాను. పాత సాహిత్యం చదివే వారికి కొత్తగా ఏం వస్తున్నాయో తెలియకపోవడం వల్లే వారు చదవట్లేదని అనుకుంటున్నాను. అలాగే, యువతరం ఆంగ్ల మాధ్యమం చదవడం వల్ల సాహిత్యం కంటే వారు ఇంకేదో కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. వాదాలు (ఇజమ్స్) సాహిత్యాన్ని బలోపేతం చేస్తాయి. వాదం వల్ల కొత్త పాఠకులు వస్తారు. -
ఒక సంవత్సరంలో ఎంత చదవ్వొచ్చు?...
ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు చదవ్వొచ్చు? టైమ్ లేదు, దొరకలేదు, కుదరలేదు వంటి సాకులు వెతుక్కోవడం మానేస్తే పుస్తకం వెంట నిజంగా పడదలిస్తే ఇదిగో నిజంగానే జంపాల చౌదరి చదివినన్ని పుస్తకాలు చదవ్వొచ్చు. ‘ఈ సంవత్సరం నా పుస్తకాల చదువు కొంచెం ఒడిదుడుకులతోనే సాగింది’ అని బాధపడ్తూ తాను 2013లో చదివిన పుస్తకాలను ఆయన పుస్తకండాట్నెట్లో పెట్టారు. బాప్ రే. ఎంత అదృష్టం ఇది. ఇన్ని పుస్తకాలు చదవడం. సైకియాట్రిస్ట్‌గా పెద్ద బాధ్యతలు ఒకవైపు, తానాలో కీలక బాధ్యతలు మరోవైపు ఉన్నా, తెలుగు పుస్తకాలన్నీ కోరిన వెంటనే బజారుకు వెళ్లి కొనుక్కునే వీలు లేని అమెరికాలో ఉంటున్నా ఆయన ఈ పుస్తకాలన్నీ చదివారు. చాలా ఏళ్ల తర్వాత శతాబ్ది సూరీడు నవల చదవడం సంతోషాన్ని ఇచ్చిందని కూడా చెప్పుకున్నారు. ఏడాదిలో ఒకరు చదవదగ్గ పుస్తకాల సంఖ్య కోసమే కాదు... మంచి పుస్తకాల పట్టిక తెలియడానికి కూడా ఆయన చదివిన పుస్తకాలను దాదాపుగా ఇక్కడ ఇస్తున్నాం. కథా సంకలనాలు: కథ 2012, కథావార్షిక 2012, పాత్రినిధ్య 2012, నవ కథామాల, కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్ (సామాన్య), ఇంతిహాసం (మృణాళిని), యానాం కథలు (దాట్ల దేవదానం రాజు), లోలోపల (వి. రాజారామమోహనరావు) కాటుక కళ్లు (శ్రీపతి), తెల్లకొక్కెర్ల తెప్పం (డా.ఎన్.వసంత్), ఎర్నూగుపూలు (కృష్ణ రసం), పి.చంద్రశేఖర్ ఆజాద్ కథలు, తోలేటి కథలు, పి.సత్యవతి కథలు, విముక్త (ఓల్గా), ఊరు వీడ్కోలు చెప్పింది (శీలా వీర్రాజు), కొండఫలం (వాడ్రేవు వీరలక్ష్మీదేవి), అంబల్ల జనార్దన్ కథలు, విదేశీ కోడలు (కోసూరి ఉమా భారతి), మనసుకో దాహం (కుప్పిలి పద్మ), సంయుక్త రచనలు (చింతం రాణీ సంయుక్త), వానజల్లు (ఇచ్చాపురపు జగన్నాధరావు) నవలలు: నికషం (కాశీభట్ల), జిగిరి (పెద్దింటి అశోక్‌కుమార్). ఈ దేశంలో ఒక భాగమిది (కొమ్మూరి వేణు గోపాలరావు), పెంకుటిల్లు (కొమ్మూరి వేణుగోపాలరావు), ఖాకీవనం (పతంజలి), శతాబ్ది సూరీడు (మాలతీ చందూర్), ఆకుపచ్చని దేశం (డా.వి.చంద్రశేఖరరావు), నల్లమిరియం చెట్టు (డా.వి.చంద్రశేఖరరావు), విడీవిడని చిక్కులు (వీరాజీ), అధోజగత్ సహోదరి (అక్కినేని కుటుంబరావు), రామ్ఎట్శృతిడాట్కామ్ (అద్దంకి అనంత రామయ్య), స్మశానం దున్నేరు (కేశవరెడ్డి) అనువాదాలు: జమీల్యా (చంగిజ్ ఐతమతోవ్: అను: ఉప్పల లక్ష్మణ రావు), ఓ మనిషి కథ - శివశంకరి (అను:మాలతీ చందూర్), ఆణిముత్యాలు (తమిళ కథలు) (అను: గౌరీ కృపానందన్), ఆరడుగుల నేల - చలసాని ప్రసాదరావు, మాస్తి చిన్న కథలు, మంటో కథలు ఆత్మకథలు- జీవిత చిత్రణలు: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు (మురారి), కాశీయాత్ర (చెల్లపిళ్ల వెంకటశాస్త్రి), చాప్లిన్ ఆత్మకథ (అను: వల్లభనేని అశ్వినీ కుమార్), హాస్యనట చక్రవర్తి (టి.ఎస్.జగన్మోహన్), 1948 హైదరాబాద్ పతనం (మహమ్మద్ హైదర్), కెవి.రెడ్డి శతజయంతి సంచిక (హెచ్.రమేశ్‌బాబు), జైలు లోపల (వట్టికోట ఆళ్వారుస్వామి), రంగనాయకమ్మ- ఆత్మకథాంశాల ఉత్తరాలు, శోభన్‌బాబు ఆత్మకథ (ఆకెళ్ల రాఘవేంద్ర), విప్లవజ్యోతి అల్లూరి (ఎం.వి.ఆర్.శాస్త్రి), తిరుమల లీలామృతం- పి.వి.ఆర్.కె. ప్రసాద్ సాహితీ వ్యాసాలు: కథలెలా రాస్తారు? (శార్వరి), సంభాషణ (సింగమనేని నారాయణ), రాగం భూపాలం (పి.సత్యవతి), సోమయ్యకు నచ్చిన వ్యాసాలు (వాడ్రేవు చినవీరభద్రుడు), మన తెలుగు నవలలు (డియాల రామ్మోహన్ రాయ్), సమకాలీనం (ఏ.కె.ప్రభాకర్), కథాశిల్పం (వల్లంపాటి వెంకటసుబ్బయ్య) కవిత్వం: దేశభక్తి గేయాలు (సంకలనం: మువ్వల సుబ్బ రామయ్య), ఆటవెలదిలో ఆణిముత్యాలు (డా.కొలగోట్ల సూర్య ప్రకాశరావు), పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (దేవీప్రియ). ఇంగ్లిష్: The Little Bookstore of Big Stone Gap - Wendy Welch When I stop talking you know I am dead - Jerry Weintraub Where The Peacocks Sing - Alison Singh Gee No Easy Day: The autobiography of a Navy Seal- Mark Owen; When the Mob Ran Vegas - Steve Fischer Undergrounds: The Story of Coffee; where it began, how it spread - Marc Pendergrast. I Too Had a Dream - PJ Kurien. Pataudi - Suresh Menon (ed) I Bury My Dead - James Hadley Chase It Does Not End - Maitreyi Devi Samskara - U.R. Anantha Murthy (Tr: A. K. Ramanujan) The Jungle Book - Rudyard Kipling; an old classic. Understanding Creativity - Jane Piirto The Cinema of George Lucas - Marcus Hearn. Picasso and Chicago - Stephanie Alessandro.