వేసవి ‘ఉపాధి’లో ఏపీనే టాప్‌ | Andhra Pradesh Tops in Mgnrega Works in Summer 2022 | Sakshi
Sakshi News home page

వేసవి ‘ఉపాధి’లో ఏపీనే టాప్‌

Published Sat, May 28 2022 2:47 AM | Last Updated on Sat, May 28 2022 2:51 AM

Andhra Pradesh  Tops in Mgnrega Works in Summer 2022 - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుత వేసవిలో ఏ పనులు దొరక్క అల్లాడుతున్న గ్రామీణ పేదలకు   ఉపాధి హామీ పథకం ద్వారా 32,26,429 కుటుంబాలకు ఏప్రిల్‌ – మే నెలలో పనులు కల్పించి  రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పనిదినాల పాటు పనులు కల్పన.. ఎక్కువ కుటుంబాలకు పనులు కల్పన.. రెండు కేటగిరిల్లోనూ దేశంలో మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో నిలిచింది. వేసవిలో 2.51 కోట్ల పనులు కల్పించగా... అందులో 32.26 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలవగా..  తమిళనాడు, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, గడిచిన రెండు నెలల్లో 7,60,48,307 పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించి దేశంలోనే అత్యధిక పనిదినాలు కల్పించిన రాష్ట్రంగా ముందంజలో ఉంది.  ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

రెండు నెలల్లో రూ. 1392 కోట్లు లబ్ధి..
గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లోనూ పేదలు ఈ రెండు నెలల్లో రూ. 1392.72 కోట్ల మేరకు లబ్ధి పొందారు. ఇందులో మూడో వంతు ఎస్సీ, ఎస్టీ వర్గాలే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పనులకొచ్చే కూలీలు ఎండల కారణంగా  ఉదయం 6.30 గంటలకే పనులు మొదలుపెట్టి 9 గంటల కల్లా ఒక విడత ముగిస్తున్నారు. కూలీలకు ఇష్టమైతే సాయంత్రం మరో విడత కూడా పనులు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. దీంతో రోజుకు సరాసరిన ఒక్కొక్కరికీ రూ.195 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతుంది. 

మూడో విడతగా మరో రూ. 670 కోట్లు 
ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌– మే)లో మూడో విడతగా శుక్రవారం మరో రూ. 670.58 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే  మొదటి విడతగా రూ. 929.20 కోట్లు, రెండో విడతగా రూ. 228.91కోట్లను మదర్‌ శాంక్షన్‌గా  మంజూరు చేసిందని, అంటే ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటి వరకు  మొత్తం రూ. 1828.69 కోట్లకు మదర్‌ శాంక్షన్‌ ఇచ్చినట్లవుతుందని ఆయన వివరించారు.  కాగా ఇప్పటివరకు రూ. 955.49 కోట్లు  రోజువారీ వేతన ఎఫ్‌టీవోల అప్‌లోడ్‌ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని తెలిపారు. పనిచేసిన మూడు రోజుల్లోనే కూలీల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement