చెట్లకింద ‘పంచాయతీ’ వద్దు
చెట్లకింద ‘పంచాయతీ’ వద్దు
Published Fri, Jan 27 2017 2:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
కొత్తగా 914 గ్రామ పంచాయతీ భవనాలు
అధునాతన సౌకర్యాలతో నిర్మాణాలకు ఆదేశం
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.118.80 కోట్లు
అత్యధికంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు..
సాక్షి, కరీంనగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌జీఏ) కింద గ్రామ పంచాయతీలు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పాత 10 జిల్లాలల్లో కొత్తగా 914 భవనాలను నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి రూ.13 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి (పాత) కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఆరు కొత్త జిల్లాల్లో ఈ గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడమే లక్ష్యం. పది జిల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌కు 275, కరీంనగర్‌కు 257 కేటాయించారు. రంగారెడ్డికి 88, నిజామాబాద్‌కు 20, భద్రాద్రి కొత్తగూడెంకు 11, నల్ల గొండ 53, సూర్యాపేట 9, యాదాద్రి 98, ఖమ్మం 16, సంగారెడ్డికి 87 చొప్పున గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరక్టర్ నీతూప్రసాద్ జిల్లా పరిషత్‌లు, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ నిధులను ఉపాధి కూలీలు, మెటీరియల్ కాంపోనెట్‌ల కోసం 60:40 నిష్పత్తిలో ఖర్చు చేయనున్నారు.
శిథిలమైన భవనాలకు త్వరలో నిధులు..
పక్కా భవనాలు లేని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం కింద 2013లో నిధులు మంజూరయ్యాయి. అంచనాలు, నిధుల విడుదల ప్రక్రియలు పూర్తయి నిర్మాణాలు ప్రారంభించే తరుణంలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అప్పటికే ప్రారంభమైన పనులను పూర్తి చేసేవారు లేక చాలాచోట్ల నిలిచిపోయాయి. సర్పంచ్‌ల స్థానంలో పగ్గాలు చేపట్టిన ప్రత్యేకాధికారులు భవనాల నిర్మాణంపై దృష్టి సారించలేదు. అయితే కొత్త పాలకవర్గం వచ్చేసరికి నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో ఉన్న బడ్జెట్‌లోనే పని కానిద్దామన్న ధోరణితో నిర్మాణాలు పూర్తి చేసినా... అరకొర నిధులు, అసౌకర్యాల కారణంగా శిథిలమైన, అద్దె భవనాల్లోనే గ్రామ పంచాయతీల పాలన సాగుతోంది. ఫలితంగా జిల్లాల్లో పలు పంచాయతీలకు సొంత భవనాల విషయం కలగానే మిగిలింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో భవనానికి రూ.13 లక్షల చొప్పున, 914 గ్రామ పంచాయతీ భవనాల కోసం రూ.118.80 కోట్లు మంజూరు చేసింది. శిథిలావస్థకు చేరిన పాత కాలంనాటి భవనాల ఆధునీకరణ, కొత్త నిర్మాణాలకు కూడా త్వరలో నిధులు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి అందాయి.
Advertisement
Advertisement