
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) విషయమై ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని బీజేపీ అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారని సోనియా గాంధీ ఆరోపించారు. ఈ పథకాన్ని మూసివేయడం ఆచరణాత్మకం కాదని గ్రహించి అపహాస్యం చేయడానికి మోదీ ప్రత్నించారని ఓ ఆంగ్లపత్రికలో తన అభిప్రాయాన్ని సోనియా గాంధీ వ్యక్తం చేశారు.(‘ఉపాధి హామీ’ వైపు నిరుద్యోగ యువత చూపు)
లాక్‌డౌన్‌లో పేద ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో ఉండగా ఈ పథకం తన ప్రాముఖ్యతను కొనసాగించిందన్నారు. అనంతరం బీజేపీ అధికారంలో వచ్చాక దీన్ని అణగదొక్కడానికి ప్రయత్నించి, చివరకు అయిష్టంగానే కొనసాగించిందని చెప్పారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి సజీవ స్మారక చిహ్నం ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ అని పిలిచేవారని గుర్తు చేశారు. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొన్న ప్రభుత్వం, యూపీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధిహామీ పథకం విషయంలో నిర్లక్ష్యాన్ని వదలాలని హితవుపలికారు. (పీఐబీ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్..)
‘ఇది జాతీయ సంక్షోభ సమయం, రాజకీయాలు చేసే సమయం కాదు. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సమస్య కాదు. మీ చేతిలో శక్తివంతమైన యంత్రాంగం ఉంది. దయచేసి భారతదేశ ప్రజలకు అవసరమైన సమయంలో వారికి సహాయపడటానికి దీనిని ఉపయోగించండి’ అని సోనియా గాంధీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.(ఢిల్లీ నిర్ణయంపై మాయవతి అభ్యంతరం)