చిరుద్యోగితో చెలగాటం
-
14 నెలలుగా అందని వేతనం
-
వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం
-
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయశాఖలో పనిచేసే ఓ చిరుద్యోగితో అధికారులు చెలగాటమాడుతున్నారు. వాచ్‌మెన్‌గా పనిచేసే ఆ ఉద్యోగి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారుల తప్పిదం, అక్రమాలతో 14 నెలల జీతం లేక ఆ ఉద్యోగి కుటుంబం రోడ్డున పడి ఆత్మహత్యే శరణ్యమంటోంది. ఉద్యోగుల అనుమతి లేకుండానే ఫారెన్ సర్వీస్ డెప్యుటేషన్‌లో పంపిన వ్యవసాయశాఖ 30 ఏళ్లు దాటినా ఆ విషయాన్ని గాలికొదిలేసింది. 5 నెలల క్రితం సాక్షి వెలుగులోకి తేవడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ శాఖ ఉద్యోగులు తప్పును కప్పిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు.
జగిత్యాల మండలంలోని చల్‌గల్ వ్యవసాయ క్షేత్రంలో ’వాలంతరీ’ (వాటర్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ట్రేనింగ్ రీసెర్చి ఇన్సిట్యూట్) సంస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. 1980 లో వ్యవసాయశాఖ నుంచి ఏవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్‌మెన్లను డెప్యూటేషన్‌పై పంపించారు. ఈ శాఖ నుంచి డెప్యూటేషన్‌పై వెళ్లిన వారిలో పంజాల లక్ష్మినారాయణ అనే వాచ్‌మెన్‡ 1980 నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. జీవో 10 ప్రభుత్వ ప్రాథమిక నిబంధనల ప్రకారం డెప్యూటేషన్ కాల పరిమితి ఐదేళ్లకు మించరాదు. ప్రత్యేక అనుమతి ఉంటే మరో రెండేళ్ల వరకు కొనసాగించే అవకాశముంది. డెప్యూటేషన్ కాలపరిమితి ముగిసినప్పటికీ వాలంతరీ సంస్థ సదరు ఉద్యోగులను రిలీవ్ చేయలేదు. 35 ఏళ్లుగా వ్యవసాయశాఖ అధికారులు డెప్యుటేషన్‌లో ఉన్న సిబ్బందిని ఐదేళ్ల తర్వాత మాతసంస్థకు రప్పించకుండా.. ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ కమిషనరేట్ వద్ద ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. 1993లో వాలంతరీ ప్రభుత్వ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిగల సంస్థగా మారింది. దీంతో వ్యవసాయశాఖ ఉద్యోగులను అందులోనే కొనసాగించారు. అధికారులు వాలంతరీ నుంచి ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. జిల్లా వ్యవసాయశాఖ కూడా కమిషనరేట్‌ను అనుమతి కోరలేదు.
తప్పులు కప్పిపుచ్చుకునే యత్నం
2015 సెప్టెంబర్‌లో ఇన్‌చార్జి జేడీఏగా ఉన్న చత్రునాయక్ లక్ష్మినారాయణను వాలంతరీ నుంచి కరీంనగర్ ఏడీఏ (మాతసంస్థలో) పరిధిలోని కొత్తపల్లి సీడ్‌ఫాంకు బదిలీ చేశారు. గత సెప్టెంబర్ నుంచి విధులు నిర్వహిస్తున్న వాచ్‌మెన్ లక్ష్మినారాయణకు జీతం రాకపోవడంతో అ«ధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆరా తీస్తే లక్ష్మినారాయణకు సంబంధించిన జీతాల బిల్లు ట్రెజరీశాఖలో తిరస్కరించారు. జీవో 10 ప్రకారం ఫారెన్ సర్వీస్ ఐదేళ్లకు మించితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ట్రెజరీ అధికారులు తేల్చారు. సదరు ఉద్యోగి 35 ఏళ్లు డెప్యూటేషన్‌లో పని చేసినా వ్యవసాయశాఖ అధికారులు బాధ్యతరహింతంగా వ్యవహరించారు. కలెక్టర్ ఆదేశాలతో వాచ్‌మెన్ సర్వీసు రికార్డులు కమిషనరేట్‌కు నివేదించారు. దీంతో అతడు ఏళ్ల తరబడి ఉద్యోగం చేయడానికి గల కారణాలు తేలయజేయాలని కోరుతూ డైరెక్టర్ ఆదేశించింది. దీంతో కంగుతున్న అధికారులు తప్పును కప్పిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు.