రాయి..తీ!
2015 ఖరీఫ్ పరిహారంపై నీలినీడలు
► నష్టపోయిన రైతులు 15వేల పైనే..
►పెట్టుబడి రాయితీ విషయంలో నోరెత్తని ప్రభుత్వం
►మౌనందాల్చిన అధికార పార్టీ నేతలు
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు పెట్టుబడి రాయితీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 2015 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పంటకోత తర్వాత సంభవించిన తుపాను వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంటకు రూ.23.80 కోట్ల పెట్టుబడి రాయితీ పరిహారం విషయంలో నోరెత్తకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఈ విషయంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కూడా మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. 2015లో 4.44లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేయగా.. తీవ్ర వర్షాభావం కారణంగా చాలా మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. కొన్ని మండలాల్లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ఎట్టకేలకు హెక్టారుకు సరాసరి 670 కిలోలు పండినట్లు అధికారులు నివేదిక పంపడంతో ఇన్‌పుట్ సబ్సిడీకి మంగళం పాడారు. పంటకోత ప్రయోగాలు పరిగణనలోకి తీసుకుంటే దాదాపు సగానికి పైగా మండలాల్లో హెక్టారుకు 300 కిలోలు పండిన దాఖలాలు కూడా లేవు. జిల్లా అంతటినీ ఒకే గాటికి కట్టేయడంతో రైతులకు పరిహారం అందకుండాపోతోంది.
దెబ్బతీసిన తుపాన్లు
పంట కోత సమయంలో వరుస తుపాన్లు వేరుశనగ పంటను బాగా దెబ్బతీయడంతో రైతులకు నష్టం వాటిల్లింది. 2015 నవంబర్‌లో సాధారణ వర్షపాతం 34 మి.మీ కాగా 100 మి.మీ వర్షం కురిసింది. నవంబర్ 2 నుంచి 25వ తేదీ వరకు మూడు తుపాన్లు సంభవించడంతో చాలా మండలాల్లో కోత కోసిన పంట పొలాల్లోనే కుళ్లిపోయి పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయింది. 40 మండలాల పరిధిలో 45 నుంచి 50వేల హెక్టార్లలో వేరుశనగ కుళ్లిపోయి దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పటి వ్వయసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పొలంబాట బట్టి కుళ్లిన వేరుశనగ పంటను చూసి చలించిపోయారు.
ఆ తర్వాత వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో పాటు మరో 15 ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. చివరకు 33 మండలాల పరిధిలో 16,111 హెక్టార్లలో పంట దెబ్బతినగా.. 15,167 మంది రైతులకు రూ.23.80 కోట్లు మేర పంట నష్టం జరిగినట్లు తేల్చారు. ఆ మేరకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించి 18 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు అతీగతీ లేకపోవడం గమనార్హం. 2016 ఇన్‌పుట్ మంజూరు చేసినా.. 2015 ఇన్‌పుట్‌ను మరచిపోవడంతో ఇస్తారనే ఆశ రైతుల్లో సన్నగిల్లుతోంది.