సాక్షి,మద్దికెర: వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేసినా వేతనాలకు అందకపోవడంతో వలసలు తప్పడం లేదు. నాలుగు నెలలుగా చేసి న పనులకు వేతనాలు దాదాపు రూ.1.50 కోట్లు ఇంత వరకు ఇవ్వకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 10 వేల జాబ్ కార్డులున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ పనులు ముగిసిన గ్రామాల్లో దాదాపు వెయ్యి మంది ఉపాధి కూలీలు పనులకు వెళ్తున్నారు. ఉపాధి కల్పించి సకాలంలో వేతనాలు చెల్లిస్తామని అధికారులు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి కూలీలకు తెల్పడంతో వారు పనులకు వెళ్లారు. అయితే పనులు చేసినా వేతనాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నందు వల్ల్ల వారు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇలా అయితే ఎవరి కోసం ఉపాధి పనులు కల్పించినట్లు అని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
నాలుగు నెలల గడిచినా కూలి ఇవ్వలేదు..
ఉపాధి పనులు చేసి నాలుగు నెలలు గడిచినా.. ఇంత వరకు వేతనాలు ఇవ్వలేదు. ఇలా అయితే పనులకు ఎలా వెళ్లేది.మా జీవనం ఎలా సాగుతుంది. అధికారులు స్పందించి సకాలంలో వేతనాలు ఇస్తే.. గ్రామాల్లో వలసలు కూడా తగ్గుతాయి.
– తిమ్మయ్య, పెరవలి
వేతనాలు మంజూరు చేస్తాం...
నాలుగు నెలలు వేతనాలు రావాల్సి ఉంది. కూలీలకు వేతనాలు మంజూరు విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి సకాలంలో వేతనాలు అందించేందుకు కృషి చేస్తాం. వేతనాలు మంజూరులో ఆలస్యమైన మాట వాస్తవమే.. పనులు చేసిన వారందరికీ వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– రామకృష్ణ, ఏపీఓ
Comments
Please login to add a commentAdd a comment