'ఉపాధి హామీ'తో హరిత భారతం
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ అంటూ దేశాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన కేంద్ర సర్కారు త్వరలోనే గ్రీన్ ఇండియా(హరిత భారతం) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) సహాయంతో పరుగులు పెట్టించనుంది. దశాబ్ద కాలంలో దేశంలో అటవీ ప్రాంతాలను మరింత మెరుగుపరచాలని, దాదాపు 10 మిలియన్ హెక్టార్లలో హరిత వనాలను పెంచి పోషించాలని, వీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ సెన్సింగ్తో నియంత్రణ చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పలు చిన్న చిన్న వ్యవసాయ సంబంధ పనులు తీసుకొచ్చిన కేంద్రం తాజాగా అటవీ వనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని కేంద్ర అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో 'నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా' కొనసాగనుంది.