మైలవరం ప్రభుత్వ పాఠశాల
సాక్షి, మైలవరం(కృష్ణా) : గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పేదలు నరకయాతన పడుతున్నారు. ఉపాధి కోసం స్కూళ్లలో చేరిన పారిశుద్ధ్య కార్మికులను రెండేళ్లుగా జీతాలు చెల్లించకుండా ఆటలాడుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో స్వీపర్లును నియమించింది. నెలకు రూ.1500 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అరకొరగా జీతాలు చెల్లించి తరువాత రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేశారు. దీంతో స్వీపర్లు సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం జీతాలు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పాఠశాలలు ఉండగా 1200 పాఠశాలల్లోనే స్వీపర్లును నియమించారు. కొన్ని పాఠశాలల్లో గతం నుంచి పనిచేస్తున్న అటెండర్‌లతోనే ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. 23 నెలలుగా వారికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వీపర్లు అనేక సార్లు వేతనాలు చెల్లించాలని పలు మార్లు నిరసన తెలిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మైలవరం నియోజకవర్గంలో 120 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. నందిగామ మండలంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 56వరకు ఉన్నాయి. నూజివీడు మండలంలో 85 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. తిరువూరు మండలంలో 61 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని 4,500 పాఠశాలల్లో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే స్వీపర్ల నియామకం జరిగింది. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాని పట్టించుకున్న నాథుడే లేడు.
Comments
Please login to add a commentAdd a comment