వక్ఫ్‌భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
► రెవెన్యూ పోలీసు అధికారుల సహకారం
► దుల్హాన్ పథకం అమలులో కర్నూలు టాప్
► రాష్ట్రమైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ ఎండీ ఎక్బాల్
కర్నూలు(అగ్రికల్చర్): వక్ఫ్ భూముల ఆక్రమణ లకు చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ ఎండీ ఎగ్బాల్ తెలిపారు. ఇప్పటికే అక్రమణలో ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఇందుకు పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటామని చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015-16లో దుల్హాన్ స్కీమ్ అమలులో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా పేద ముస్లీం , క్రిష్టియన్ యువతుల వివాహ సమయంలో రూ.50 వేల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి 2015-16లో జిల్లాలో 498 మందికి రూ.2.49 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించగా జనవరి నాటికే అధికమించారన్నారు.
2016-17కు సంబంధించి ఇప్పటికే 1522 దరఖాస్తులు వచ్చాయని, ఇందుకు అవసరమైన రూ.7.22 కోట్లను వారంలో విడుదల చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ అధికారి, తహసీల్ధారు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దళారీలు గంప గత్తగా తెచ్చే దర ఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. రాష్ట్రంలో 10వేల మసీదులుండగా మొదటి విడత కింద 2500 మసీదులను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
జిల్లావ్యాప్తంగా 81 మసీదులు, శ్మశానాలు, ఈద్గాలకు రూ.8.91 కోట్లు అవసరమంటూ నివేదికలు అందించారని, ఈ మేరకు నిధులు ఇస్తామన్నారు. కర్నూలు ముస్లిం రెసిడెన్షియల్ స్కూలును 4.90 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు సీఈఓ అబ్దుల్ ఖదీర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్‌మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.