సాక్షి, నెల్లూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో ఏ మాత్రం మార్పులేదు. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి అనేక వర్గాల కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. వారిని రోడ్ల పాలు చేశారు. అడిగేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులతో కొట్టించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన సీఎం కావాలని అన్ని వర్గాలు నమ్మి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఉన్న 80 వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులను చుక్కలు చూపించారు. గౌరవ వేతనం కోసం ఆందోళన చేస్తే పోలీసులతో లాఠీలతో కొట్టించి, మమ్మల్ని రోడ్లపై ఈడ్పించి కేసులు పెట్టించాడు. ప్రభుత్వ బడులకు వెళ్లి చదువుకొనే పిల్లలకు కడుపు నిండా తాము భోజనం వండి పెడుతుంటే అది కూడా మా నుంచి లాక్కోని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పేద బిడ్డల భోజన పథకానికి నిధులు ఇవ్వకుండా ఆపేశారు. ఇలాంటివన్నీ చేసినందుకా నీకు ఓటేయ్యాలంటూ నిలదీశారు. ఇలాంటి నిన్ను నమ్మి మళ్లీ ఓటెందుకు వేయాలి’ అంటూ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె విజయమ్మ ప్రశ్నంచింది. ఇక నిన్ను నమ్మం బాబూ అంటున్న ఆమె ‘సాక్షి ప్రతినిధి’తో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడిన కష్టాలు ఏకరవు పెట్టారు.
గౌరవ వేతనం కోసం ఆందోళన చేస్తే..
మాకు నెలకు రూ.1000 మాత్రమే గౌరవ వేతనం వస్తుంది. మా కష్టానికి తగిన వేతనం ఇవ్వాలని ఎన్నో సార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఐదేళ్ల పాలనలో వేతనం పెంచమని నిరసనలు తెలిపినా ఏ మాత్రం చలనం లేదు. చర్చల పేరుతో మమ్మల్ని పిలిపించి పిల్లలకు భోజనం సక్రమంగా పెట్టడం లేదంటూ బెదిరింపులకు దిగారు. గత్యంతరం లేక మూడుసార్లు అమరావతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మాపై పోలీసులను ఉసిగొల్పారు. నిరసన చేస్తే మమ్మల్ని పోలీసులతో లాఠీలతో కొట్టించి రోడ్లపైనే ఈడ్చుకుంటూ వెళ్లి కేసులు నమోదు చేసి లోపల కూర్చోబెట్టి మా పరువు తీశారు.
ఆరు నెలల నుంచి వేతనాలు, బిల్లులు ఇవ్వట్లేదు
ఆరు నెలల నుంచి మాకు బిల్లులతో పాటు వేతనాలు నిలిపి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. నెలవారీగా దాదాపు రూ.40 వరకు బిల్లులు ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలలుగా నిలిపివేస్తే మేమెట్లా వండి పెట్టాలి. ఎన్నికల కోసం మహిళలపై ప్రేమ ఉన్నట్లు పసుపు–కుంకుమ కింద పోస్ట్ పెయిడ్ చెక్కులిచ్చావు. మరి వంట వండి పేద బిడ్డలకు ఆకలి తీర్చుస్తున్న మేము మహిళలమే కదా.. మాకెందుకు వేతనాలు, బిల్లులు ఇవ్వడం లేదు.
ప్రైవేట్ ఏజెన్సీల కోసం..
నెల నెలా బిల్లులు ఇవ్వకున్నా అప్పు చేసి వంట వండి పేద బిడ్డల ఆకలి తీర్చుతున్నాం. ఇంటి వంటతో వారికి రుచికరమైన భోజనం అందిస్తున్న మా నుంచి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ లాక్కొని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి మా కడుపులు కొట్టారు. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలను ఇప్పటికే ఢిల్లీకి చెందిన నవప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించిన చోట్ల పిల్లలకు ఎన్నిసార్లు ఫుడ్‌పాయిజన్ అయి అస్పత్రి పాలయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం, మనుబోలులో కూడా స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే భోజనంలో బల్లి పడిన సం«ఘటనలు న్నాయి. కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో కూడా ప్రైవేట్ ఏజెన్సీలు చేసే భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి.
ఒక్కో విద్యార్థికి ఇచ్చేది రెండు రూపాయలే..
ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చేది రూ.4.13లే. కానీ అందులో కోడిగుడ్డు, వంటనూనె సరఫరాను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఇచ్చే నాలుగు రూపాయల్లో రెండు రూపాయలు మాకు తగ్గించి ఆ డబ్బులు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. బయట మార్కెట్‌లో పామాయిల్ ప్యాకెట్ రూ.50లకే వస్తుంటే.. ప్రైవేట్ ఏజెన్సీ వాళ్లు మాత్రం పామాయిల్‌ను రూ.90 వంతున సరఫరా చేస్తున్నారు. మాకు మాత్రం బిల్లులు ఇవ్వరు.. ప్రైవేట్ ఏజెన్సీలకు మాత్రం ఠంచన్‌గా నిధులు మంజూరు చేస్తున్నారు. మీ కమీషన్ల కోసం మా కడుపులు కొడతారా?
వేతనాలు పెంచామని మోసం
ఐదేళ్ల కాలంలో గౌరవ వేతనం పెంచాలని ఎన్నో నిరసనలు చేస్తే ఎన్నికల సమయంలో గౌరవ వేతనం రూ.3 వేలు పెంచామని హామీ ఇచ్చారు. కానీ పెంచిన వేతనం ఇప్పటిì వరకు మాకు అందలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వేతనం పెంచుతున్నట్లు మోసం చేశాడు. ఐదేళ్ల పాటు నీవు చేసిన మోసం గురించి మా చేతి వంట తినే విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నీ మోసాలను వివరించి చెబుతాము. నిన్ను నమ్మితే నిలువునా మోసం చేస్తావని చెప్తాం. ఇక నిన్ను నమ్మి ఓటేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment