– తాటిచెర్ల పాఠశాలలో యూడైస్ ప్రకారం విద్యార్థుల సంఖ్య :133
– విద్యాశాఖ అమరావతికి పంపిన సంఖ్య: 109
– టీచరు పోస్టును తొలగిస్తూ ఉత్తర్వులు
– లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖ నిర్లక్ష్యం...విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలను మూసివేయడం, టీచర్ పోస్టులను తొలగిస్తోంది. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడు కావడంతో అనంతపురం రూరల్ పరిధిలోని తాటిచెర్ల ప్రాథమిక పాఠశాలలోని టీచర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలోకెళితే... తాటిచెర్ల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలు 133 మంది ఉన్నారు. పాఠశాల హెచ్‌ఎం విద్యాశాఖకు నివేదించిన జాబితా కూడా ఇదే. ఈ ప్రకారం ఆరు మంది టీచర్లు, ఒక హెచ్‌ఎం పోస్టు ఉంటుంది. విద్యాశాఖ అధికారులు అమరావతికి పంపిన జాబితాలో మాత్రం ఈ పాఠశాలలో 109 మంది విద్యార్థులు ఉన్నట్లు పంపారు. జిల్లా విద్యాశాఖ పంపిన జాబితా మేరకు అమరావతి అధికారులు లెక్కలు తేల్చి తాటిచెర్ల స్కూల్‌లో ఒక పోస్టు సర్‌ఫ్లస్‌గా ఉందని ఆ పోస్టును రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇదే విషయాన్ని పాఠశాలకు చేర వేశారు. దీంతో కంగుతిన్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అధికారుల వద్దకు పరుగులు తీశారు.
అసలు తప్పిదం ఇక్కడే..
యూడైస్ ప్రకారం 133 మంది విద్యార్థులున్నట్లు పాఠశాల నుంచి విద్యాశాఖకు నివేదిక పంపారు. అయితే జిల్లా విద్యాశాఖ సిబ్బంది 5వ తరగతి విద్యార్థుల సంఖ్య 24ను తప్పించి కేవలం 1–4 తరగతులను లెక్కించి 109 మంది ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యాశాఖకు ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో తాము చేసిన తప్పు బయటపడకుండా పాఠశాల వారే చేసినట్లు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ క్రమంలో స్పష్టత కోసం కమిషనర్‌కు పంపారు. అక్కడి నుంచి ఏ నివేదిక వస్తుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మేము పంపిన జాబితా సరైనది
యూడైస్ ప్రకారం మా పాఠశాలో 133 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే విషయాన్ని విద్యాశాఖకు నివేదించాం. మరి ఏం జరిగిందో తెలీదు కానీ 109 మంది మాత్రమే పిల్లలున్నట్లు చూపించి ఒక పోస్టు తొలిగించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇదిలా ఉండగా దీనిపై డీఈఓ లక్ష్మీనారాయణ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
- శివకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం
విద్యాశాఖ నిర్లక్ష్యం...విద్యార్థులకు శాపం
Published Wed, Jul 5 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
Advertisement
Advertisement