
ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు, రంగరాయపురంలో నిర్మాణం పూర్తయినా బిల్లు కాని భవనం
సాక్షి, బొబ్బిలి రూరల్: నియోజకవర్గంలో ఇంతకు ముందు చేసిన ఉపాధి పథకం కింద చేసిన అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది. అధికారులు, పాలకులు అదిగో, ఇదిగో అంటూ ఊరించి చివరకు చేతులెత్తేశారు. ఒక వైపు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారని, మరో వైపు సీఎఫ్‌ఎంఎస్ ఫ్రీజింగ్ తమను ఆర్థికంగా ముంచేశాయని పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, 2 నెలలుగా వేతనాలు అందక వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటనలే మిగిలాయి..
సర్వశిక్షా అభియాన్ పేరిట ప్రహరీలు నిర్మించేందుకు గానూ నిధులకు ఎలాంటి డోకా లేదని ప్రకటనలు గుప్పించారు అధికారులు, పాలకులు. తీరా పనులు చేసిన తర్వాత వాటి బిల్లులు పెండింగ్‌లో ఉంచేయడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి పథకంలో రోడ్లు పనులు చేయించి కోట్లలో బకాయిలు ఉంచేశారని వారు చెబుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.2.5 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరగాల్సి ఉంది. అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఇలా ఏ పనులు చేపట్టినా నిబంధనల పేరిట త్వరగా పూర్తి చేయించి ఆనక చేతులెత్తేశారు. దీంతో పలువురు చేతిలో డబ్బులు లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నీరు–చెట్టు పనులకు కూడా పలువురుకి చెల్లింపులు చేయలేదు.
రెండు నెలలుగా రాని వేతనాలు..
ఇక ఉపాధి పనులు చేసిన వేతనదారులకు 2 నెలలుగా చెల్లింపులు జరగలేదు. పని చేసినా తమకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని వేతనదారులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.కోటి మేర వేతన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
రూ. 40 లక్షల వరకు బకాయి..
బొబ్బిలి మండలంలో దాదాపు రూ.40 లక్షల వరకు వేతన బకాయి ఉంది. జనవరి వరకు చెల్లింపులు జరిగాయి. మరో 10 రోజుల్లో చెల్లింపులు జరగొచ్చని భావిస్తున్నాం.
– కె.కేశవరావు, ఉపాధి ఏపీఓ, బొబ్బిలి.
బకాయి వాస్తవమే..
నియోజకవర్గంలో రోడ్ల బిల్లులు సుమారు రూ.2 కోట్లకు పైగా చెల్లించాల్సిన మాట వాస్తవం. నిధులు ఉన్న మాట వాస్తవమే. కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వాటి వల్ల చెల్లింపులు జరగడం లేదు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.
– డబ్ల్యూవీవీఎస్ శర్మ, డీఈ, పంచాయతీ రాజ్, బొబ్బిలి.
రూ.20 లక్షలు రావాల్సి ఉంది..
గ్రామంలో అనేక పనులు చేశా. వాటి బిల్లులు రూ.20 లక్షలకు పైగా రావాల్సి ఉంది. రోజూ కార్యాలయాలకు వెళ్లడం వచ్చేయడమే జరుగుతుంది. వడ్డీలు పెరిగి పోతున్నాయి. ఇలా అయితే ఎలా కష్టమే.
– పాటూరు కృష్ణమూర్తి, ప్రజాప్రతినిధి, కలువరాయి.
Comments
Please login to add a commentAdd a comment