
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో పసల వెంకటేసులు కుటుంబం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉపాధిహామీ పథకంలో పనులు చేసింది. ఈ 4 నెలల్లో రూ.24,504 సంపాదించుకుంది. ఇదే కాలంలో ఆ గ్రామంలో మొత్తం 1,341 కుటుంబాలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ఆ ఒక్క గ్రామంలోనే కూలీలు రూ.2.41 కోట్లను వేతనాల రూపంలో పొందారు.
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కువమంది గ్రామీణ పేదలకు ప్రభుత్వపరంగా పనులు కల్పిస్తున్నది మన రాష్ట్రంలోనే. దేశంలోనే ఉపాధిహామీ పథకం కింద ఎక్కువమందికి పనికల్పించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 4 నెలల కాలంలో ఉపాధిహామీ పథకం ద్వారా మన రాష్ట్రంలో 71.90 లక్షల మందికి ప్రభుత్వం పనులు కల్పించినట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్‌లో 65.53 లక్షల మందికి అక్కడి ప్రభుత్వం పనులు కల్పించింది. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా.. అందులో ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలు మాత్రమే ఈ 4 నెలల కాలంలో వారి రాష్ట్రాల్లో 50 లక్షల మంది కన్నా ఎక్కువమంది పేదలకు పనులు కల్పించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 1.03 కోట్ల మంది ఉపాధి హామీ పథకంలో కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకుంటే, అందులో 70 శాతం మందికి పైగా ప్రభుత్వం ఈ కరోనా విపత్తు కాలంలో పనులు కల్పించడం గమనార్హం.
రోజుకు సరాసరి కూలి రూ.221
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు ఈ 4 నెలల్లోనే రూ.4,485 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఒకరోజు పనిచేసినందుకు ఒక్కొక్క కూలీకి సరాసరిన రూ.221 వంతున గిట్టుబాటు అయినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment