మైనార్టీలను మర్చిపోయావా ‘బాబు’ | Babu Forget The Muslim Minorities | Sakshi
Sakshi News home page

మైనార్టీలను మర్చిపోయావా ‘బాబు’

Published Sat, Mar 30 2019 7:40 AM | Last Updated on Sat, Mar 30 2019 8:43 AM

Babu Forget The  Muslim Minorities - Sakshi

సాక్షి, బొబ్బిలి : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు ఆరు ఎమ్మెల్యే సీట్లిచ్చారు. షబ్బీర్‌ అలీని మైనార్టీ శాఖ మంత్రిగా నియమించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన చలువతో ఎంతోమంది నిరుపేద ముస్లిం పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా గాలికొదిలేశారు.

ఐదేళ్ల పాటు మా సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు ముస్లింల సంక్షేమానికి కోట్లు కుమ్మరిస్తామంటే ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నించారు ముస్లింలు. బొబ్బిలిలో పలువురు ముస్లింలు తమ సమస్యలు, పాలకుల తీరుపై రచ్చబండ నిర్వహించుకున్నారు. సయ్యద్‌ అమ్ములు మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి షైనాజ్‌ బేగం పెళ్లి నిమిత్తం దుల్హన్‌ పథకం కింద ఆర్థిక సాయానికి దరఖాస్తు చేశాం. రూ.50 వేలు వస్తాయి కదా పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం. నేటికీ షాదీ ముబారక్‌ ప్రోత్సాహకం ఇవ్వలేదు. అప్పులు చేసి పెళ్లి జరిపించాం. దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేదు’ అని వాపోయింది.

పూరి పాకలో ఉంటూ ఓ మెస్‌లో పని చేసుకునే ఈమె ఆర్థిక పరిస్థితి అంతంతే. ఆమె భర్త సయ్యద్‌ అలీ ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో ఆ పని కూడా మానేసి అతనికి సపర్యలు చేస్తోంది. చుట్టుపక్కల వారు, బంధువుల సాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.  

నిరుద్యోగ భృతి ఇవ్వలేదు 
నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేస్తే.. 2013లో రూ.35 వేల రుణం తీసుకున్నానని ఆపేశారు. మీరేమైనా రుణం ఇచ్చారా? ఎప్పుడో 2013లో రుణం తీసుకుంటే నిరుద్యోగ భృతి ఆపేయడం ఏంటి. ఇది హాస్యాస్పదం కాదా. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే వెళుతున్నాయి. మైనార్టీలను అసలు పట్టించుకోవడమే లేదు.  
– అబ్దుల్‌ ముజీబ్, నిరుద్యోగి 

అన్నిటికీ జన్మభూమి కమిటీలే 
మైనార్టీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా చేయాలంటే నేరుగా లబ్ధి కల్పించవచ్చు. కానీ.. అలా చేయట్లేదు. మా ప్రాంతంలో బీసీలతో జన్మభూమి కమిటీ వేశారు. మేం వెళితే వాళ్లెవరూ దొరకరు. ఏం చెబుతారో తెలియదు. కనీసం ఆ జన్మభూమి కమిటీలోనైనా మైనార్టీలకు చోటివ్వలేదు.  
– షేక్‌ నాగూర్‌ 

మమ్మల్ని బెదిరిస్తున్నారు 
మా సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే బెదిరిస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు అందించకపోగా.. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? 
– మొహ్మద్‌ సాదిక్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement