Dulhan scheme
-
‘దుల్హన్’ని వదిలేసిందెవరు?
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు... గ్రాఫిక్స్‌లో చంద్రబాబు దిట్ట!!. దేన్నయినా కాగితాలపై అద్భుతంగా చూపిస్తారు. అక్కడితో వదిలేస్తారు. ఆ తరవాత ఎవరు దాన్ని అమల్లోకి తెచ్చినా... క్రెడిట్ మాత్రం ఈయనదే!. ఒకవేళ అమలు చేయకపోతే... బాబు అంత గొప్ప పథకాన్ని తెచ్చినా వీళ్లు అమలు చేయలేదంటూ అవతలిపక్షాన్ని నిందించే డ్యూటీ రామోజీ రావుది. ఇలా ఈ ఇద్దరూ కలిసి ఆడే డ్రామాలకు ఇప్పుడు యావత్తు ఆంధ్రప్రదేశ్ విస్తుపోతోంది. కనీసం ప్రతిపాదనలను దాటి ముందుకు తీసుకెళ్లని టీసీఎల్ ప్రాజెక్టుకు భూములివ్వటం నుంచి అన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేసినా... అది తాము తెచ్చినదంటూ ‘బాబు’ని మించిపోయి మరీ ఆయన తనయుడు లోకేశ్ చేసిన దిగజారుడు కామెంట్లు ఇలాంటి కోవలోనివే. ఆరంభంలో తప్ప అమల్లో చిత్తశుద్ధి లేకుండా బకాయిలు పెట్టి మరీ వదిలేసిన దుల్హన్... పారదర్శకత లేకుండా కావాల్సిన అతి కొద్ది మందికే అందించి... దానిక్కూడా బకాయిలు పెట్టి విద్యార్థుల్ని నడిమధ్యలో వదిలిపెట్టిన ‘విదేశీ విద్య పథకం’... అన్నీ ఈ కోవలోనివే. షరామామూలుగా... వీటిని అమలు చేయలేదంటూ రామోజీరావు ఆక్రోశం!!. ‘ఈనాడు’లో పతాక శీర్షికల్లో కథనం. అసలు బాబు... చినబాబు... రామోజీ కలిసి ఆడుతున్న ఈ డ్రామా వెనక వాస్తవాలేంటి? ఏది నిజం? చూద్దాం... పేద ముస్లింల పెళ్లికి రూ.50వేలు ఇచ్చేలా ‘దుల్హన్’ పేరిట పథకాన్ని 2015లో తెచ్చిన చంద్రబాబు... ఆ తరువాతి ఏడాదిలో... అంటే 2016లో ఆరంభించారు. రెండేళ్లు తిరక్కముందే... 2018 ఏప్రిల్ నుంచే దాన్ని ఆపేశారు. అలా... రెండేళ్లకే ‘దుల్హన్‌కు ధోకా’ ఇచ్చారు. కాకపోతే రామోజీరావుకు ఇవేవీ పట్టవు. చంద్రబాబు అత్యంత నిజాయితీగా ఆరంభించి... చివరిదాకా అమలు చేసినట్లు... ఆ తరవాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా వదిలేసినట్లు ఆయనకు కలలొస్తుంటాయి. అందుకే దిగ్గున లేచి స్టోరీలు వండేస్తుంటారు. నిజానికి ముస్లింల కోసం ‘దుల్హన్’ పేరిట ఆరంభించినా... తరవాత మిగిలిన కులాలకూ దాన్ని వర్తింపజేస్తూ చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చిన చంద్రబాబు... 2018 ఏప్రిల్ నుంచే దరఖాస్తుదారులకు డబ్బులివ్వడం నిలిపేశారు. ఒక్క దుల్హన్ పథకంలోనే 2018–19లో 2,506 మంది మైనారిటీలకు రూ.12.54 కోట్లు చెల్లించకుండా బకాయి పెట్టేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలను చేర్చాక ‘చంద్రన్న పెళ్లికానుక’గా మార్చినా... ఈ స్కీమ్‌లో 2018–19లో మొత్తం 19,636 మందికి రూ.82.41కోట్లు బకాయి పెట్టారు. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి... మొదట ఈ బకాయిలు చెల్లించడంపై దృష్టిపెట్టారు. ఆ తరవాత పథకం కింద అందించే నగదు మొత్తాన్ని గణనీయంగా పెంచి అమలు చేయాలని ప్రయత్నించారు. మరింత పారదర్శకంగా అమలు చేయడం కోసం దరఖాస్తుల నమోదు ప్రక్రియను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. అయితే... కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వాదాయం తగ్గి అమలు చేయలేకపోయిన మాట వాస్తవమేనని ప్రభుత్వమే ధైర్యంగా అంగీకరించింది కూడా. అదీ... జగన్ మార్కు ధైర్యం ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా తమ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును జనం ముందుంచారు. ఇందులో తమ ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పిన పనులు ఏమేం చేశామో.. ఏమేం చేయలేకపోయామో అందులో వివరించారు. చేసిన పనులకే మార్కులు వేసుకున్నారు. తాము అమలు చేయలేకపోయిన పథకాల్లో దుల్హన్ కూడా ఉంది. అందుకే తమకు నూటికి నూరు మార్కులు కాకుండా 95 మార్కులే వచ్చాయని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. చేసింది చేసినట్లు.. చేయనిది చేయనట్లు చెప్పే ఈ ధైర్యం మీ చంద్రబాబుకు ఉందా.. రామోజీరావు గారూ? మరి బాబు నగదు చెల్లించకుండా బకాయిలు పెట్టినపుడు మీరెందుకు నిలదీయలేదు? మీ ‘ఈనాడు’లో కథనాలెందుకు రాయలేదు? నగదు చెల్లించకుండా బకాయిలు పెట్టేయటమంటే పథకాన్ని నిలిపేసినట్లేగా? దుల్హన్‌కు ధోకా ఎందుకిచ్చావని అప్పుడు ప్రశ్నించలేదేం? ఇదీ.. బాబు దుల్హన్ తీరు పెళ్లి కానుకలో నిర్ణయాలు ఇలా.. ► 2015 ఏప్రిల్ 29న–ముస్లీం మైనారిటీ పేదల పెళ్లికి రూ.50వేలు ఆర్థిక సాయమిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని తెస్తూ ఉత్తర్వులిచ్చింది. ► మొదట ఇచ్చిన జీవోకు సవరణలు చేస్తూ 2015 మే 26, సెప్టెంబర్ 15న మరో ఉత్తర్వు ఇచ్చింది. అమలు మాత్రం ఆ తరవాతే అయ్యింది. ► 2018 ఏప్రిల్ 18న దుల్హన్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు వర్తింపజేస్తూ... చంద్రన్న పెళ్లికానుకగా పేరు మారుస్తూ బాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ► 2018 ఏప్రిల్ 29న చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి తెస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. నాటి నుంచి బకాయిలు పెట్టేశారు. మరి దీన్ని అమలు చేసినట్లు... ఆ తరువాత ప్రభుత్వం వచ్చి నిలిపేసినట్లు రాతలు రాయటం కరెక్టా? -
దూరమైన దుల్హన్ పథకం ..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): దుల్హన్ పథకం వర్తింపునకు సవాలక్ష ఆంక్షలు ఎదురవుతుండటంతో చాలా మంది ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. అన్ని ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకొ రెండేళ్లయినా మైనార్టీలకు ఆర్థిక సహాయం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, కులాంతర వివాహాలు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పెళ్లి చేసుకుంటే ఆయా శాఖల కింద ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు. ఈ మేరకు 11శాఖల్లో ఈ పెళ్లి తంతు నడిచేది. లబ్ధిదారులు అనేక పథకాల ద్వారా ఎక్కువ సార్లు ప్రోత్సాహకం అందుకుంటున్నారని అనుమానించిన రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి కానుక అంతా ఒకే వేదిక(సింగిల్ డెస్క్)పై ఉండాలని నిర్ణయించింది. దీని బాధ్యతను 11 శాఖలనుంచి తప్పించి డీఆర్డీఏ–వెలుగు శాఖకు అప్పగించింది. అందులో పనిచేసే అధికారులతో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు గ్రామాల్లో వెయ్యి మందికి పైగా కల్యాణ మిత్రలు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. కల్యాణ మిత్రలుగా స్వయం సహాయక సంఘాలు (పొదుపు మహిళలు)ను ఎంపిక చేశారు. పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.40వేలు, బీసీలకు రూ.35వేలు, ఎస్టీలకు రూ.50వేలు, మైనార్టీలకు రూ.50వేలు, దివ్యాంగులకు రూ.లక్ష, ఎస్సీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు ప్రోత్సాహక నగదుగా అందజేస్తారు. పథకానికి దూరంగా వేల మంది.. జిల్లాలో పెళ్లి కానుక పథకం కింద 10,338 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 10,014 పెళ్లిళ్లు జరిగాయి. ఇంకా 324 పెళ్లిళ్లు జరగాల్సినవి. వివాహమైన వారిలో 679 జంటలకు 20 శాతం మాత్రమే అందజేశారు. 8,942 జంటలకు వంద శాతం ప్రోత్సాహక నగదు అందజేశారు. మొత్తం 9,621 వివాహాలకు గాను రూ.38.45కోట్లను ఈ పథకం కింద ఇప్పటి వరకు ఖర్చు చేశారు. అయితే పథకానికి అర్హులైన మరో పదివేల మందికి పైగా దూరంగా ఉండిపోయారు. పలు కారణాలతో ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు. స్థానికంగా గాక ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రాష్ట్రస్థాయిలో స్క్రీనింగ్ జరగడం, అక్కడి బడ్జెట్‌ను బట్టి ప్రోత్సాహక నగదును విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్హులు చాలా మంది ఈ పథకానికి దూరంగా ఉండిపోయారు. రెండేళ్లయినా అందని దుల్హన్ ఆర్థిక సహాయం రెండేళ్ల (ఏప్రిల్ 2017) నుంచి జిల్లాలో 200 మంది నిరుపేద మైనార్టీ మహిళలు పెళ్లి చేసుకుని అవసరమైన అన్ని ధ్రువ పత్రాలతో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అనంతరం జిల్లా మైనార్టీస్ సంక్షేమాధికారికి హార్డ్ కాపీని సమర్పించి, వారికి రావాల్సిన రూ.50వేల ఆర్థిక సహాయం కోసం మైనార్టీ కార్యాలయం, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి ఫిర్యాదుల విభాగం, 1100కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. ఇదిలా ఉండగా ఈ పథకంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించినట్లు చెబుతున్నా 200 మందికి రెండేళ్ల నుంచి ఎందుకు మంజూరు కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన సిబ్బందిని నియమించే విషయంలో కూడా ఐదేళ్ల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. డబ్బులు రాలేదు 2017 మే 21న నా కుమార్తె దూదేకుల రేష్మ వివాహం చేశాను. దుల్హన్ మ్యారేజ్ స్కీంలో టోకెన్ నంబర్ 1325027/2018 ఇచ్చారు. రెండేళ్లవుతున్నా.. మైనార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఈ నెల.. వచ్చే నెల అంటూ అధికారులు తిప్పుకుంటున్నారు కానీ డబ్బులు రాలేదు. – దూదేకుల మౌలాలి, బీఆర్‌రెడ్డి కాలనీ, కల్లూరు -
మైనార్టీలను మర్చిపోయావా ‘బాబు’
సాక్షి, బొబ్బిలి : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు ఆరు ఎమ్మెల్యే సీట్లిచ్చారు. షబ్బీర్ అలీని మైనార్టీ శాఖ మంత్రిగా నియమించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన చలువతో ఎంతోమంది నిరుపేద ముస్లిం పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా గాలికొదిలేశారు. ఐదేళ్ల పాటు మా సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు ముస్లింల సంక్షేమానికి కోట్లు కుమ్మరిస్తామంటే ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నించారు ముస్లింలు. బొబ్బిలిలో పలువురు ముస్లింలు తమ సమస్యలు, పాలకుల తీరుపై రచ్చబండ నిర్వహించుకున్నారు. సయ్యద్ అమ్ములు మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి షైనాజ్ బేగం పెళ్లి నిమిత్తం దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయానికి దరఖాస్తు చేశాం. రూ.50 వేలు వస్తాయి కదా పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం. నేటికీ షాదీ ముబారక్ ప్రోత్సాహకం ఇవ్వలేదు. అప్పులు చేసి పెళ్లి జరిపించాం. దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేదు’ అని వాపోయింది. పూరి పాకలో ఉంటూ ఓ మెస్‌లో పని చేసుకునే ఈమె ఆర్థిక పరిస్థితి అంతంతే. ఆమె భర్త సయ్యద్ అలీ ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో ఆ పని కూడా మానేసి అతనికి సపర్యలు చేస్తోంది. చుట్టుపక్కల వారు, బంధువుల సాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేస్తే.. 2013లో రూ.35 వేల రుణం తీసుకున్నానని ఆపేశారు. మీరేమైనా రుణం ఇచ్చారా? ఎప్పుడో 2013లో రుణం తీసుకుంటే నిరుద్యోగ భృతి ఆపేయడం ఏంటి. ఇది హాస్యాస్పదం కాదా. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే వెళుతున్నాయి. మైనార్టీలను అసలు పట్టించుకోవడమే లేదు. – అబ్దుల్ ముజీబ్, నిరుద్యోగి అన్నిటికీ జన్మభూమి కమిటీలే మైనార్టీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా చేయాలంటే నేరుగా లబ్ధి కల్పించవచ్చు. కానీ.. అలా చేయట్లేదు. మా ప్రాంతంలో బీసీలతో జన్మభూమి కమిటీ వేశారు. మేం వెళితే వాళ్లెవరూ దొరకరు. ఏం చెబుతారో తెలియదు. కనీసం ఆ జన్మభూమి కమిటీలోనైనా మైనార్టీలకు చోటివ్వలేదు. – షేక్ నాగూర్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే బెదిరిస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు అందించకపోగా.. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? – మొహ్మద్ సాదిక్ -
'దుల్హన్'కు ధోకా
సాక్షి, కడప : నిరుపేదల పెళ్లికి అంతో ఇంతో ఇచ్చి ఆదుకుం టాం.. పెళ్లి ఖర్చుకు కష్టమవుతున్న ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేద యువతులకు దుల్హన్ పథకం కింద ఆదుకుంటామన్న ప్రభుత్వం ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.. రోజురోజుకు పెళ్లి చేసుకున్న యువతుల పేర్ల సంఖ్య నమోదు పెరిగిపోతున్నా.. వారికి అందించాల్సిన కానుక విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోం ది. సుమారు ఆరు నెలలుగా కొత్త జంటలకు నిరీక్షణ తప్ప...నిధులు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తున్నాం.. ..ఇది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పెరిగిపోతున్న దరఖాస్తులు జిల్లాలో ముస్లిం మైనార్టీల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న షేక్, సయ్యద్, పఠాన్, దూదేకుల, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన యువతులు చాలామంది దరఖాస్తు చేసుకున్నా రు. పెళ్లికి సంబంధించి ప్రభుత్వం రూ. 50 వేలు (అందులో కొన్ని వస్తువులు, మరి కొంత నగదు) అందించాల్సి ఉంది. అయితే వివాహమై ఆరు నెలలైనా ప్రస్తుతం స్పందించని పరి స్థితి చూస్తే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలుగా అప్లోడ్ చేస్తున్నా....ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన రావడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు దాదాపు 2050 మంది దరఖాస్తు చేసుకున్నారు. తప్పని తిప్పలు:దుల్హన్ పథకానికి సంబంధించి చాలా రోజులుగా నిధులు రాకపోవడంతో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయానికి వెళ్లి వాకబుచేసుకుంటున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదంటున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే వస్తాయని అధికారులు అంటున్నారు. అయితే లబ్ధిదారులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. క్వార్టర్ల ప్రకారం నిధులు: మూడు నెలలకు ఒకసారి క్వార్టర్ల పద్ధతిన నిధులు అందిస్తూ వస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే 20117–18 సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ ని«ధులు ఇంకా విడుదల కాకపోవడంతో సంబంధిత కార్యాలయాలకు రాలేదు. మార్చికే రావాల్సి ఉంది. అదనంగా మరో రెండు నెలలు కావస్తున్నా విడుదలలో జాప్యం జరుగుతోంది. డిసెంబరు నుంచి దరఖాస్తు చేసుకున్న వారు ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. చివరిక్వార్టర్ నిధులు విడుదల చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుకలోకి ‘దుల్హన్’: ముస్లిం మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం ద్వారా రూ. 50 వేలు అందించే దీనిని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. ఇకనుంచి ముస్లిం మైనార్టీలు కూడా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చే యాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఆయా గ్రామాలు, మండలాల పరిధిలో స్వయం సహాయక సంఘాల్లోని ప్రత్యేక మహిళలు విచారణ చేసి వివరాలు నమోదు చేయడం ద్వారా దరఖాస్తుదారులకు పెళ్లి కానుక అందనుంది. ఏప్రిల్ 17న ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక అమలులోకి తీసుకొచ్చింది. త్వరలో విడుదల దుల్హన్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న యువతులకు నిధులు విడుదల కావాల్సి ఉందని, ఈ నిధులు రాగానే త్వరలోనే పంపిణీకి చర్యలు తీసుకుం టామని మైనార్టీ సంక్షేమశాఖాధికారి ఖాదర్‌బాషా తెలిపారు. అందుకు సంబంధించిన నిధులు రంజాన్ మాసంలోనే వస్తాయని సంకేతాలు అందాయన్నారు. చివరి క్వార్టర్లో నిధులు రానున్నట్లు వెల్లడించారు. నిధులు రాగానే వెంటనే పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. -
దుల్హన్ సాయం దూరం
పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దుల్హన్ పథకం అధికారుల నిర్లక్ష్యంతో విమర్శల పాలవుతోంది. అర్జీలు చేయడంలోనే ఆటంకాలు ఎదురవుతుండటంతో అర్హులకు ఈ పథకం ఫలాలు అందడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో, జిల్లాలో రెండు వందల మందికి పైగా పెళ్ళైన పేద ముస్లిం జంటలు ఈ పథకంలో లబ్ధిపొందకుండా, ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగదు అందితే కొంత వరకూ ఇబ్బందులు నుంచి ఉపశమనం పొందవచ్చన్న ఆశ ఆడియాశలుగానే మిగిలి పోతున్నాయి. ఒంగోలు సెంట్రల్: నిరుపేద ముస్లిం యువతులు వివాహానంతరం రెండు నెలలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే వారు దుల్హన్ పథకం ద్వారా లబ్ధిపొందడానికి అర్హులవుతారు. లేకుంటే అనర్హులవుతారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తుతున్నాయి. తరచూ ఈ సమస్య తలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.అన్లైన్ పోర్టల్‌లో చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుంది. సమస్య రాష్ట్ర స్థాయిలో పరిష్కారించాల్సి ఉండటంతో జిల్లా అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. పథకం లక్ష్యం... పేద ముస్లిం యువతులకు వివాహానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది ముస్లింలు లబ్ధిపొందారు. అయితే వివాహం జరిగిన రెండు నెలల్లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. వధూవరుల ఆధార్‌కార్డులు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధువు బ్యాంకు ఖాతా వంటి వాటిని ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ పథకానికి ఆన్లైన్లో సాంకేతిక సమస్య వచ్చి పడింది. దీంతో వందల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయ పత్రమే అసలు సమస్య... సాధారణంగా దుల్హన్ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే అన్ని రకాల ఆదాయ పత్రాలతో పాటూ మీ సేవ ద్వారా లభించే ఆదాయ ధ్రువీకరణపత్రం కుడా అవసరం, రెవెన్యూ అధికారులు తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికి ఆదాయ పత్రం అవసరంలేదని, ఇవ్వడంలేదు. రేషన్‌కార్డునే ఆదాయ పత్రంగా వాడుకోవాలంటున్నారు. దీంతో దుల్హన్ పథకానికి దరఖాస్తులు చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పని సరి. అది లేకుండా మిగిలిని వివరాలు ఆప్‌లోడ్ చేయలేరు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం 200 మంది వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని పథకం ద్వారా లబ్ధి పొందడానికి గత రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నివేదికలు ఇవ్వడంలో అలస్యం అవుతుండటంతో లబ్ధిదారులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 700 మంది వరకూ ఈ పథకం కింద లబ్ధి కల్పించినట్లు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. - ఝాన్సీ రాణి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి -
వక్ఫ్‌భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
► రెవెన్యూ పోలీసు అధికారుల సహకారం ► దుల్హాన్ పథకం అమలులో కర్నూలు టాప్ ► రాష్ట్రమైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ ఎండీ ఎక్బాల్ కర్నూలు(అగ్రికల్చర్): వక్ఫ్ భూముల ఆక్రమణ లకు చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ ఎండీ ఎగ్బాల్ తెలిపారు. ఇప్పటికే అక్రమణలో ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఇందుకు పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటామని చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015-16లో దుల్హాన్ స్కీమ్ అమలులో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా పేద ముస్లీం , క్రిష్టియన్ యువతుల వివాహ సమయంలో రూ.50 వేల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి 2015-16లో జిల్లాలో 498 మందికి రూ.2.49 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించగా జనవరి నాటికే అధికమించారన్నారు. 2016-17కు సంబంధించి ఇప్పటికే 1522 దరఖాస్తులు వచ్చాయని, ఇందుకు అవసరమైన రూ.7.22 కోట్లను వారంలో విడుదల చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ అధికారి, తహసీల్ధారు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దళారీలు గంప గత్తగా తెచ్చే దర ఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. రాష్ట్రంలో 10వేల మసీదులుండగా మొదటి విడత కింద 2500 మసీదులను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 81 మసీదులు, శ్మశానాలు, ఈద్గాలకు రూ.8.91 కోట్లు అవసరమంటూ నివేదికలు అందించారని, ఈ మేరకు నిధులు ఇస్తామన్నారు. కర్నూలు ముస్లిం రెసిడెన్షియల్ స్కూలును 4.90 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు సీఈఓ అబ్దుల్ ఖదీర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్‌మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.