సాక్షి, కర్నూలు(హాస్పిటల్): దుల్హన్ పథకం వర్తింపునకు సవాలక్ష ఆంక్షలు ఎదురవుతుండటంతో చాలా మంది ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. అన్ని ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకొ రెండేళ్లయినా మైనార్టీలకు ఆర్థిక సహాయం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, కులాంతర వివాహాలు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పెళ్లి చేసుకుంటే ఆయా శాఖల కింద ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు. ఈ మేరకు 11శాఖల్లో ఈ పెళ్లి తంతు నడిచేది.
లబ్ధిదారులు అనేక పథకాల ద్వారా ఎక్కువ సార్లు ప్రోత్సాహకం అందుకుంటున్నారని అనుమానించిన రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి కానుక అంతా ఒకే వేదిక(సింగిల్ డెస్క్)పై ఉండాలని నిర్ణయించింది. దీని బాధ్యతను 11 శాఖలనుంచి తప్పించి డీఆర్‌డీఏ–వెలుగు శాఖకు అప్పగించింది. అందులో పనిచేసే అధికారులతో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు గ్రామాల్లో వెయ్యి మందికి పైగా కల్యాణ మిత్రలు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కల్యాణ మిత్రలుగా స్వయం సహాయక సంఘాలు (పొదుపు మహిళలు)ను ఎంపిక చేశారు. పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.40వేలు, బీసీలకు రూ.35వేలు, ఎస్టీలకు రూ.50వేలు, మైనార్టీలకు రూ.50వేలు, దివ్యాంగులకు రూ.లక్ష, ఎస్సీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు ప్రోత్సాహక నగదుగా అందజేస్తారు.
పథకానికి దూరంగా వేల మంది..
జిల్లాలో పెళ్లి కానుక పథకం కింద 10,338 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 10,014 పెళ్లిళ్లు జరిగాయి. ఇంకా 324 పెళ్లిళ్లు జరగాల్సినవి. వివాహమైన వారిలో 679 జంటలకు 20 శాతం మాత్రమే అందజేశారు. 8,942 జంటలకు వంద శాతం ప్రోత్సాహక నగదు అందజేశారు. మొత్తం 9,621 వివాహాలకు గాను రూ.38.45కోట్లను ఈ పథకం కింద ఇప్పటి వరకు ఖర్చు చేశారు.
అయితే పథకానికి అర్హులైన మరో పదివేల మందికి పైగా దూరంగా ఉండిపోయారు. పలు కారణాలతో ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు. స్థానికంగా గాక ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రాష్ట్రస్థాయిలో స్క్రీనింగ్ జరగడం, అక్కడి బడ్జెట్‌ను బట్టి ప్రోత్సాహక నగదును విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్హులు చాలా మంది ఈ పథకానికి దూరంగా ఉండిపోయారు.
రెండేళ్లయినా అందని దుల్హన్ ఆర్థిక సహాయం
రెండేళ్ల (ఏప్రిల్ 2017) నుంచి జిల్లాలో 200 మంది నిరుపేద మైనార్టీ మహిళలు పెళ్లి చేసుకుని అవసరమైన అన్ని ధ్రువ పత్రాలతో సహా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం జిల్లా మైనార్టీస్ సంక్షేమాధికారికి హార్డ్ కాపీని సమర్పించి, వారికి రావాల్సిన రూ.50వేల ఆర్థిక సహాయం కోసం మైనార్టీ కార్యాలయం, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి ఫిర్యాదుల విభాగం, 1100కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో జమకాలేదు.
ఇదిలా ఉండగా ఈ పథకంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించినట్లు చెబుతున్నా 200 మందికి రెండేళ్ల నుంచి ఎందుకు మంజూరు కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన సిబ్బందిని నియమించే విషయంలో కూడా ఐదేళ్ల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి.
డబ్బులు రాలేదు
2017 మే 21న నా కుమార్తె దూదేకుల రేష్మ వివాహం చేశాను. దుల్హన్ మ్యారేజ్ స్కీంలో టోకెన్ నంబర్ 1325027/2018 ఇచ్చారు. రెండేళ్లవుతున్నా.. మైనార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఈ నెల.. వచ్చే నెల అంటూ అధికారులు తిప్పుకుంటున్నారు కానీ డబ్బులు రాలేదు.
– దూదేకుల మౌలాలి, బీఆర్‌రెడ్డి కాలనీ, కల్లూరు
Comments
Please login to add a commentAdd a comment