సాక్షి, ముంబై: స్థలం రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, ఇక పని కాదని ఏకంగా మంత్రాలయలోనే బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన సాగర్ మాంఢరే అనే వ్యక్తి. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులతో మంత్రాలయలో సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఫేక్ కాల్‌గా భావించి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థలం విషయంలో కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల అతడి మానసిక స్థితి దెబ్బతినడంతో బెదిరింపు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. కాగా, బెదిరింపు కాల్‌తో మంత్రాలయ భవనం ఆవరణలో, భవనం బయట భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
అసలేం జరిగింది?
మంత్రాలయ భవనంలో బాంబు ఉందని ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. అయితే 24 గంటలు పోలీసులు, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించే మంత్రాలయలో బాంబు పెట్టడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రితోపాటు కేబినెట్, సహాయ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలను తనిఖీ చేయనిదే మంత్రాలయ భవనంలోకి అనుమతించరు. ఇలాంటి పటిష్టమైన భద్రత ఉన్న మంత్రాలయలోకి సామాన్య వ్యక్తులు బాంబు తీసుకెళ్లి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు.
ఆదివారం మంత్రాలయకు సెలవు అయినప్పటికీ పోలీసులు ఈ బెదిరింపు కాల్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్యం బృందం, డాగ్ స్క్వాడ్ మంత్రాలయలో అణువణువూ గాలించారు. కానీ, ఎక్కడా ఎలాంటి బాంబు గాని అనుమానాస్పద వస్తువుగాని లభించలేదు. తరువాత ఈ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని టెలిఫోన్ ఎక్ఛేంజీ నుంచి ఆరా తీయగా మహారాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగ్‌పూర్ నుంచి ఫోన్ చేసిన సాగర్ మాంఢరేను అరెస్టు చేశారు. ముంబైలో స్థానిక మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల చుట్టూ తిరిగి..
నాగ్‌పూర్‌లో కోల్ ఫిల్డ్ స్టోన్ క్రషింగ్‌కు ఆనుకుని ఉన్న స్థలం తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి సాగర్ మాంఢరే అనేక సార్లు స్థానిక ప్రభుత్వం కార్యాలయాల చుట్టు తిరిగాడు. పని జరగకపోవడంతో తనకు న్యాయం చేయాలని తహశీల్దార్, జిల్లా కలెక్టర్, రీజినల్ కమిషనర్ తదితర ఉన్నత స్థాయి అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ, పరిపాలనా విభాగం రికార్డుల ప్రకారం ఆ స్థలం అస్థిత్వంలో లేదు. చివరకు కొద్ది నెలల కిందట ఆ స్థలానికి సంబంధించిన పత్రాలతో మంత్రాలయకు వచ్చి ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ విభాగానికి చెందిన కార్యదర్శులతో భేటీ అయ్యాడు. ఇక్కడ కూడా నిరాశే మిగలడంతో అధికారులను, కార్యదర్శులను అరెస్టు చేయాలని మంత్రాలయలో గొడవ చేశాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment