officers negligance
-
కాళ్లరిగేలా తిరిగి కడుపు మండి.. మంత్రాలయలో బాంబు..
సాక్షి, ముంబై: స్థలం రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, ఇక పని కాదని ఏకంగా మంత్రాలయలోనే బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన సాగర్ మాంఢరే అనే వ్యక్తి. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులతో మంత్రాలయలో సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఫేక్ కాల్‌గా భావించి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థలం విషయంలో కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల అతడి మానసిక స్థితి దెబ్బతినడంతో బెదిరింపు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. కాగా, బెదిరింపు కాల్‌తో మంత్రాలయ భవనం ఆవరణలో, భవనం బయట భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అసలేం జరిగింది? మంత్రాలయ భవనంలో బాంబు ఉందని ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. అయితే 24 గంటలు పోలీసులు, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించే మంత్రాలయలో బాంబు పెట్టడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రితోపాటు కేబినెట్, సహాయ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలను తనిఖీ చేయనిదే మంత్రాలయ భవనంలోకి అనుమతించరు. ఇలాంటి పటిష్టమైన భద్రత ఉన్న మంత్రాలయలోకి సామాన్య వ్యక్తులు బాంబు తీసుకెళ్లి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఆదివారం మంత్రాలయకు సెలవు అయినప్పటికీ పోలీసులు ఈ బెదిరింపు కాల్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్యం బృందం, డాగ్ స్క్వాడ్ మంత్రాలయలో అణువణువూ గాలించారు. కానీ, ఎక్కడా ఎలాంటి బాంబు గాని అనుమానాస్పద వస్తువుగాని లభించలేదు. తరువాత ఈ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని టెలిఫోన్ ఎక్ఛేంజీ నుంచి ఆరా తీయగా మహారాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగ్‌పూర్ నుంచి ఫోన్ చేసిన సాగర్ మాంఢరేను అరెస్టు చేశారు. ముంబైలో స్థానిక మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగి.. నాగ్‌పూర్‌లో కోల్ ఫిల్డ్ స్టోన్ క్రషింగ్‌కు ఆనుకుని ఉన్న స్థలం తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి సాగర్ మాంఢరే అనేక సార్లు స్థానిక ప్రభుత్వం కార్యాలయాల చుట్టు తిరిగాడు. పని జరగకపోవడంతో తనకు న్యాయం చేయాలని తహశీల్దార్, జిల్లా కలెక్టర్, రీజినల్ కమిషనర్ తదితర ఉన్నత స్థాయి అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ, పరిపాలనా విభాగం రికార్డుల ప్రకారం ఆ స్థలం అస్థిత్వంలో లేదు. చివరకు కొద్ది నెలల కిందట ఆ స్థలానికి సంబంధించిన పత్రాలతో మంత్రాలయకు వచ్చి ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ విభాగానికి చెందిన కార్యదర్శులతో భేటీ అయ్యాడు. ఇక్కడ కూడా నిరాశే మిగలడంతో అధికారులను, కార్యదర్శులను అరెస్టు చేయాలని మంత్రాలయలో గొడవ చేశాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. -
విద్యార్థులు చస్తున్నా పట్టించుకోరా..?!
లక్సెట్టిపేట(మంచిర్యాల) : వసతిగృహాల్లో విద్యార్థులు మరణిస్తున్నా... తీవ్ర విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తూ ఇళ్ళకు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఉన్నత అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకుండా పోయింది. అపరిశుభ్రంగా గదులు, బాత్రూంలు, టాయిలెట్లు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నాయి. జిల్లా మొత్తంగా రెగ్యూలర్ వార్డెన్లు, హెడ్మాస్టర్లు లేక ఇన్చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి. అధికారులు పట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇబ్బందుల్లో విద్యార్థులు జిల్లాలో మొత్తంగా 10 బాలుర, 6 బాలికల ఆశ్రమ పాఠశాలులున్నాయి. ఇందుకు ఆరుగురు రెగ్యూలర్ వార్డెన్లు, 10 మంది ఇన్చార్జి వార్డెన్లు ఉండగా ముగ్గురు రెగ్యూలర్, 13మంది ఇన్చార్జి హెడ్మాస్టర్లు ఉన్నారు. ఎటీడబ్లూవో ప్రతి నెలకు రెండుసార్లు పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు రుచికరమైన భోజనం అందిస్తున్నారా తెలుసుకోవాలి. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు విద్యార్థులు అన్ని విధాలా చికిత్సలు అందించాలి. ఇటీవల స్థానిక పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శివశంకర్ ఆకస్మత్తుగా మృతిచెందడంతో మిగతా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పలువురు విద్యార్థులు వ్యాధులతో ఇళ్ళలోకి వెళ్తున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పరిశుభ్రత పాటించకుండా వ్యాధులపై అవగాహన కల్పించకుండా హెల్త్ క్యాంపులు చేపట్టకుండా కాలం వెల్లదీస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. అధ్వానంగా పట్టణ పాఠశాల మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటారు. మొత్తంగా 141మంది విద్యార్థులకు నలుగురు వెళ్లిపోగా ప్రస్తుతం 137మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతోంది. సీజనల్ వ్యాధులు రావడంతో 105 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉండగా మిగతా వారు ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ చెప్పారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడం, టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం, డార్మిటరీ గదులు ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విద్యార్థి శివశంకర్ మృతిచెందడంతో పాఠశాల వార్డెన్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసి హెడ్మాస్టర్ రవీందర్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎన్ఎంను విధుల నుంచి తొలగించడంతో ప్రస్తుతం విద్యార్థులను పరిశీలించేందుకు ఏఎన్ఎం లేదు. రాత్రివేళ అత్యవసర పరిస్థితి వస్తే ఇబ్బంది పడాల్సిందే. 6వ తరగది విద్యార్థి చరణ్ పాఠశాల నచ్చడం లేదంటు పారిపోయి దినమంతా ఒంటరిగా తిరిగి రాత్రివేళ ఇంటికి చేరడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల విద్యార్థి ఉదయం వెళ్లిపోయిన సిబ్బందికి తెలియకపోవడం శోచనీయం. తదుపరి ఉదయం పాఠశాలకు వచ్చి పాఠశాల నచ్చడం లేదంటూ టీసీ తీసుకునివెళ్లిపోయాడు. విద్యార్థులకు జ్వరాలు వచ్చిన సమాచారం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
రెండు నెలలు..11 వేల కరెంట్ బిల్లు
సాక్షి, చొప్పదండి(కరీంనగర్) : ప్రతి రెండు నెలలకు ఐదు వందల నుంచి వేయి లోపు రావాల్సిన కరెంట్ బిల్లు ఒకేసారి పదకొండు వేలు రావడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరపు సంతోష్‌కుమార్‌కు సర్వీస్ నంబర్ 722పై విద్యుత్ కనెక్షన్ ఉంది. ప్రతీ రెండునెలలకోసారి బిల్లు ఐదు వందల రూపాయల నుంచి వేయి వచ్చేది. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు మీటర్ రీడింగ్ 1285 యూనిట్లు తిరిగినట్లు రూ.11 వేల 2 రూపాయలు చెల్లించాలని బిల్లు తీసి అందించారు. మీటర్ తీసుకున్నప్పటి నుంచి ఏనాడు వేయి దాటని బిల్లు ఇంతపెద్దమొత్తంలో రావడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. -
జీతాలు చెల్లించండి బాబోయ్
సాక్షి, మైలవరం(కృష్ణా) : గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పేదలు నరకయాతన పడుతున్నారు. ఉపాధి కోసం స్కూళ్లలో చేరిన పారిశుద్ధ్య కార్మికులను రెండేళ్లుగా జీతాలు చెల్లించకుండా ఆటలాడుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో స్వీపర్లును నియమించింది. నెలకు రూ.1500 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అరకొరగా జీతాలు చెల్లించి తరువాత రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేశారు. దీంతో స్వీపర్లు సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం జీతాలు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పాఠశాలలు ఉండగా 1200 పాఠశాలల్లోనే స్వీపర్లును నియమించారు. కొన్ని పాఠశాలల్లో గతం నుంచి పనిచేస్తున్న అటెండర్లతోనే ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. 23 నెలలుగా వారికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వీపర్లు అనేక సార్లు వేతనాలు చెల్లించాలని పలు మార్లు నిరసన తెలిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మైలవరం నియోజకవర్గంలో 120 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. నందిగామ మండలంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 56వరకు ఉన్నాయి. నూజివీడు మండలంలో 85 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. తిరువూరు మండలంలో 61 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని 4,500 పాఠశాలల్లో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే స్వీపర్ల నియామకం జరిగింది. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాని పట్టించుకున్న నాథుడే లేడు. -
ఈ కరెంటోళ్లకేమైందో..
సాక్షి, జన్నారం (మంచిర్యాల) : మంచోడు మంచోడంటే మంచమెక్కి కూర్చున్నాడంట వెనుకటికి ఒకడు. సరిగ్గా అలాగే ఉంది రాష్ట్రంలో విద్యుత్ శాఖ తీరు. తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులతో విరాజిల్లేలా చేస్తామని చెప్పిన అధికారులు సామాన్యుల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నారు. ఇటీవల మండలంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా మారాయి. పడిపోయిన విద్యుత్ వైర్లను సరి చేయడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. దీని ఫలితంగా పలువురు విద్యుత్ షాక్ బారిన పడి గాయాల పాలయ్యారు. మండలంలో జరిగిన సంఘటనలతో విద్యుత్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల వీచిన ఈదురు గాలులకు మండలంలోని బంగారుతాండాకు వెళ్లే రోడ్డులో స్తంభాలు పడిపోయి, కొన్ని ప్రదేశాలలో విద్యుత్ స్తంభాలు వంగి తీగలు వేలాడుతున్నాయి. అయినా అధికారులు వాటిని సరి చేయకుండానే విద్యుత్ సరఫరా చేయడంతో ఆ గ్రామానికి బైక్‌పై వెళ్తున్న దత్తు అనే వ్యక్తి తీగలకు తగిలి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కవ్వాల్ పోచమ్మ ఆలయం వద్ద కూడా ఈదురు గాలులకు స్తంభాలు నేల కూలి తీగలు తెగి కింద పడ్డాయి. వాటిని కూడా మరమ్మతులు చేయకుండానే విద్యుత్ సరఫరా చేశారు. పోచమ్మ తల్లి వద్దకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన కామన్పల్లి గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి ప్రకాశ్‌నాయక్ విద్యుత్ షాక్ గురై తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీగలను సరి చేయాలని, అవసరమైతే విద్యుత్ స్తంభం వేయాలని హాస్టల్ తాండా గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచులు తీర్మానం చేసి విద్యుత్ అధికారులకు పంపినా కానీ ఎటువంటి స్పందన లేదని, ఇప్పటి వరకు విద్యుత్ తీగల్ని సరి చేయలేదని ఉప సర్పంచ్ బాలాజీ ఆరోపిస్తున్నారు. -
ఎందుకింత నిర్లక్ష్యం?
సాక్షి, నిజామాబాద్ : జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం మార్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలలు గడుస్తున్నా కార్యాలయం తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. జిల్లా కేంద్రంలోని బాలుర ఐటీఐ ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఉండేది. అయితే, సమీపంలోనే నూతనంగా నిర్మించిన భవనంలోకి కార్యాలయాన్ని మార్చడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిర్లక్ష్యం.. అలసత్వం.. ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి కొత్త భవనం అందుబాటులో ఉంది. పాత కార్యాలయంలోంచి, కొత్త కార్యాలయంలోకి సామగ్రి తరలించడానికి నెల రోజులు పట్టింది. తరలింపు పనులు ఇప్పటికీ సాగదీస్తూనే ఉన్నారు. కరెంట్ కనెక్షన్ ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు. నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ కార్డు కో సం దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర పనుల నిమి త్తం వస్తే సమాధానం చెప్పే వారే ఇక్కడ కరువయ్యారు. నిరుద్యోగులు కార్డుల రెన్యూవల్‌తో పాటు కొత్త కార్డులు తీసుకోవాలంటే మీ సేవకు వెళ్లాల్సిందే. సమస్యలు వస్తే కార్యాలయానికి వస్తే సమాధానాలు చెప్పే వారే ఉండడం లేదు. ఎప్పుడు ఖాళీ కుర్చీలే.. కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నా కూర్చీలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అధికారి ఉన్నంత సేపు మాత్రమే ఉద్యోగులు ఉంటున్నారు. అధికారి ఇలా వెళ్లగానే, సిబ్బంది అలా బయటకు వెళ్లిపోతున్నారు. ఇది రోజు జరుగుతున్న తంతు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, ఇన్చార్జి అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సిబ్బంది ఇష్టారాజ్యమై పోయింది. దీంతో రెండు నెలలు గడుస్తున్నా సామగ్రి తరలింపు పూర్తి కాకపోవడం, కార్యాలయం ఇంకా సిద్ధం కాకపోవడం గమనార్హం. సిబ్బంది లేక ఆలస్యం మా కార్యాలయంలో సరైన సిబ్బంది లేరు. అందుకే ఆలస్యం అవుతోంది. కంప్యూటర్ ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం యత్నిస్తున్నాం. పనులన్నీ ఒక్కడినే చేయాల్సి వస్తోంది. అందువల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. – మోహన్‌లాల్, ఇన్చార్జి అధికారి -
రాయి..తీ!
2015 ఖరీఫ్ పరిహారంపై నీలినీడలు ► నష్టపోయిన రైతులు 15వేల పైనే.. ►పెట్టుబడి రాయితీ విషయంలో నోరెత్తని ప్రభుత్వం ►మౌనందాల్చిన అధికార పార్టీ నేతలు అనంతపురం అగ్రికల్చర్: రైతులకు పెట్టుబడి రాయితీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 2015 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పంటకోత తర్వాత సంభవించిన తుపాను వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంటకు రూ.23.80 కోట్ల పెట్టుబడి రాయితీ పరిహారం విషయంలో నోరెత్తకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఈ విషయంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కూడా మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. 2015లో 4.44లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేయగా.. తీవ్ర వర్షాభావం కారణంగా చాలా మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. కొన్ని మండలాల్లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ఎట్టకేలకు హెక్టారుకు సరాసరి 670 కిలోలు పండినట్లు అధికారులు నివేదిక పంపడంతో ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడారు. పంటకోత ప్రయోగాలు పరిగణనలోకి తీసుకుంటే దాదాపు సగానికి పైగా మండలాల్లో హెక్టారుకు 300 కిలోలు పండిన దాఖలాలు కూడా లేవు. జిల్లా అంతటినీ ఒకే గాటికి కట్టేయడంతో రైతులకు పరిహారం అందకుండాపోతోంది. దెబ్బతీసిన తుపాన్లు పంట కోత సమయంలో వరుస తుపాన్లు వేరుశనగ పంటను బాగా దెబ్బతీయడంతో రైతులకు నష్టం వాటిల్లింది. 2015 నవంబర్‌లో సాధారణ వర్షపాతం 34 మి.మీ కాగా 100 మి.మీ వర్షం కురిసింది. నవంబర్ 2 నుంచి 25వ తేదీ వరకు మూడు తుపాన్లు సంభవించడంతో చాలా మండలాల్లో కోత కోసిన పంట పొలాల్లోనే కుళ్లిపోయి పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయింది. 40 మండలాల పరిధిలో 45 నుంచి 50వేల హెక్టార్లలో వేరుశనగ కుళ్లిపోయి దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పటి వ్వయసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పొలంబాట బట్టి కుళ్లిన వేరుశనగ పంటను చూసి చలించిపోయారు. ఆ తర్వాత వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో పాటు మరో 15 ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. చివరకు 33 మండలాల పరిధిలో 16,111 హెక్టార్లలో పంట దెబ్బతినగా.. 15,167 మంది రైతులకు రూ.23.80 కోట్లు మేర పంట నష్టం జరిగినట్లు తేల్చారు. ఆ మేరకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించి 18 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు అతీగతీ లేకపోవడం గమనార్హం. 2016 ఇన్పుట్ మంజూరు చేసినా.. 2015 ఇన్పుట్ను మరచిపోవడంతో ఇస్తారనే ఆశ రైతుల్లో సన్నగిల్లుతోంది. -
భారంగా బతుకు బండి
- బరువుగా సగటు ఉద్యోగి జీవనం - పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నాన్చుడు ధోరణి రెవెన్యూ శాఖలో రామకష్ణ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రూ.24 వేలు జీతం. ఇద్దరు సంతానం. ఒకరు పదవ తరగతి, మరొకరు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. చూసేవారికి ఈయన జీతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కుటుంబ ఖర్చుల వరకే సరిపోతోందని ఆయనకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం దుబారా ఖర్చులకు వెళ్లినా అప్పు చేయాల్సిందే. ఇదీ సగటు ఉద్యోగి పరిస్థితి. అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగం అంటే మంచి జీతం.. విలాసవంత జీవితం అని అందరూ అనుకుంటారు. అయితే అందరి జీవితాలూ అలా సాఫీగా లేవు. సగటు ఉద్యోగులు బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, రవాణా, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా వేతనాలు పెరగడం లేదు. దీంతో సంపాదనకు - కుటుంబ అవసరాలకు మధ్య అంతరం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నచిన్న సరదాలు, కోరికలు కూడా పెద్ద భారంగా పరిణమిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాలకు బడ్జెట్ పెరిగిపోతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సగటు వేతనం రూ.10వేల నుంచి రూ.30వేల మధ్య తీసుకుంటున్న ఉద్యోగులు నెలసరి బడ్జెట్ సంపాదనకు మించుతోంది. జిల్లా వ్యాప్తంగా సగటు వేతన జీవులు దాదాపు 50వేల మంది దాకా ఉంటారు. వీరంతా పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు మేరకు వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. మా కష్టాలు మాకే తెలుసు నాకు రూ.33 వేల వేతనం వస్తుంది. అమ్మ, భార్య, ఇద్దరు పిల్లలు. ఇంటి బాడుగ రూ.6వేలు. మిగిలిన డబ్బుతో ఎంతో పొదుపుగా సంసారం నెట్టుకొస్తున్నాను. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో మాకే తెలుసు. పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చదివించలేకపోతున్నా. పండుగలు వచ్చాయంటే అదో అదనపు ఖర్చు. – మంజూనాథ్, సీనియర్ అడిటర్, ఆడిట్ శాఖ భారంగా నెట్టుకొస్తున్నాను అన్ని కటింగ్‌లు పోనూ చేతికి రూ.21 వేల వేతనం వస్తుంది. ఇద్దరు సంతానం. అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, అమ్మాయి డిగ్రీ చేస్తోంది. వారి చదువులకు, ఇంటి ఖర్చులకు వస్తున్న వేతనం సరిపోతోంది. ఇక ఇంటి ఖర్చులకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పిల్లల కోసం పొదుపు చేసేందుకు కూడా జీతం డబ్బులు మిగలడం లేదు. – ఫకృద్ధీన్, ప్రచార సహాయకుడు, సమాచార శాఖ, అనంతపురం ఖర్చులకు సరిపోవడం లేదు నాకు రూ.10 వేలు వేతనం వస్తుంది. ఈ కొద్ది జీతం సరిపోవడం లేదు. ఇంటి బాడుగ రూ.2,500. కనీస అవసరాలకు ఆ మొత్తం సరిపోతోంది. ఎంతో గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ఏమాత్రం దుబారాకు వెళ్లినా కష్టాలు కొనితెచ్చుకోవడమే అన్నట్లుగా ఉంది. పండుగలు, శుభకార్యాలు ఉంటే ఆ నెల మరీకష్టంగా ఉంటోంది. – రాఘవేంద్ర, సెక్యూరిటీ గార్డ్, అనంతపురం కుటుంబపోషణ భారంగా నాకు నెలసరి రూ.10 వేలు వేతనం వస్తుంది. కుటుంబపోషణ భారంగా నెట్టుకొస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బీటెక్, మరొకరు డిగ్రీ చదువుతున్నారు. వస్తున్న వేతనం ఏ మాత్రం సరిపోదు. ఇంటి బాడుగ, ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాలాంటి చిరుద్యోగులకు వేతనం పెంచితే కొంతైనా బాగుటుంది. – మల్లికార్జున, కాంట్రాక్టు ఉద్యోగి, నగరపాలక సంస్థ. -
విద్యాశాఖ నిర్లక్ష్యం...విద్యార్థులకు శాపం
– తాటిచెర్ల పాఠశాలలో యూడైస్ ప్రకారం విద్యార్థుల సంఖ్య :133 – విద్యాశాఖ అమరావతికి పంపిన సంఖ్య: 109 – టీచరు పోస్టును తొలగిస్తూ ఉత్తర్వులు – లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖ నిర్లక్ష్యం...విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలను మూసివేయడం, టీచర్ పోస్టులను తొలగిస్తోంది. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడు కావడంతో అనంతపురం రూరల్ పరిధిలోని తాటిచెర్ల ప్రాథమిక పాఠశాలలోని టీచర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలోకెళితే... తాటిచెర్ల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలు 133 మంది ఉన్నారు. పాఠశాల హెచ్ఎం విద్యాశాఖకు నివేదించిన జాబితా కూడా ఇదే. ఈ ప్రకారం ఆరు మంది టీచర్లు, ఒక హెచ్ఎం పోస్టు ఉంటుంది. విద్యాశాఖ అధికారులు అమరావతికి పంపిన జాబితాలో మాత్రం ఈ పాఠశాలలో 109 మంది విద్యార్థులు ఉన్నట్లు పంపారు. జిల్లా విద్యాశాఖ పంపిన జాబితా మేరకు అమరావతి అధికారులు లెక్కలు తేల్చి తాటిచెర్ల స్కూల్లో ఒక పోస్టు సర్‌ఫ్లస్‌గా ఉందని ఆ పోస్టును రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇదే విషయాన్ని పాఠశాలకు చేర వేశారు. దీంతో కంగుతిన్న హెచ్ఎం, ఉపాధ్యాయులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. అసలు తప్పిదం ఇక్కడే.. యూడైస్ ప్రకారం 133 మంది విద్యార్థులున్నట్లు పాఠశాల నుంచి విద్యాశాఖకు నివేదిక పంపారు. అయితే జిల్లా విద్యాశాఖ సిబ్బంది 5వ తరగతి విద్యార్థుల సంఖ్య 24ను తప్పించి కేవలం 1–4 తరగతులను లెక్కించి 109 మంది ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యాశాఖకు ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో తాము చేసిన తప్పు బయటపడకుండా పాఠశాల వారే చేసినట్లు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ క్రమంలో స్పష్టత కోసం కమిషనర్‌కు పంపారు. అక్కడి నుంచి ఏ నివేదిక వస్తుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మేము పంపిన జాబితా సరైనది యూడైస్ ప్రకారం మా పాఠశాలో 133 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే విషయాన్ని విద్యాశాఖకు నివేదించాం. మరి ఏం జరిగిందో తెలీదు కానీ 109 మంది మాత్రమే పిల్లలున్నట్లు చూపించి ఒక పోస్టు తొలిగించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇదిలా ఉండగా దీనిపై డీఈఓ లక్ష్మీనారాయణ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. - శివకుమార్‌రెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం