‘ఏపీకి 18 వేల కోట్లు ఇచ్చాం’ | YSRCP MP Vijaya Sai Reddy Question In Rajya Sabha On NREGA Funds For AP | Sakshi
Sakshi News home page

‘ఏపీకి 18 వేల కోట్లు ఇచ్చాం’

Published Mon, Feb 11 2019 6:28 PM | Last Updated on Mon, Feb 11 2019 8:28 PM

YSRCP MP Vijaya Sai Reddy Question In Rajya Sabha On NREGA Funds For AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద నాలుగేళ్ళ వ్యవధిలో ఆంధ్ర ప్రదేశ్‌కు 18 వేల 562 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు రాజ్య సభలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్‌ కృపాల్‌ యాదవ్‌ వెల్లడించారు. నరేగా కింద ఏపీకి 2015-16లో 2856.85 కోట్లు, 2016-17లో 3997.46 కోట్లు, 2017-18లో 5287.32 కోట్లు 2018-19 (ఫిబ్రవరి 5 నాటికి) 6420.94 కోట్లు నిధులను కేంద్రం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

ఉపాధి హామీ చట్టం కింద డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే పథకం ఇది. అందువలన ఏ రాష్ట్రానికి కేటాయింపు ముందుగా జరగదని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డిమాండ్‌కు తగినట్లుగా ఉపాధి కల్పించడానికి శాయశక్తులా కృషి చేసినట్లు తెలుపుతూ మంత్రి అందుకు అనుగుణంగా గణాంకాలను వివరించారు. ఈ పథకం అమలులో నిధుల దారి మళ్ళింపు, అవకతవకలకు సంబంధించి తమ మంత్రిత్వ శాఖకు అందే ఫిర్యాదులపై తగు విచారణ, చర్యల కోసం పథకాన్ని అమలు చేస్తున్న ఆయా రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

చిత్తూరు, విశాఖ జిల్లాల్లో 2288 పంచాయతీలకు బ్రాడ్‌ బాండ్‌
మూడు దశల కింద దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి బ్రాడ్‌ బాండ్‌ కనెక్షన్‌ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రారంభించిన భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు 2288 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌ బాండ్‌ సర్వీసును అందించినట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సోమవారం రాజ్య సభకు వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ రెండు జిల్లాల్లో మిగిలిన 614 గ్రామ పంచాయతీలకు భారత్‌నెట్‌ రెండో దశ కింది బ్రాడ్‌ బాండ్‌ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుందన్నారు. భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌లో మూడు దశల కింద దేశంలోని 2 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికల్లా బ్రాడ్‌ బాండ్‌ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఏపీలో 670 కి.మీ మేర రహదారుల విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో 670 కిలో మీటర్ల మేర రహదారులను నాలుగు లేదా ఆరు లేన్లుగా విస్తరించే పనులను చేపట్టినట్లు రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సోమవారం రాజ్య సభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మరో 505 కిలో మీటర్ల మేర రహదారుల విస్తరణ కోసం డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) రూపకల్పన జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో 550 కిలో మీటర్ల మేర సింగిల్‌ లేన్‌ జాతీయ రహదారులు, 3459 కిలో మీటర్ల మేర డబుల్‌ లేన్‌ రహదారులు ఉన్నాయని మంత్రి చెబుతూ పెరిగే ట్రాఫిక్‌, నిధుల అందుబాటును బట్టి వీటిని దశల వారీగా విస్తరించడం జరుగుతుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement