కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ప్రకటించి, అందరూ ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తూనే మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఏప్రిల్ నుంచి వేగవంతం చేసింది. కూలీలు 20–25 మంది బృందాలుగా ఏర్పడి ఒకేచోట పనులు చేస్తున్నారు. భౌతికదూరాన్ని పాటించేందుకు అవ కాశం లేదు. కుటుంబ పోషణకు గత్యంతరం లేకనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొనైనా వీరు పనులకు వెళ్లక తప్పడం లేదు.
దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద 13.65 కోట్ల జాబ్‌కార్డులున్న కుటుంబాలున్నాయి. తెలంగాణలో 52.46 లక్షల కుటుంబాలున్నాయి. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా రూ. 211 నుంచి రూ. 237కు నామమాత్రంగా పెంచుతూ ఈ మేరకు మార్చి 26న ప్రధానమంత్రి ప్రకటన చేశారు.
రోజుకు ఏడు గంటలు పని చేస్తేనే పెరిగిన కూలి వర్తిస్తోంది. ఈ పెంపు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా తమకు రోజూ రూ. 100–150 లోపే అందుతోందని కూలీలు వాపోతున్నారు. పైగా పని ప్రదేశాలకు సుమారు 5–6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. కనీసం రూ. 500 వరకూ చెల్లించాలని వీరు కోరుతున్నారు. పైగా వీరికి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు.
వేసవి కావడంతో ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో టెంట్ సౌకర్యం కల్పించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ వైద్యం కోసం మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలి. ఇవన్నీ కల్పించాలని ఉపాధి చట్టంలో పేర్కొన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తాగడానికి నీటి ఏర్పాటు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచే కూలీలు తెచ్చుకుంటున్నారు.
రైతుబంధు పథకం లాగానే కూలీబంధు పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. వ్యవసాయ, ఇతర అన్ని రకాల పనులు ఎక్కువగా కష్టపడి పని చేస్తున్న శ్రామికవర్గం ఈ కూలీలే. ఎక్కువ పేదరికం అనుభ విస్తుంది కూడా వీరే. వీరికి బీమా సౌకర్యం కల్పించాలి. పని లేని సమయంలో నెలకు రూ.7500 భృతి అందించాలి. ప్రస్తుతం సంవత్సరంలో వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. కనీసం 150–200 రోజులకు పొడిగించాలి. ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. వృద్ధ కూలీలకు పెన్షన్ కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకూ వర్తింపజేయాలి.
పట్టణాల్లోనూ అత్యధిక సంఖ్యలో కూలీలున్నారు. ఏడాదిలో కొన్ని మాసాలు ఎలాంటి పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.
వికలాంగ కూలీలకు కూడా ఉపాధి హామీలో తీరని అన్యాయమే జరుగుతోంది. వీరితో స్థానికంగా గ్రామ శివారుల్లోనే పనులు చేయించాలి. కానీ దూర ప్రాంతాల్లో రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో నున్న లోతైన కాల్వ పనులు, వారు చేయలేని పనులు చేయిస్తున్నారు. పైగా వీరు చేసే పనికి అదనంగా 40 శాతం కూలి కలిపి ఇవ్వాల్సి వుండగా, చేసిన పనికి మాత్రమే ఇస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో న్యాయంగా రావాల్సింది అందించాలి.
రాష్ట్రంలో 7,800 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గత 14–15 ఏళ్లనుంచి నామ మాత్రపు వేత నాలతో పని చేస్తున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ చదు వుకున్నా ఉద్యోగావకాశాలు లేక ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లయిన నెలకు 10 వేల రూపాయల వేతనం ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ మార్చి 12 నుంచి 23 వరకూ సమ్మెలో ఉన్నారు.
కానీ ప్రభుత్వం వారిని నిరంకుశంగా సస్పెండ్ చేయడంతో వీధిన పడ్డారు. గతంలో చేసిన పనులకు సైతం జీతాలు నిలుపుదల చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనులు ఫీల్డ్ అసి సెంట్లు లేకుండానే జరుగుతున్నాయి. ఆ బాధ్యతను ఎలాంటి అనుభవం లేని గ్రామ కార్యదర్శులకు బల వంతంగా అప్పజెప్పారు. ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్ ఎత్తివేసి, వారిని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేటాయించే బడ్జెట్‌తోపాటు, ప్రతి సంవ త్సరం అదనంగా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోంది. కొలతతో సంబంధం లేకుండా గిట్టుబాటు కూలీ లను చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా పనులు కల్పిస్తోంది. ఈ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా తగు చర్యలు చేపట్టాలి.
– వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment