'దుల్హన్‌'కు ధోకా | Chandrababu naidu Delayed On Dulhan Sceme YSR Kadapa | Sakshi
Sakshi News home page

'దుల్హన్‌'కు ధోకా

Published Sat, May 19 2018 11:07 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Chandrababu naidu Delayed On Dulhan Sceme YSR Kadapa - Sakshi

సాక్షి, కడప : నిరుపేదల పెళ్లికి అంతో ఇంతో ఇచ్చి ఆదుకుం టాం.. పెళ్లి ఖర్చుకు కష్టమవుతున్న ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేద యువతులకు దుల్హన్‌ పథకం కింద ఆదుకుంటామన్న  ప్రభుత్వం ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.. రోజురోజుకు పెళ్లి చేసుకున్న యువతుల పేర్ల సంఖ్య నమోదు పెరిగిపోతున్నా..  వారికి అందించాల్సిన కానుక విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోం ది. సుమారు ఆరు నెలలుగా కొత్త జంటలకు నిరీక్షణ తప్ప...నిధులు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తున్నాం.. ..ఇది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

పెరిగిపోతున్న దరఖాస్తులు
జిల్లాలో ముస్లిం మైనార్టీల్లో  దారిద్య్రరేఖకు దిగువున ఉన్న  షేక్, సయ్యద్, పఠాన్, దూదేకుల, క్రిస్టియన్‌ సామాజిక వర్గాలకు చెందిన యువతులు చాలామంది దరఖాస్తు చేసుకున్నా రు. పెళ్లికి సంబంధించి ప్రభుత్వం రూ. 50 వేలు (అందులో కొన్ని వస్తువులు, మరి కొంత నగదు) అందించాల్సి ఉంది. అయితే వివాహమై ఆరు నెలలైనా  ప్రస్తుతం స్పందించని పరి స్థితి చూస్తే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో దాదాపు ఆరు నుంచి ఎనిమిది  నెలలుగా అప్‌లోడ్‌ చేస్తున్నా....ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన రావడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు దాదాపు 2050 మంది దరఖాస్తు చేసుకున్నారు.

తప్పని తిప్పలు:దుల్హన్‌ పథకానికి సంబంధించి చాలా రోజులుగా నిధులు రాకపోవడంతో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయానికి వెళ్లి వాకబుచేసుకుంటున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదంటున్నారు. ప్రస్తుతం రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే వస్తాయని అధికారులు అంటున్నారు. అయితే లబ్ధిదారులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.
క్వార్టర్ల ప్రకారం నిధులు:  మూడు నెలలకు ఒకసారి క్వార్టర్ల పద్ధతిన నిధులు అందిస్తూ వస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే 20117–18 సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్‌ ని«ధులు ఇంకా విడుదల కాకపోవడంతో సంబంధిత కార్యాలయాలకు రాలేదు. మార్చికే రావాల్సి ఉంది. అదనంగా మరో రెండు నెలలు కావస్తున్నా విడుదలలో జాప్యం జరుగుతోంది.  డిసెంబరు నుంచి దరఖాస్తు చేసుకున్న వారు ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు.  చివరిక్వార్టర్‌ నిధులు విడుదల చేయాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

చంద్రన్న పెళ్లి కానుకలోకి ‘దుల్హన్‌’: ముస్లిం మైనార్టీలకు సంబంధించి దుల్హన్‌ పథకం ద్వారా రూ. 50 వేలు అందించే దీనిని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. ఇకనుంచి ముస్లిం మైనార్టీలు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చే యాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఆయా గ్రామాలు, మండలాల పరిధిలో స్వయం సహాయక సంఘాల్లోని ప్రత్యేక మహిళలు విచారణ చేసి వివరాలు నమోదు చేయడం ద్వారా దరఖాస్తుదారులకు పెళ్లి కానుక అందనుంది. ఏప్రిల్‌ 17న ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక అమలులోకి తీసుకొచ్చింది.

త్వరలో విడుదల
దుల్హన్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్న యువతులకు నిధులు విడుదల కావాల్సి ఉందని, ఈ నిధులు రాగానే త్వరలోనే పంపిణీకి చర్యలు తీసుకుం టామని మైనార్టీ సంక్షేమశాఖాధికారి ఖాదర్‌బాషా తెలిపారు. అందుకు సంబంధించిన నిధులు రంజాన్‌ మాసంలోనే వస్తాయని సంకేతాలు అందాయన్నారు. చివరి క్వార్టర్‌లో నిధులు రానున్నట్లు వెల్లడించారు. నిధులు రాగానే వెంటనే పంపిణీకి చర్యలు చేపడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement