no wages
-
జీతాలడిగితే.. ఉద్యోగాలు లేకుండా చేస్తా..
సాక్షి, విజయనగరం : జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఏఈ రాజ్‌కుమార్, కాంట్రాక్టర్ భరత్ బెదిరింపులకు దిగుతున్నారని నరవ యూజీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జీతాలిప్పించండి మహాప్రభో’ శీర్షికతో ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జీతాలివ్వాల్సిందిపోయి ఉద్యోగాలు తీసేస్తామంటూ కాంట్రాక్టర్ భరత్, ఆయనకు వంతపాడుతూ ఏఈ రాజ్‌కుమార్ బెదిరింపులకు దిగుతున్నారు. ఉద్యోగుల పక్షాన ఉండవలసిన ఏఈ.. కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాంట్రాక్ట్ సమయం ముగిసినా ఇంకా ఇక్కడి ప్లాంట్‌లో చెలామణి చేస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా నిబద్ధతో విధులు నిర్వహిస్తున్నామన్న జాలి కూడా చూపడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
జీతాలు చెల్లించండి బాబోయ్
సాక్షి, మైలవరం(కృష్ణా) : గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పేదలు నరకయాతన పడుతున్నారు. ఉపాధి కోసం స్కూళ్లలో చేరిన పారిశుద్ధ్య కార్మికులను రెండేళ్లుగా జీతాలు చెల్లించకుండా ఆటలాడుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో స్వీపర్లును నియమించింది. నెలకు రూ.1500 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అరకొరగా జీతాలు చెల్లించి తరువాత రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేశారు. దీంతో స్వీపర్లు సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం జీతాలు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పాఠశాలలు ఉండగా 1200 పాఠశాలల్లోనే స్వీపర్లును నియమించారు. కొన్ని పాఠశాలల్లో గతం నుంచి పనిచేస్తున్న అటెండర్లతోనే ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. 23 నెలలుగా వారికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వీపర్లు అనేక సార్లు వేతనాలు చెల్లించాలని పలు మార్లు నిరసన తెలిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మైలవరం నియోజకవర్గంలో 120 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. నందిగామ మండలంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 56వరకు ఉన్నాయి. నూజివీడు మండలంలో 85 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. తిరువూరు మండలంలో 61 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని 4,500 పాఠశాలల్లో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే స్వీపర్ల నియామకం జరిగింది. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాని పట్టించుకున్న నాథుడే లేడు. -
ఉద్యోగుల ‘వేదన’ బతుకులు
సాక్షి, చిత్తూరు : ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు ఉద్యోగులనే తేడా ఉండదు. అందరూ సమానమే. ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. విజయవాడలోని ప్రధానశాఖ నుంచి రిపోర్టులు పంపమని ఆదేశాలు జారీచేస్తుంటారు. ప్రభుత్వ పథకాలను టీడీపీకి లబ్ధిచేకూర్చే పథకాలుగా మార్చేస్తుంటారు. వాటిపై ప్రచారాలు చేయాలంటూ చిరుద్యోగులపై ఒత్తిడి పెంచేస్తుంటారు. కాదన్న వారిని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తుంటారు. లేదంటే మానసిక క్షోభకు గురిచేయడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. జిల్లాలో ఈ ఐదేళ్లలో ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు పడ్డ బాధలు అన్నీఇన్నీకావు. ఎవరిని కదిలించినా కష్టాలగాథలే. టీడీపీ పాలనలో చితికిపోయిన తమ బతుకుల గురించి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మరీ చెప్పడం కలచివేస్తోంది. కుటుంబ జీవితాలకు దూరం జిల్లాలో దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే.. వీరికి సమానంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఉద్యోగికీ కనీస పనిగంటలనేవి లేవు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పనిచేసి ఇళ్లకు వెళ్లిన దాఖలాలులేవు. పైగా సెలవు రోజుల్లో కూడా కార్యాలయాల్లో కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగత జీవనంతో పాటు కుటుంబ జీవితానికి వారు దాదాపు దూరమైపోయారు. గొడ్డుచాకిరీ చేసినా కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలు సగటున రూ.15 వేలు కూడా రాలేదు. చాలీచాలని జీతాలతో మూడు పూటలు గడవని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తికాదేమో. ఓ ఆశా వర్కర్‌కు పారితోషికంతో కలిపి నెలకు రూ.6 వేలు వస్తే ఇద్దరు పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివించి, ఇల్లు గడపడానికి ఏటా రూ.50 వేల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి. మరణమే శరణమా? జిల్లా వెలుగు శాఖలో పనిచేసే పది మంది వరకు ఈ ఐదేళ్లలో చనిపోయారు. మితిమీరిన పని ఒత్తిడే ఈ మరణాలకు కారణం. మృతుల్లో మొలకలచెరువుకు చెందిన ఏరియా కో–ఆర్డినేటర్ రమేష్, కార్వేటినగరం ఏరియా ప్రాజెక్టు మేనేజరు గిరిజ, క్లస్టర్ కో–ఆర్డినేటర్ భాస్కర్, చిన్నగొట్టిగల్లు క్లస్టర్ కో–ఆర్డినేటర్ చెంగల్రాయులు ఉన్నారు. ఇదేశాఖకు చెందిన గంగవరం క్లస్టర్ కో–ఆర్డినేటర్ గురుమూర్తి, గుడిపాలకు చెందిన వెంకటేశులు పక్షవాతంతో మంచాన పడ్డారు. మదనపల్లె మునిసిపాలిటీలో 2016లో శ్రీనాథ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి చెప్పినపని చేయలేదంటూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు విధుల్లో నుంచి తొలగించడం.. అతను ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల్లో సమాధానాలు చెప్పలేక పుత్తూరు మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన సాంబశివరావు పక్షవాతంతో మంచంపట్టిన విషయం మరచిపోలేరు. వేతనాల్లేక విలవిల జిల్లా వైద్యశాఖలో పనిచేసే 3,250 మంది ఆశా వర్కర్లకు పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు ఇస్తామంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతనాలు అందాలి. కానీ మూడు నెలలుగా రూపాయి వేతనం ఇవ్వలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లించాల్సిన జీతాలను ఇవ్వడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. చిత్తూరులో పనిచేసే 3 వేల మంది హోంగార్డులకు బడ్జెట్‌లేదనే సాకుతో ఐదు నెలలుగా జీతాలివ్వలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్న మహిళా సంఘాలకు మూడు నెలలుగా రూ.2.51 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల వెతలు జిల్లా గృహనిర్మాణశాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 400 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే (2014లో) తొలగించింది. ప్రతి మండలంలో ఐదుగురు ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ల స్థానంలో ప్రస్తుతం ఒక్కరే పనిచేయాల్సి వస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో 2005 నుంచి పనిచేస్తున్న 380 మంది ఫీల్డు అసిస్టెంట్లపై పనితీరు నివేదిక బాగాలేదని నాలుగేళ్ల క్రితం వేటు వేశారు. వ్యవశాయశాఖలో పనిచేసిన 2,800 మంది ఆదర్శరైతులు అవసరం లేదంటూ తీసేశారు. ఐదేళ్ల క్రితం వీరిని తొలగించే సమయానికి ఒక్కో ఆదర్శరైతుకు రూ.5 వేలు చొప్పున వేతనాలను ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూడా సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న రిసోర్సుపర్సన్లను, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిపి 3,800 మందిని ప్రభుత్వం తొలగించింది. -
బాబూ... నిన్ను నమ్మేదెలా..?
సాక్షి, నెల్లూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో ఏ మాత్రం మార్పులేదు. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి అనేక వర్గాల కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. వారిని రోడ్ల పాలు చేశారు. అడిగేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులతో కొట్టించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన సీఎం కావాలని అన్ని వర్గాలు నమ్మి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఉన్న 80 వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులను చుక్కలు చూపించారు. గౌరవ వేతనం కోసం ఆందోళన చేస్తే పోలీసులతో లాఠీలతో కొట్టించి, మమ్మల్ని రోడ్లపై ఈడ్పించి కేసులు పెట్టించాడు. ప్రభుత్వ బడులకు వెళ్లి చదువుకొనే పిల్లలకు కడుపు నిండా తాము భోజనం వండి పెడుతుంటే అది కూడా మా నుంచి లాక్కోని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పేద బిడ్డల భోజన పథకానికి నిధులు ఇవ్వకుండా ఆపేశారు. ఇలాంటివన్నీ చేసినందుకా నీకు ఓటేయ్యాలంటూ నిలదీశారు. ఇలాంటి నిన్ను నమ్మి మళ్లీ ఓటెందుకు వేయాలి’ అంటూ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె విజయమ్మ ప్రశ్నంచింది. ఇక నిన్ను నమ్మం బాబూ అంటున్న ఆమె ‘సాక్షి ప్రతినిధి’తో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడిన కష్టాలు ఏకరవు పెట్టారు. గౌరవ వేతనం కోసం ఆందోళన చేస్తే.. మాకు నెలకు రూ.1000 మాత్రమే గౌరవ వేతనం వస్తుంది. మా కష్టానికి తగిన వేతనం ఇవ్వాలని ఎన్నో సార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఐదేళ్ల పాలనలో వేతనం పెంచమని నిరసనలు తెలిపినా ఏ మాత్రం చలనం లేదు. చర్చల పేరుతో మమ్మల్ని పిలిపించి పిల్లలకు భోజనం సక్రమంగా పెట్టడం లేదంటూ బెదిరింపులకు దిగారు. గత్యంతరం లేక మూడుసార్లు అమరావతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మాపై పోలీసులను ఉసిగొల్పారు. నిరసన చేస్తే మమ్మల్ని పోలీసులతో లాఠీలతో కొట్టించి రోడ్లపైనే ఈడ్చుకుంటూ వెళ్లి కేసులు నమోదు చేసి లోపల కూర్చోబెట్టి మా పరువు తీశారు. ఆరు నెలల నుంచి వేతనాలు, బిల్లులు ఇవ్వట్లేదు ఆరు నెలల నుంచి మాకు బిల్లులతో పాటు వేతనాలు నిలిపి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. నెలవారీగా దాదాపు రూ.40 వరకు బిల్లులు ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలలుగా నిలిపివేస్తే మేమెట్లా వండి పెట్టాలి. ఎన్నికల కోసం మహిళలపై ప్రేమ ఉన్నట్లు పసుపు–కుంకుమ కింద పోస్ట్ పెయిడ్ చెక్కులిచ్చావు. మరి వంట వండి పేద బిడ్డలకు ఆకలి తీర్చుస్తున్న మేము మహిళలమే కదా.. మాకెందుకు వేతనాలు, బిల్లులు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఏజెన్సీల కోసం.. నెల నెలా బిల్లులు ఇవ్వకున్నా అప్పు చేసి వంట వండి పేద బిడ్డల ఆకలి తీర్చుతున్నాం. ఇంటి వంటతో వారికి రుచికరమైన భోజనం అందిస్తున్న మా నుంచి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ లాక్కొని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి మా కడుపులు కొట్టారు. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలను ఇప్పటికే ఢిల్లీకి చెందిన నవప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించిన చోట్ల పిల్లలకు ఎన్నిసార్లు ఫుడ్‌పాయిజన్ అయి అస్పత్రి పాలయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం, మనుబోలులో కూడా స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే భోజనంలో బల్లి పడిన సం«ఘటనలు న్నాయి. కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో కూడా ప్రైవేట్ ఏజెన్సీలు చేసే భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఇచ్చేది రెండు రూపాయలే.. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చేది రూ.4.13లే. కానీ అందులో కోడిగుడ్డు, వంటనూనె సరఫరాను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఇచ్చే నాలుగు రూపాయల్లో రెండు రూపాయలు మాకు తగ్గించి ఆ డబ్బులు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. బయట మార్కెట్లో పామాయిల్ ప్యాకెట్ రూ.50లకే వస్తుంటే.. ప్రైవేట్ ఏజెన్సీ వాళ్లు మాత్రం పామాయిల్‌ను రూ.90 వంతున సరఫరా చేస్తున్నారు. మాకు మాత్రం బిల్లులు ఇవ్వరు.. ప్రైవేట్ ఏజెన్సీలకు మాత్రం ఠంచన్‌గా నిధులు మంజూరు చేస్తున్నారు. మీ కమీషన్ల కోసం మా కడుపులు కొడతారా? వేతనాలు పెంచామని మోసం ఐదేళ్ల కాలంలో గౌరవ వేతనం పెంచాలని ఎన్నో నిరసనలు చేస్తే ఎన్నికల సమయంలో గౌరవ వేతనం రూ.3 వేలు పెంచామని హామీ ఇచ్చారు. కానీ పెంచిన వేతనం ఇప్పటిì వరకు మాకు అందలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వేతనం పెంచుతున్నట్లు మోసం చేశాడు. ఐదేళ్ల పాటు నీవు చేసిన మోసం గురించి మా చేతి వంట తినే విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నీ మోసాలను వివరించి చెబుతాము. నిన్ను నమ్మితే నిలువునా మోసం చేస్తావని చెప్తాం. ఇక నిన్ను నమ్మి ఓటేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
కళాకారులంటే అంత చులకనా?
సాక్షి,విజయవాడ : ఏపీ సృజనాత్మక సమితి, రాష్ట్రంలోని పేద కళాకారుల సంక్షేమం కోసం, భాషా సాంస్కృతిక, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. అయితే తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని రూపురేఖలే మారిపోయాయి. కళాకారుల పక్షాన నిలబడాల్సిన శాఖ ప్రభుత్వం ప్రచార సంస్థగా మారటం అత్యంత విచారకరం. తమకు రావాల్సిన బకాయిల కోసం కళాకారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదని కళాకారులు ఆవేదన చెందుతున్నారు. 3 కోట్లకు పైగా బకాయిలు రాష్ట్రంలో కళాకారులు ఏ సాంస్కృతిక కార్యక్రమం జరుపుకున్నా దాని ప్రాధాన్యతను బట్టి శాఖ వారికి కొంతమెత్తం చెల్లిస్తుంది. గత సంవత్సం ఆగస్టు నెల నుంచి నేటి దాకా కళాకారులకు 3 కోట్లకు పైగా చెల్లింపులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. చెల్లింపులు నిలిపివేత! రాష్ట్రంలో 13 జిల్లాల్లో నాలుగు వేల మందికి పైగా కళాకారులన్నారు. ప్రతీ సందర్భంలో వారు తమ ప్రదర్శనల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం అంటూ కళాకారులను వాడుకున్న ప్రభుత్వం కళాకారులకు చెల్లించాల్సిన చెల్లింపులను నిలిపివేసింది. తెలుగు తమ్ముళ్లకు దొడ్డిదారి చెల్లింపులు ఇతర కళాకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లకు.. వారి ప్రదర్శనలకు వెం టనే చెల్లింపులు చేస్తోంది. మూడు సంవత్సరాలలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా అనుచరురాలుగా చెప్పుకుంటున్న సంస్థకు 30 పైగా కార్యక్రమాలకు భారీగా సహాయాన్ని అందించింది. ( నిబంధనల ప్రకారం ఒక సంత్సరంలో 6 నెలలకు ఒక కార్యక్రమం ఇవ్వవచ్చు) ఆ సంస్థకు అన్ని కార్యక్రమాలు ఎందుకు ఇచ్చారో ఎవరికీ అర్ధం కావడం లేదు. సిబ్బందికి సైతం... భాషా సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం నాలుగు నెలలుగా జీతాలు చెల్లిం చడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలు ఎలా గడుపుకోవాలో వారికి అర్ధం కావడం లేదని వారంతా సాక్షికి మెరపెట్టుకున్నారు. ఏదిఏమైనా ఎనిమిది నెలలుగా కళాకారులకు బకాయిపడ్డ 3 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కళాకారులంతా ముక్తంకంఠంతో కోరుతున్నారు. -
ఉపాధి సరే.. వేతనాలేవీ..?
సాక్షి,మద్దికెర: వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేసినా వేతనాలకు అందకపోవడంతో వలసలు తప్పడం లేదు. నాలుగు నెలలుగా చేసి న పనులకు వేతనాలు దాదాపు రూ.1.50 కోట్లు ఇంత వరకు ఇవ్వకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 10 వేల జాబ్ కార్డులున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ పనులు ముగిసిన గ్రామాల్లో దాదాపు వెయ్యి మంది ఉపాధి కూలీలు పనులకు వెళ్తున్నారు. ఉపాధి కల్పించి సకాలంలో వేతనాలు చెల్లిస్తామని అధికారులు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి కూలీలకు తెల్పడంతో వారు పనులకు వెళ్లారు. అయితే పనులు చేసినా వేతనాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నందు వల్ల్ల వారు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇలా అయితే ఎవరి కోసం ఉపాధి పనులు కల్పించినట్లు అని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. నాలుగు నెలల గడిచినా కూలి ఇవ్వలేదు.. ఉపాధి పనులు చేసి నాలుగు నెలలు గడిచినా.. ఇంత వరకు వేతనాలు ఇవ్వలేదు. ఇలా అయితే పనులకు ఎలా వెళ్లేది.మా జీవనం ఎలా సాగుతుంది. అధికారులు స్పందించి సకాలంలో వేతనాలు ఇస్తే.. గ్రామాల్లో వలసలు కూడా తగ్గుతాయి. – తిమ్మయ్య, పెరవలి వేతనాలు మంజూరు చేస్తాం... నాలుగు నెలలు వేతనాలు రావాల్సి ఉంది. కూలీలకు వేతనాలు మంజూరు విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి సకాలంలో వేతనాలు అందించేందుకు కృషి చేస్తాం. వేతనాలు మంజూరులో ఆలస్యమైన మాట వాస్తవమే.. పనులు చేసిన వారందరికీ వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణ, ఏపీఓ -
చిరుద్యోగితో చెలగాటం
14 నెలలుగా అందని వేతనం వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయశాఖలో పనిచేసే ఓ చిరుద్యోగితో అధికారులు చెలగాటమాడుతున్నారు. వాచ్‌మెన్‌గా పనిచేసే ఆ ఉద్యోగి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారుల తప్పిదం, అక్రమాలతో 14 నెలల జీతం లేక ఆ ఉద్యోగి కుటుంబం రోడ్డున పడి ఆత్మహత్యే శరణ్యమంటోంది. ఉద్యోగుల అనుమతి లేకుండానే ఫారెన్ సర్వీస్ డెప్యుటేషన్‌లో పంపిన వ్యవసాయశాఖ 30 ఏళ్లు దాటినా ఆ విషయాన్ని గాలికొదిలేసింది. 5 నెలల క్రితం సాక్షి వెలుగులోకి తేవడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ శాఖ ఉద్యోగులు తప్పును కప్పిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు. జగిత్యాల మండలంలోని చల్గల్ వ్యవసాయ క్షేత్రంలో ’వాలంతరీ’ (వాటర్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రేనింగ్ రీసెర్చి ఇన్సిట్యూట్) సంస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1980 లో వ్యవసాయశాఖ నుంచి ఏవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లను డెప్యూటేషన్‌పై పంపించారు. ఈ శాఖ నుంచి డెప్యూటేషన్‌పై వెళ్లిన వారిలో పంజాల లక్ష్మినారాయణ అనే వాచ్మెన్‡ 1980 నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. జీవో 10 ప్రభుత్వ ప్రాథమిక నిబంధనల ప్రకారం డెప్యూటేషన్ కాల పరిమితి ఐదేళ్లకు మించరాదు. ప్రత్యేక అనుమతి ఉంటే మరో రెండేళ్ల వరకు కొనసాగించే అవకాశముంది. డెప్యూటేషన్ కాలపరిమితి ముగిసినప్పటికీ వాలంతరీ సంస్థ సదరు ఉద్యోగులను రిలీవ్ చేయలేదు. 35 ఏళ్లుగా వ్యవసాయశాఖ అధికారులు డెప్యుటేషన్‌లో ఉన్న సిబ్బందిని ఐదేళ్ల తర్వాత మాతసంస్థకు రప్పించకుండా.. ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ కమిషనరేట్ వద్ద ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. 1993లో వాలంతరీ ప్రభుత్వ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిగల సంస్థగా మారింది. దీంతో వ్యవసాయశాఖ ఉద్యోగులను అందులోనే కొనసాగించారు. అధికారులు వాలంతరీ నుంచి ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. జిల్లా వ్యవసాయశాఖ కూడా కమిషనరేట్‌ను అనుమతి కోరలేదు. తప్పులు కప్పిపుచ్చుకునే యత్నం 2015 సెప్టెంబర్‌లో ఇన్చార్జి జేడీఏగా ఉన్న చత్రునాయక్ లక్ష్మినారాయణను వాలంతరీ నుంచి కరీంనగర్ ఏడీఏ (మాతసంస్థలో) పరిధిలోని కొత్తపల్లి సీడ్‌ఫాంకు బదిలీ చేశారు. గత సెప్టెంబర్ నుంచి విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ లక్ష్మినారాయణకు జీతం రాకపోవడంతో అ«ధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆరా తీస్తే లక్ష్మినారాయణకు సంబంధించిన జీతాల బిల్లు ట్రెజరీశాఖలో తిరస్కరించారు. జీవో 10 ప్రకారం ఫారెన్ సర్వీస్ ఐదేళ్లకు మించితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ట్రెజరీ అధికారులు తేల్చారు. సదరు ఉద్యోగి 35 ఏళ్లు డెప్యూటేషన్‌లో పని చేసినా వ్యవసాయశాఖ అధికారులు బాధ్యతరహింతంగా వ్యవహరించారు. కలెక్టర్ ఆదేశాలతో వాచ్మెన్ సర్వీసు రికార్డులు కమిషనరేట్‌కు నివేదించారు. దీంతో అతడు ఏళ్ల తరబడి ఉద్యోగం చేయడానికి గల కారణాలు తేలయజేయాలని కోరుతూ డైరెక్టర్ ఆదేశించింది. దీంతో కంగుతున్న అధికారులు తప్పును కప్పిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు.