అది నాకు ముఖ్యమైన జ్ఞాపకం
అమెరికాలో 35 ఏళ్లుగా ఉంటున్న తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సాహిత్యాభిమాని, వ్యాసకర్త, కథా రచయిత. పద్నాలుగేళ్లుగా విజయవాడ పుస్తక ప్రదర్శనకు హాజరవుతున్న ఆయన తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు..
ఏటా వస్తుంటాను
నేను 2002 నుంచి పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను. పుస్తకాలు, పుస్తకాలకు సంబంధించిన మనుషులు, పుస్తక ప్రచురణ కర్తలు, రచయితలు వస్తుంటాను. కొత్త పుస్తకాలు ఏం వచ్చాయి? ఎవరు ఏం చదువుతున్నారు?.. వంటివి పరిశీలిస్తాను. ఈ ప్రదర్శనకు దాదాపు రాష్ర్టం నలుదిక్కుల నుంచి అభిమానులు, రచయితలు వస్తున్నారు. వారిని కలవడం ఆనందంగా ఉంటుంది. వాస్తవానికి నేను ఈనెల 11వ తేదీన రావాల్సి ఉంది. ఆ రోజుతో ఈ ప్రదర్శన అయిపోతుంది కనుక, మూడు రోజులు ముందే వచ్చాను.
పదేళ్లలో వచ్చిన మార్పు
2002 పుస్తక ప్రదర్శనలో చిన్నపిల్లల కోసం తెలుగు పుస్తకాలు కొనడానికి చాలా వెతకాల్సి వచ్చేది. ప్రస్తుతం పిల్లలకు తెలుగు పుస్తకాలు విరివిగా లభిస్తున్నాయి. పిల్లలకు కూడా చదవాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. ఆ మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది.
చాలా బాగుంది
నాకు అన్ని రకాల పుస్తకాలు చదవడం ఇష్టం. సమకాలీన రచనలు, రాజకీయ రచనలు, విమర్శలు, సంప్రదాయ రచనలు... ఒకటేమిటి అన్నీ చదువుతాను. ప్రస్తుతం ఈ ప్రదర్శన స్థలం వైశాల్యం తగ్గడం వల్ల నడక తగ్గింది. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. నేను అనుకున్నదాని కంటే బాగుందనే చెప్పాలి.
మరిచిపోలేని జ్ఞాపకాలు
2003 జనవరిలో బాపురమణలతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేశాం. నేను, శ్రీరమణ సంధాతలుగా వ్యవహరించాం. అది నాకు ముఖ్యమైన జ్ఞాపకం. అలాగే, మోహన్‌ప్రసాద్ గారిని కలిసి సుదీర్ఘంగా సంభాషించడం మరచిపోలేను. తానా తరఫున ఇక్కడే నాలుగు పుస్తకాలు విడుదల చేయడం ఒక మరపురాని అనుభూతి.
ఆనందపడే విషయం
పదేళ్లలో తెలుగు పుస్తకాలు ఎక్కువగా రావడం ఆనందించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా పుస్తకాలు కొని చదువుతున్నారు. ఇది మంచి పరిణామం. అయితే, సమకాలీన సాహిత్యానికి పెద్ద ఆదరణ లేదని, సంప్రదాయ సాహిత్యం లేదా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలను విరివిగా కొంటున్నారని విన్నాను. పాత సాహిత్యం చదివే వారికి కొత్తగా ఏం వస్తున్నాయో తెలియకపోవడం వల్లే వారు చదవట్లేదని అనుకుంటున్నాను. అలాగే, యువతరం ఆంగ్ల మాధ్యమం చదవడం వల్ల సాహిత్యం కంటే వారు ఇంకేదో కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. వాదాలు (ఇజమ్స్) సాహిత్యాన్ని బలోపేతం చేస్తాయి. వాదం వల్ల కొత్త పాఠకులు వస్తారు.