అధికార పార్టీ నేతల బరితెగింపు
పెనమలూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములను రాత్రికి రాత్రే ఆక్రమించుకోవడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిపోయారు. వరినాట్లు వేసి మరీ కబ్జా చేయడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప పరిధి లోని ఆర్‌ఎస్ నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమి ఆక్రమణకు గురవుతోందని బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
దీనిపై తహసీల్దార్ గోపాలకృష్ణ స్పందించి.. వక్ఫ్ భూముల లీజ్ కోసం ఈ నెల 31వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు శుక్రవారం సాయంత్రం చీకటి పడుతుండగా చకచకా వరి నాట్లు వేశారు. సమాచారం తెలుసుకున్న వక్ఫ్ అధికారులు భూమి వద్దకు వెళ్లి చూసి.. తహసీల్దార్‌కు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు.
రాత్రి వేళ ఏమీ చేయలేమని, ఏం చేయాలో శనివారం ఆలోచిద్దామని వారు చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే అక్రమంగా నాట్లు వేసిన వారిపై కేసులు పెట్టాలని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని మైనార్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ బాషా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment